ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల రీవెరిఫికేషన్‌లో 1,137 మంది విద్యార్థుల భవిత మారింది. తొలుత విడుదల చేసిన ఫలితాల్లో వారంతా ఫెయిల్ కాగా, రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం రాత్రి ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షల్లో ఫెయిలైన 3,82,116 మంది విద్యార్థులకు చెందిన 9,02,429 జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడానికి బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన 1,137 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణులైనట్టు బోర్డు తెలిపింది. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 585 మంది ఉన్నట్లు వెల్లడించింది.