సాక్షి, హైదరాబాద్ : గుర్తింపులేని నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలపై విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త రాజేష్ ప్రజా దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలలపై ఇంటర్ బోర్డు హైకోర్టుకు నివేదికను సమర్పించింది. ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎన్‌ఓసీ పొందని కాలేజీలకు షోకాజ్ నోటీసులిచ్చినట్లు తెలిపింది. అయితే మార్చి 4నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్థులపై ప్రభావం పడుతుందని ఇంటర్ బోర్డు హైకోర్టుకు స్పష్టం చేసింది. కాగా తాము షోకాజ్ నోటీస్‌లు జారీ చేసిన కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులున్నారని, అలాగే ఎన్‌ఓసీ లేని కాలేజీల్లోనూ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని పేర్కొంది. పరీక్షలు ముగిశాక కాలేజీలు మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. ఇంటర్ బోర్డు వాదనలు విన్న హైకోర్టు ఎన్‌ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment