ఇంటర్మీడియెట్ 2014-15 విద్యాసంవత్సరం మొదటి, రెండో సంవత్సరపు పరీక్షలను పాత విధానంలోనే నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది.
రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చేవరకు పాత విధానమే అమలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ 2014-15 విద్యాసంవత్సరం మొదటి, రెండో సంవత్సరపు పరీక్షలను పాత విధానంలోనే నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, మొదటి ఏడాది పరీక్ష రద్దు తదితర కీలకాంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయానికి వస్తున్నారు. ఈ అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఒక స్పష్టత వచ్చేవరకు పాత పద్ధతిలోనే పరీక్షలను చేపట్టనున్నారు.
ఈలోపున రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో చేసే ప్రతిపాదనలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాత్రమే అమలు చేసేందుకు వీలవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను సకాలంలో నిర్వహించాలంటే ఆగస్టు నుంచే ఏర్పాట్లు ప్రారంభం కావాలి. ఒక రాష్ట్ర ప్రతిపాదనను మరో రాష్ట్రం నిరాకరిస్తుండడంతో సమస్య జటిలమవుతోంది. ఈ తరుణంలో సమయం దాటిపోతున్నందున ప్రస్తుత విధివిధానాల ప్రకారమే ముందుకు వెళ్లాలని ఇంటర్‌బోర్డు అధికారులు భావిస్తున్నారు.
ప్రశ్నపత్రాల రూపకల్పనపై భిన్న వాదనలు..
ఇంజనీరింగ్ తదితర కోర్సులకు ఉమ్మడి ప్రవేశాలతోపాటు ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజి ఉన్నందున ఒకేరకమైన ప్రశ్నపత్రం అమలు కావాలని, ప్రశ్నపత్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రూపొందిస్తే సులభ ప్రశ్నలు ఇచ్చారనే పరస్పర అనుమానాలు వస్తాయని ఏపీ అభిప్రాయపడుతోంది. ఇంటర్ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించాలని, ఒకే ప్రశ్నపత్రం అయితే.. తమ పిల్లలకు ఎక్కువమార్కులు సాధించడం కోసం ఎవరికి వారు ప్రశ్నపత్రాలు లీక్ చేసే ప్రమాదముందని తెలంగాణ ప్రాంత నేతలు అభిప్రాయపడుతున్నారు.
మంగళవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు, బోర్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రశ్నాపత్రాల అంశం చర్చకు వచ్చినా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.సీబీఎస్‌ఈ మాదిరిగా రెండో ఏడాది మాత్రమే పబ్లిక్ పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రతిపాదిస్తోంది. తెలంగాణనుంచి దీనికి వ్యతిరేకత వచ్చింది. ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ తాను ఏపీ క్యాడర్‌కు వెళ్తున్నందున నిర్ణయం తీసుకోవడం సబబుకాదంటూ విద్యాశాఖ కమిషనర్‌కు ఫైలు పంపేశారు.