NOC certificates
-
హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణాలు!
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో హైడ్రా కూడా భాగస్వామ్యం కానుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) ఉంటేనే నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. చెరువులు, నాలాలకు సమీపంలో నిర్మించే నివాస, వాణిజ్య సముదాయాలకు హైడ్రా ఎన్ఓసీ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఆయా భవనాలకు ఇంటి నంబరు, నల్లా, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయరు. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల చట్ట సవరణపై పురపాలకశాఖ కసరత్తు చేస్తోంది. ఇది అమలులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో గృహ కొనుగోలుదారులకు భరోసా కలుగుతుందని స్థిరాస్తి రంగం నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుదారుల భరోసాకే... దొడ్డిదారిలో అనుమతులు తీసుకొని.. చెరువులను ఆక్రమించిన భవన నిర్మాణాలను హైడ్రా కూల్చుతోంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ, జలాశయాలను కాపాడాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. కానీ.. హైడ్రా పనితీరుతో స్థిరాస్తి కొనుగోలుదారుల్లో గందరగోళం నెలకొంది. ఏ ప్రాజెక్ట్ సరైనదో తెలియక సందిగ్ధంలో పడిపోయారు. దీంతో గృహ కొనుగోళ్లు తగ్గడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు భరోసా కలిగించేందుకు నిర్మాణ అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. గతంలో రెరా తీసుకొచ్చిందీ ఇలాగే.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ (రెరా) కంటే ముందు డెవలపర్లు నిర్మాణ అనుమతులు రాకముందే అబద్ధపు హామీలతో ముందుగానే విక్రయించేవారు. తీరా న్యాయపరమైన చిక్కులతో సంబంధిత ప్రాజెక్ట్‌కు అనుమతులు మంజూరు కాకపోవడంతో కస్టమర్లు రోడ్డున పడేవారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు కేంద్రం రెరాను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు భద్రత, పారదర్శకత, నిర్మాణంలో నాణ్యత పెరిగాయి. నిర్మాణ అనుమతులతోపాటు రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులలో కొనుగోళ్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు భవన నిర్మాణాలకు ఎలాగైతే రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్, ఎని్వరాన్‌మెంట్ వంటి పలు శాఖల ఎన్ఓసీ తప్పనిసరో...అలాగే హైడ్రా అనుమతి కూడా కావాల్సిందే. కేవైసీ లాగే కేవైఎల్ చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా కూల్చివేతలతో ఇబ్బందులు ఎదురవుతున్నా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రయోజనం చేకూరుతుంది. వరదలు, నీటికొరత, భూగర్భ జలాల తగ్గుదల వంటి ఇబ్బందులు తలెత్తవు. భావితరాలకు సమృద్ధిగా జల వనరులు, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బ్యాంక్‌లు, బీమా సంస్థలు ఎలాగైతే ‘నో యువర్ కస్టమర్’(కేవైసీ) నిర్థారించిన తర్వాతే సేవలు అందిస్తాయో.. అచ్చం అలాగే గృహ కొనుగోలుదారులు ‘నో యువర్ లొకాలిటీ’(కేవైఎల్) ఆయా ప్రాంతం గురించి తెలుసుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కస్టమర్లకు నమ్మకం కలుగుతుంది ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల్లో నెలకొన్న గందరగోళానికి హైడ్రా ఎన్ఓసీ చక్కని పరిష్కారం. దీంతో భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయం కస్టమర్లలో తొలగిపోతుంది. రియల్టీ రంగంపై విశ్వాసం పెరిగి, మార్కెట్ తిరిగి పుంజుకుంటుంది. – నరేంద్రకుమార్, ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ సింగిల్ విండో తీసుకురావాలి ఇప్పటికే పలు విభాగాల నుంచి ఎన్ఓసీలు తీసుకురావాలంటే 6–9 నెలల సమయం పడుతుంది. కొత్తగా హైడ్రా ఎన్ఓసీ అంటే ఏడాది సమయం పడుతుంది. దీంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగదు. అందుకే సింగిల్‌విండో ద్వారా అన్ని విభాగాల ఎన్ఓసీలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. – పోశం నర్సిరెడ్డి, ఐరా రియాల్టీ ఎండీ -
బిగిస్తున్న ‘ఎన్ఓసీ’ ఉచ్చు
డబ్బులకోసం గడ్డి తిన్నారు.. కాసులు కనిపించగానే కళ్లుమూసుకుని సంతకాలు పెట్టేశారు. ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. కర్ణాటక నుంచి నకిలీ ఎన్ఓసీలు తెచ్చి కార్లు విక్రయించిన కేసులో విచారణ ముమ్మరం కావడంతో.. కొందరు ఆర్టీఏ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి, అనంతపురం: కర్ణాటక వాహనాలకు నకిలీ ఎన్ఓసీలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన కార్ల కుంభకోణం కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొన్న కొంతమంది రిమాండ్‌కు వెళ్లి బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ కేసు ఆర్టీఏ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. నకిలీ ఎన్ఓసీలతో వాహనాలు రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న అధికారుల్లో కలవరం మొదలైంది. అధికారుల సహకారంతోనే.. గతేడాది సెప్టెంబర్‌లో రవాణాశాఖలో అతి పెద్ద కుంభకోణం వెలుగుచూసింది. నాగాలాండ్‌లో బీఎస్–3 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బీఎస్–4గా రిజిస్ట్రేషన్ చేసిన కుంభకోణాన్ని అధికారులు బయటపెట్టారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి రిమాండ్‌కు వెళ్లి వచ్చారు. సెప్టెంబర్‌లోనే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకు కర్ణాటక వాహనాలను కొనుగోలు చేసి నకిలీ ఎన్ఓసీలను సృష్టించడం.. జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించి వాటిని ఎక్కువ మొత్తానికి అమాయకులకు అంటగట్టిన ముఠా ఆగడాలు బయటపడ్డాయి. అయితే వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులే కాకుండా.. కొందరు అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ముందునుంచీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగంలోకి కర్ణాటక పోలీసులు నకిలీ ఎన్ఓసీలు సృష్టించి కార్లను రిజిస్ట్రేషన్ చేసిన కేసును కర్ణాటక పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది ప్రైవేటు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎన్ఓసీలతో జిల్లాకు వచ్చిన వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై చర్యలకు సమాయత్తమైనట్లు సమాచారం. ఇప్పటికే ఫైల్స్‌ను అప్రూవల్ చేసిన ఆర్టీఓ కార్యాలయ క్లర్క్, ఏఓలపై సస్పెన్షన్ వేటు పడింది. త్వరలో మరికొంతమంది అధికారులపై వేటు పడనున్నట్లు తేలింది. దాదాపు 80 వాహనాల వరకూ నకిలీ ఎన్ఓసీలతో అక్రమంగా రిజస్ట్రేషన్ అయినట్లు గుర్తించిన పోలీసులు.. వాటికి రిజిస్ట్రేషన్ చేసిన బాధ్యులెవరన్నది కూడా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కొంతమంది ఆర్టీఏ అధికారులు బెంగళూరు పోలీసుల విచారణకు హాజరై వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే మరికొందరిపై వేటు పడే అవకాశముండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. -
జూనియర్ కాలేజీలకు ‘ఫైర్’!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ‘అగ్గి’రాజుకుంది. యాజమాన్యాలకు సెగ తగిలింది. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జారీ చేసే కాలేజీ అనుబంధ గుర్తింపునకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని(ఎన్ఓసీ) సమర్పించాలనే నిబంధన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇదివరకు 15 మీటర్ల ఎత్తు వరకున్న భవనాలకు ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ అవసరం లేదు. తాజాగా సవరించిన నిబంధన ప్రకారం ఆరు మీటర్లు మించి ఎత్తున్న భవనంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఫైర్ ఎన్ఓసీ తప్పకుండా సమర్పించాలి. రాష్ట్రంలో 2, 472 ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో 404 ప్రభుత్వ కాలేజీలు కాగా... మరో మూడువందల వరకు గురుకుల, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలున్నాయి. తాజా నిబంధన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1, 450 కాలేజీలు ఫైర్ ఎన్ఓసీలు సమర్పించాలి. ప్రస్తుతం ఈ కాలేజీలున్న భవనం తీరు, సెట్‌బ్యాక్ స్థితి ఆధారంగా ఫైర్ ఎన్ఓసీ వచ్చేది కష్టమే అని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వీటికి 2020–21 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు లభించడం అసాధ్యమే. హఠాత్తుగా అమల్లోకి తెచ్చిన ఫైర్ ఎన్ఓసీపై ఆయా యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గుర్తింపు రాకుంటే ఎలా...? రెండ్రోజుల్లో ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము చదివే కాలేజీకి గుర్తింపు ఇవ్వకుంటే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు కరోనా వైరస్‌తో విద్యాసంవత్సరం తీవ్ర గందరగోళంగా మారింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జూనియర్ కాలేజీలు గుర్తింపునకు నోచుకోకుంటే ఇంటర్ విద్యపై తీవ్ర ప్రభావం పడనుంది. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించేందుకు యాజమాన్యాలు సిద్ధమవ్వగా... టీశాట్ ద్వారా వీడియో పాఠాలు చెప్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఫస్టియర్ అడ్మిషన్లు ఎలా... ఇంటర్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకావొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 5.3 లక్షల మంది ఇటీవల పదోతరగతి పాసయ్యారు. ఓపెన్ టెన్త్ ద్వారా మరో 70 వేల మంది ఇంటర్ ప్రవేశానికి అర్హత సాధించారు. రాష్ట్రంలోని కాలేజీలన్నీ పూర్తిస్థాయిలో అడ్మిషన్లు తీసుకుంటేనే ఆరు లక్షల మంది ఇంటర్లో ప్రవేశిస్తారు. అలా కాకుండా సగం కాలేజీలకు అనుమతి ఇవ్వకుంటే దాదాపు 3 లక్షల మందికి ఇంటర్లో చేరే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఫైర్ ఎన్ఓసీ నిబంధనపై ప్రభుత్వం త్వరితంగా నిర్ణయం తీసుకుంటే తప్ప గందరగోళానికి తెరపడదు. ‘గతంలో ఉన్న నిబంధన ప్రకారం 15 మీటర్ల వరకు ఎన్ఓసీ ఆవశ్యకత లేకుండా అనుబంధ గుర్తింపు ఇవ్వాలి ’అని ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరిసతీశ్ ‘సాక్షి’తో అభిప్రాయం వ్యక్తం చేశారు. -
'గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకొండి'
సాక్షి, హైదరాబాద్ : గుర్తింపులేని నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలపై విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త రాజేష్ ప్రజా దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలలపై ఇంటర్ బోర్డు హైకోర్టుకు నివేదికను సమర్పించింది. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ పొందని కాలేజీలకు షోకాజ్ నోటీసులిచ్చినట్లు తెలిపింది. అయితే మార్చి 4నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్థులపై ప్రభావం పడుతుందని ఇంటర్ బోర్డు హైకోర్టుకు స్పష్టం చేసింది. కాగా తాము షోకాజ్ నోటీస్‌లు జారీ చేసిన కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులున్నారని, అలాగే ఎన్ఓసీ లేని కాలేజీల్లోనూ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని పేర్కొంది. పరీక్షలు ముగిశాక కాలేజీలు మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. ఇంటర్ బోర్డు వాదనలు విన్న హైకోర్టు ఎన్ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. -
ఎల్ఆర్ఎస్కు ఎన్ఓసీ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల క్లియరెన్స్‌కు రెవెన్యూ శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు(ఎన్ఓసీ) తేవడం కష్టంగా మారింది. రెండు నెలలుగా ఆయా జిల్లాల్లోని తహసీల్దార్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా కేవలం మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా నుంచి 183 ఎన్ఓసీలు రావడం తప్ప ఇతర జిల్లాల నుంచి కనీస స్పందన రాకపోవడం గమనార్హం. గత నెల 31న ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ గడువు ముగియడంతో ప్రాసెస్‌లో ఉన్న 9 వేల ఎన్ఓసీల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మరోసారి అవకాశమివ్వాలంటూ హెచ్ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఆగస్టు 31 వరకు గడువునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల మార్గదర్శనంలో తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులను కలిసి సాధ్యమైనంత తొందరగా ఎన్ఓసీలు తేవాలని హెచ్ఎండీఏ కమిషనర్ ప్లానింగ్ విభాగ సిబ్బందిని ఆదేశించారు. అయితే ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత వల్ల పని వేగవంతం కావడం లేదు. వంద మందికిపైగా సిబ్బంది అవసరమున్నా ప్లానింగ్ విభాగంలో కేవలం 33 మందే పనిచేస్తున్నారు. వీరు అటు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం సేవలు, ఇటు ఎల్ఆర్ఎస్ పనులు చూసుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇంత తీరిక లేని పనుల్లో ఉంటూ ఎన్ఓసీల కోసం తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరుతుంటే అక్కడి సిబ్బంది రేపు, మాపు అంటూ తిప్పుకొంటూ కాలాయాపన చేస్తున్నారు. తప్పని ఆపసోపాలు హెచ్ఎండీఏ చొరవ తీసుకున్న తొమ్మిదివేల దరఖాస్తులకు నిరంభ్యతర ధ్రువీకరణ పత్రాలు(ఎన్ఓసీ) తెచ్చుకునే విషయంలో ఆ సంస్థ ఆపసోపాలు పడుతోంది. ఇన్నాళ్లు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎదుర్కొన్న అనుభవాలే హెచ్‌ఎండీఏకూ ఎదురవుతుండడంతో సిబ్బందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆయా జిల్లాల కలెక్టర్లు కింది స్థాయి సిబ్బంది ఆదేశించినా ఆశించిన స్థాయిలో వారి నుంచి స్పందన రావడం లేదు. సామాన్యుడి మాదిరిగానే హెచ్ఎండీఏ అధికారులు వారిచుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఒక్క మేడ్చల్ జిల్లా నుంచి తప్ప రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల నుంచి ఇప్పటి దాకా ఒక్క ఎన్ఓసీ కూడా తేలేకపోయారు. ఫీజు కట్టనివారికి అవకాశం గతంలో ఎల్ఆర్ఎస్ ఇనిషియల్ పేమెంట్ చెల్లించని కారణంతో తిరస్కరణకు గురైన 9,842 దరఖాస్తులను ప్రాసెస్ చేయాలంటూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుదారులు రూ.10 వేల ఫీజు చెల్లిస్తే దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు హెచ్ఎండీఏకు ఎల్ఆర్ ఫీజుల రూపంలో రూ.691 కోట్లు, నాలా చార్జీల రూపంలో రూ.246 కోట్లు వచ్చాయి. -
ఇవి లేకుంటే క్రిమినల్ కేసులే
కడప అర్బన్ : మీకు విద్యా, వ్యాపారసంస్థలు, గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంకులు, కుటీర, పెద్ద పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా.. ఉంటే వెంటనే అగ్ని ప్రమాద నివారణ పరికరాలను ఏర్పాటుచేసుకోవాలి. అంతేకాక ఎన్ఓసీ సర్టిఫికెట్‌పొందాలి. ఈ సర్టిఫికెట్‌ను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి. లేకుంటే క్రిమినల్ కేసులు తప్పవు. ప్రొవిజినల్ సర్టిఫికెట్ తీసుకుని ఇంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను తీసుకోని సంస్థలు జిల్లా వ్యాప్తంగా 187 ఉన్నాయి. వీరికి ఫైనల్ నోటీసులను అగ్నిమాపక శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ నోటీసులకు నెలలోపు స్పందించి ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకోకపోతే కఠిన చర్యలను తీసుకోనున్నారు. ఎన్ఓసీకి దరఖాస్తు ఇలా..! వ్యాపార, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లవారు అగ్నిమాపక శాఖ అధికారుల చేత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) తీసుకోవాలి. వీటిల్లోనే రద్దీ నిరంతరం ఉంటుంది. మంటలను ఆర్పే గ్యాస్ సిలిండర్లు, ఇసుక బకెట్లు, ఆయా సంస్థ విస్తీర్ణతను అనుసరించి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో చదరపు అడుగుకు రూ.10 చొప్పున ఏ మేరకు విస్తీర్ణముందో అంత మొత్తాన్ని చలానా రూపంలో చెల్లించాలి. అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలించి ఎన్ఓసీ ఇస్తారు. ఈ సర్టిఫికేట్కు సంవత్సరం గడువు మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ కోసం రూ.10వేల చలానా చెల్లించాలి. నోటీసులు సిద్ధం 1998 వరకు ఎన్ఓసీ సర్టిఫికెట్ తీసుకున్న వారు తర్వాత రెన్యువల్ చేయించుకోని కారణంగా 187 నోటీసులు సిద్ధం చేశారు. అంతేకాక 2007లో ప్రొవిజినల్ ఎన్ఓసీ తీసుకున్న వారు ఇప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోని కారణంగా వారికి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. వీరందరూ ప్రస్తుతం ఎన్ఓసీ చేయించుకోవాలంటే ప్రతి సంవత్సరం వారి చలానా మొత్తానికి 24 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి ఎన్ఓసీ తీసుకోవాలి జిల్లాలో నోటీసులు పొందిన సంస్థలతోపాటు ఇంకా ఎన్ఓసీ తీసుకోని వారు అగ్నిప్రమాద నివారణ పరికరాలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు స్వచ్ఛంధంగా దరఖాస్తు చేసుకుని ఎన్ఓసీ తీసుకోవాలి. ప్రొవిజినల్ ఎన్ఓసీ తీసుకుని ఆక్యుపెన్సీ తీసుకోకపోతే నేరమవుతుంది. ఎన్ఓసీ చేయించుకోవడంలో గానీ, రెన్యువల్ చేసుకోవడంలో గానీ నిర్లక్ష్యం వహిస్తే ఆ సంస్థకు రెండు నోటీసులు జారీ చేస్తాం. అప్పటికీ స్పందించకపోతే మూడవ నోటీసు ఇచ్చి నెల గడువు విధిస్తాం. తర్వాత సంస్థ గురించి డీజీకి ఫిర్యాదు చేస్తాం. అప్పటికీ స్పందించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. - బి.వీరభద్రరావు, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి, వైఎస్ఆర్ జిల్లా.