విద్యార్థుల డేటాలో తప్పులుంటే మీదే బాధ్యత  | Strict Rules To Intermediate Board In Telangana | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 22 2018 1:47 AM | Last Updated on Sat, Dec 22 2018 1:47 AM

Strict Rules To Intermediate Board In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన డేటాలో దొర్లుతున్న తప్పులపై రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు మండిపడ్డారు. విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపు, పరీక్షలకు హాజరు కావాల్సిన సబ్జెక్టులు, మీడియం తదితర అంశాల్లో అనేక తప్పులు దొర్లుతున్నాయని, దీంతో విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని తాము ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని  ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపాళ్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లిలోని సంఘం కార్యాలయంలో పిన్సిపాళ్ల సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌ పి.మధుసూదన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విద్యార్థుల పరీక్షల ఫీజుల చెల్లింపు, నామినల్‌ రోల్స్‌కు సంబంధించి తలె త్తుతున్న పొరపాట్లపై చర్చించారు. వాటిని సవరించేందుకు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

బోర్డు కార్యదర్శిదే బాధ్యత 
ఆన్‌లైన్‌లో, నామినల్‌ రోల్స్‌లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, బోర్డు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని వైనంపై పిన్సిపాళ్లు పలు తీర్మానాలు ఆమోదించారు. ఈసారి పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా ఇంటర్‌ బోర్డు కార్యదర్శిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే సమస్యలకు కారణమని తెలిపారు. పరీక్షల కోసం జనరేట్‌ చేసే హాల్‌టికెట్లలో ఎలాంటి తప్పులు దొర్లినా, గంద రగోళం తలెత్తినా ప్రిన్సిపాళ్లకు ఎలాంటి బాధ్యత లేదని, బోర్డు కార్యదర్శి మాత్రమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ తీర్మానాలతో పాటు బోర్డు కార్యదర్శి తీరు, నామినల్‌ రోల్స్, విద్యార్థుల డాటాకు సంబంధించిన వివరాల్లో దొర్లుతున్న తప్పులపై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. 

అవసరమైన బడ్జెట్‌ కేటాయించాలి 
కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత బస్‌పాస్‌ సదుపాయం, ఉచిత యూనిఫాంలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉచిత విద్య ద్వారా ఏర్పడిన ఆర్థిక లోటును భర్తీ చేసి, కాలేజీలకు అవసరమైన బడ్జెట్‌ను కేటాయించాలని విన్నవించారు.  సమావేశంలో ప్రిన్సిపాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, ఇంటర్‌ బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement