
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ బోర్డు అవకతవకల్లో ప్రభుత్వ తప్పిదం వల్లే ఉజ్వల భవిష్యత్తు ఉన్న 26మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ మండిపడ్డారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని చాచా నెహ్రూ నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న అనామిక, వెస్ట్ మారేడ్‌పల్లిలోని లాస్య కుటుంబాలను లక్ష్మణ్ పరామర్శిస్తూ.. ఇంటర్ అవకతవకలపై నిరవధిక దీక్ష చేసినా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై లక్ష్మణ్ నిరవదిక దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష అనంతరం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. మొదటి ఏడాదిలో మంచి మార్కులు సాధించి .. రెండో ఏడాదిలో ఎలా తప్పుతారని నిలదీశారు. ప్రభుత్వ నిర్వాకంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా విద్యార్థులను కలిచి వేస్తున్నాయని,
ప్రభుత్వానికి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఉసురు తగులుతుందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ చేసిన హత్యలేనని విమర్శించారు. అనామకి సోదరి చదువు పూర్తి బాధ్యత బీజేపీ తీసుకుంటుందని హామిఇచ్చారు. ఇంటర్ అవకతవకలపై రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలుస్తామన్నారు. ఇన్ని ఆత్మహత్యలు జరిగినా.. ప్రభుత్వం ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయన్నారు.