- 23 వరకు కొనసాగనున్న పరీక్షలు
- ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ ఎగ్జామ్స్
- పరీక్ష ఫీజుకు గడువు ఈ నెల 22
సాక్షి, హైదరాబాద్: ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఆదివారం ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసింది. మే 15 నుంచి మే 23 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియ ర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు.
మూడ్రోజుల్లో మెమోలు
మూడ్రోజుల్లో మార్కుల జాబితాలు, మెమోలు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి, నోడల్ అధికారులకు పంపిస్తామని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. మార్కుల జాబితా, మెమోలను కాలేజీ ప్రిన్సిపాళ్లు ఈ నెల 19 నుంచి జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి, నోడల్ అధికారుల నుంచి పొందాలని ఆయన సూచించారు. మెమోల్లో తప్పిదాలుంటే మే 17లోగా ఇంటర్మీడియెట్ బోర్డుకు సంబంధిత ప్రిన్స్‌పాళ్లు నివేదించాలన్నారు.
అపరాధ రుసుముతో ఫీజుకు నో చాన్స్
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు తమ ఫీజును ఈ నెల 22లోగా తప్పనిసరిగా చెల్లించాలని బోర్డు కార్యదర్శి సూచించారు. గడువు తర్వాత అపరాధ రుసుముతో ఫీజులు తీసుకునే అవకాశం లేదన్నారు. సంబంధిత కాలేజీల్లోనే ఫీజు చెల్లించాలని, కోర్సు కేటగిరీల వారీగా ప్రత్యేకంగా ఫీజులు నిర్దేశించినట్లు వివరించారు. మార్చి పరీక్షల హాల్ టికెట్ నంబర్లే సప్లిమెంటరీకి వర్తిస్తాయన్నారు. ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్/ఫెయిల్ అయిన సబ్జెక్టు పరీక్షలు రాయాలనుకున్న వారు జనరల్ ఫీజుతో పాటు అదనంగా ప్రతి సబ్జెక్టుకు రూ.120 చొప్పున ఫీజు చెల్లించాలి.
ఇంప్రూవ్‌మెంట్‌లో పాత/కొత్త మార్కుల్లో ఎక్కువ మార్కులున్న వాటినే విద్యార్థికి కేటాయిస్తామని, అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికే బెస్ట్ స్కోర్ ఇస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు తెలిపింది. సెకండియర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెండేళ్ల వరకు ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశం ఉంది. మేలో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 2015 మార్చిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు చివరిసారిగా ఇంప్రూవ్‌మెంట్ రాసే వీలుంది. వారికి తాజా పరీక్షల్లో వచ్చే ఫలితాలనే పరిగణలోకి తీసుకుంటామని బోర్డు తెలిపింది.
మే 15 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
Published Mon, Apr 17 2017 2:05 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM
Advertisement