సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల వెల్లడి తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఏపీతోపాటే తెలంగాణలోనూ పరీక్షలు జరిగినా ఫలితాలను వెల్లడించలేని పరిస్థితి నెలకొంది. అవే కాదు ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఎదురవుతున్న ప్రతి సమస్య పరిష్కారంలో ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా విఫలమైంది. ఆన్‌లైన్ ప్రవేశాల ప్రక్రియ నుంచి ఫలితాల ప్రక్రియ వరకు అన్నింటా బోర్డు పూర్తిగా వైఫల్యం చెందిందనే అభిప్రాయం విద్యారంగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రతి దశలోనూ లోపాలు, తప్పిదాలతో ఆందోళనకర పరిస్థితులను తెచ్చిపెట్టిందని, అధికారుల నిర్లక్ష్యం, ముడుపుల బాగోతంలో తమకు నచ్చిన సంస్థలకు పనులను అప్పగించిన ఉన్నతాధికారుల వైఖరితోనే సకాలంలో ఫలితాలను ప్రకటించలేని దుస్థితి నెలకొందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫలితాల కోసం ఎదురుచూపులు..
ఏపీతో పాటే రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలను ప్రారంభించిన బోర్డు.. ఫలితాలను మాత్రం శుక్రవారం ఏపీతోపాటు ప్రకటించలేకపోయింది. దీంతో రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడొస్తాయంటూ 10 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విడిపోయిన ఏపీలో కొత్త ఇంటర్ బోర్డును ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతుంటే.. తెలంగాణలో ఇంటర్ బోర్డుకు పక్కా వ్యవస్థ, ప్రభుత్వం నుంచి సహకారమున్నా బోర్డు కార్యదర్శి ఇష్టారాజ్య నిర్ణయాలతో గందరగోళ పరిస్థితులు తెచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్‌ను అమలు చేయలేదు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న మార్కుల విధానాన్ని తొలగించి, గ్రేడింగ్ విధానం అమల్లోకి తేవాలన్న నిపుణుల కమిటీ సిఫారసులను అమల్లోకి తేలేదు. బోర్డు తప్పిదాల కారణంగా ఫలితాల్లో తప్పులు దొర్లితే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురవుతారన్న ఆలోచనతో చివరకు ప్రభుత్వమే జోక్యం చేసుకొని ఈ ఫలితాల ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతలను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం ఎవాల్యుయేషన్ డైరెక్టర్‌కు అప్పగించినట్లు తెలిసింది. అయితే ఆ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నా బోర్డు వైఫల్యాలపై అధికారులు, ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
అడుగడుగునా వైఫల్యాలే..
ఈ విద్యాసంవత్సరంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో బోర్డు ఉన్నతాధికారులు ఆన్‌లైన్ ప్రవేశాలు, పరీక్ష ఫీజుల చెల్లింపు, హాల్‌టికెట్ల జనరేషన్, ఫలితాల ప్రక్రియ వంటి పనులను ఓ సంస్థకు అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆ సంస్థ పాత రికార్డు ఆధారంగా పనులను అప్పగించాల్సి ఉన్నా అవేవి చూడకుండానే అప్పగించినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆ సంస్థ కారణంగా సమస్యలు మొదలయ్యాయి. ఇటు ప్రీ ఎగ్జామినేషన్ వర్క్‌ను అప్పటివరకు చేస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)ను కాదని ప్రైవేటు సంస్థకు అప్పగించడంతోనే మరిన్ని సమస్యలు తలెత్తాయి.
బోర్డు అధికారులు అప్పగించిన సంస్థ ఆన్‌లైన్ ప్రవేశాలను చేపట్టలేకపోయింది. కాలేజీల్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సమాచారాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లో రికార్డు చేయలేకపోయింది. దీంతో గందరగోళం నెలకొనడంతో బోర్డు అధికారులు మళ్లీ సీజీజీకే విజ్ఞప్తి చేసి, ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం పరీక్ష ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్ల జనరేషన్ పనులను మళ్లీ సదరు సంస్థకే అప్పగించడంతో మళ్లీ సమస్యలు తలెత్తాయి. బోర్డు ఫీజు చెల్లింపునకు సెప్టెంబర్ 17 నుంచి చర్యలు చేపట్టినా పేమెంట్ గేట్‌వే అక్టోబర్ 16 వరకు ఓపెన్ కాలేదు. ఆ తర్వాత కాలేజీలు ఫీజులు చెల్లించాయి. కానీ ఆ మొత్తాలు బోర్డుకు చేరలేదు. దీంతో బోర్డు అధికారులు మళ్లీ ఫీజులు చెల్లించాలని, మొదట చెల్లించిన మొత్తాన్ని తర్వాత తిరిగి ఇస్తామని చెప్పడంతో యాజమాన్యాలు మళ్లీ ఫీజులు చెల్లించాయి. కానీ ఏ కాలేజీ రెండు సార్లు ఫీజులు చెల్లించిందన్న ఆన్‌లైన్ వివరాలను ఇంతవరకు సదరు సంస్థ ఇవ్వలేకపోయింది. దీంతో యాజమాన్యాలు బోర్డు చుట్టూ తిరుగుతున్నాయి.
ప్రాక్టికల్స్ నుంచి మూల్యాంకనం వరకు..
ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో ఏరోజుకారోజు సబ్మిట్ చేయాలి. కానీ సాఫ్ట్‌వేర్ సమస్యలతో దాదాపు 72 వేల మంది ఒకేషనల్ విద్యార్థుల మార్కులు అప్‌లోడ్ కాలేదు. దీంతో మళ్లీ కాలేజీల నుంచి తెప్పించి వేయాల్సి వచ్చింది. హాల్‌టికెట్ల జనరేషన్‌లోనూ అనేక తప్పులు దొర్లాయి. ఇటు ప్రశ్నపత్రాల పంపిణీలోనూ సమన్వయ లోపంతో సమస్యలు ఎదురయ్యాయి. వరంగల్ జిల్లా నర్సంపేట్‌లోని కాలేజీకి ఒక పరీక్షకు బదులు మరో పరీక్ష ప్రశ్నపత్రాలను పంపించారు. ఒకేషనల్ విద్యార్థుల ప్రశ్నపత్రాలు అయితే జిరాక్స్ సెంటర్లలో జిరాక్స్ తీసి పరీక్షలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. పరీక్షలు అయ్యాక మూల్యాంకన పనుల విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు.
ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లోని స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలకు అక్కడున్న అధ్యాపకులు దిద్దాల్సిన జవాబు పత్రాల కంటే వేలల్లో అధికంగా పంపించారు. దీంతో వాటిని మళ్లీ మరో జిల్లాలకు తరలించాల్సి వచ్చింది. ఇలా అనేక తప్పిదాలు జరుగుతున్నా బోర్డు కార్యదర్శికి పట్టింపులేదని కొందరు ఆరోపిస్తున్నారు. పైగా ఆయన రోజూ ఉదయం కాకుండా సాయంత్రం వేళ్లలో కార్యాలయానికి రావడం, కిందిస్థాయి అధికారులతో సమన్వ యం కొరవడి ఈ గందరగోళం నెలకొందన్న విమర్శలున్నా యి. ఇక జేఎన్‌టీయూ అధికారికి ఫలితాల ప్రక్రియ బాధ్యతను అప్పగించడంతో వాటిని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సిన నేపథ్యంలో ఫలితాల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలో స్పష్టత వస్తుందని బోర్డు చెబుతున్నా.. అంత తొందరగా తేలకపోవచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment