చెరువులు, నాలాల సమీపంలోని భవనాలకు అనుమతులు తప్పనిసరి
అక్రమంగా నిర్మిస్తే ఇంటినంబరు, నల్లా, విద్యుత్ కనెక్షన్లు రానట్టే..
ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల సవరణపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో హైడ్రా కూడా భాగస్వామ్యం కానుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) ఉంటేనే నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. చెరువులు, నాలాలకు సమీపంలో నిర్మించే నివాస, వాణిజ్య సముదాయాలకు హైడ్రా ఎన్‌ఓసీ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.
ఒకవేళ అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఆయా భవనాలకు ఇంటి నంబరు, నల్లా, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయరు. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల చట్ట సవరణపై పురపాలకశాఖ కసరత్తు చేస్తోంది. ఇది అమలులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో గృహ కొనుగోలుదారులకు భరోసా కలుగుతుందని స్థిరాస్తి రంగం నిపుణులు చెబుతున్నారు.
కొనుగోలుదారుల భరోసాకే...
దొడ్డిదారిలో అనుమతులు తీసుకొని.. చెరువులను ఆక్రమించిన భవన నిర్మాణాలను హైడ్రా కూల్చుతోంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ, జలాశయాలను కాపాడాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. కానీ.. హైడ్రా పనితీరుతో స్థిరాస్తి కొనుగోలుదారుల్లో గందరగోళం నెలకొంది. ఏ ప్రాజెక్ట్ సరైనదో తెలియక సందిగ్ధంలో పడిపోయారు. దీంతో గృహ కొనుగోళ్లు తగ్గడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు భరోసా కలిగించేందుకు నిర్మాణ అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.
గతంలో రెరా తీసుకొచ్చిందీ ఇలాగే..
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ (రెరా) కంటే ముందు డెవలపర్లు నిర్మాణ అనుమతులు రాకముందే అబద్ధపు హామీలతో ముందుగానే విక్రయించేవారు. తీరా న్యాయపరమైన చిక్కులతో సంబంధిత ప్రాజెక్ట్‌కు అనుమతులు మంజూరు కాకపోవడంతో కస్టమర్లు రోడ్డున పడేవారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు కేంద్రం రెరాను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు భద్రత, పారదర్శకత, నిర్మాణంలో నాణ్యత పెరిగాయి.
నిర్మాణ అనుమతులతోపాటు రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులలో కొనుగోళ్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు భవన నిర్మాణాలకు ఎలాగైతే రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్, ఎని్వరాన్‌మెంట్ వంటి పలు శాఖల ఎన్‌ఓసీ తప్పనిసరో...అలాగే హైడ్రా అనుమతి కూడా కావాల్సిందే.
కేవైసీ లాగే కేవైఎల్
చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా కూల్చివేతలతో ఇబ్బందులు ఎదురవుతున్నా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రయోజనం చేకూరుతుంది. వరదలు, నీటికొరత, భూగర్భ జలాల తగ్గుదల వంటి ఇబ్బందులు తలెత్తవు. భావితరాలకు సమృద్ధిగా జల వనరులు, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బ్యాంక్‌లు, బీమా సంస్థలు ఎలాగైతే ‘నో యువర్ కస్టమర్’(కేవైసీ) నిర్థారించిన తర్వాతే సేవలు అందిస్తాయో.. అచ్చం అలాగే గృహ కొనుగోలుదారులు ‘నో యువర్ లొకాలిటీ’(కేవైఎల్) ఆయా ప్రాంతం గురించి తెలుసుకున్న తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కస్టమర్లకు నమ్మకం కలుగుతుంది
ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల్లో నెలకొన్న గందరగోళానికి హైడ్రా ఎన్‌ఓసీ చక్కని పరిష్కారం. దీంతో భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయం కస్టమర్లలో తొలగిపోతుంది. రియల్టీ రంగంపై విశ్వాసం పెరిగి, మార్కెట్ తిరిగి పుంజుకుంటుంది.
– నరేంద్రకుమార్, ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్
సింగిల్ విండో తీసుకురావాలి
ఇప్పటికే పలు విభాగాల నుంచి ఎన్‌ఓసీలు తీసుకురావాలంటే 6–9 నెలల సమయం పడుతుంది. కొత్తగా హైడ్రా ఎన్‌ఓసీ అంటే ఏడాది సమయం పడుతుంది. దీంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగదు. అందుకే సింగిల్‌విండో ద్వారా అన్ని విభాగాల ఎన్‌ఓసీలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
– పోశం నర్సిరెడ్డి, ఐరా రియాల్టీ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment