ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల సీడీని ఎట్టకేలకు ఇంటర్మీడియెట్ బోర్డు ఎంసెట్ కమిటీకి శుక్రవారం అందజేసింది. దీంతో ఎంసెట్ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. ఈ నెల 27న రీవెరిఫికేషన్ ఫలితాల వెల్లడి తరువాత సీడీని వెంటనే ఇంటర్ బోర్డు ఎంసెట్ కమిటీకి అందజేస్తుందని భావించినా సీడీని ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో ఎంసెట్ ఫలితాలు/ర్యాంకుల వెల్లడి ఆలస్యమైంది. తాజాగా శుక్రవారం సీడీని అందజేయడంతో వెంటనే ఫలితాల ప్రాసెస్‌ను ప్రారంభించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు.
రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, గతంలోనే పాసైనా... రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను తీసుకొని వాటికి 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకుల ఖరారుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే ర్యాంకులను ఏ రోజున ప్రకటించాలన్న దానిపై శనివారం స్పష్టత వస్తుందని తెలిపారు. దీంతో వీలైతే ఆదివారం లేదంటే సోమవారం ఎంసెట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. గతనెల 3, 4, 6, 8, 9 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,31,209 మంది పరీక్షలకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment