ఇకపై ఇంటర్‌ కళాశాలల గుర్తింపు,అడ్మిషన్లకు ఆన్‌లైన్‌ | Intermediate Board proposal To AP Govt | Sakshi
Sakshi News home page

ఇకపై ఇంటర్‌ కళాశాలల గుర్తింపు,అడ్మిషన్లకు ఆన్‌లైన్‌

Published Sat, Feb 22 2020 4:07 AM | Last Updated on Sat, Feb 22 2020 4:07 AM

Intermediate Board proposal To AP Govt - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ విద్యా సంస్థల్లో అక్రమాలకు చరమగీతం పాడుతూ విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకు ముకుతాడు పడేలా పలు చర్యలను చేపట్టనుంది. ఆయా కళాశాలలకు గుర్తింపు, అడ్మిషన్లకు సంబంధించి ఇంటర్మీడియెట్‌ బోర్డు ఇంతకుముందే ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపింది. వీటికి ఆమోదముద్ర పడగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అమల్లోకి తేనున్నారు. కాలేజీలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్మీడియెట్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకొని గుర్తింపునకు అనుమతులు పొందుతున్నాయి. కేవలం కాగితాలపై నిర్ణీత సదుపాయాలు అన్నీ ఉన్నట్లు చూపుతున్నా వాస్తవానికి ఆయా కాలేజీల్లో అవేవీ ఉండడం లేదు.

కొన్ని సంస్థలు అనుమతులు పొందే ప్రాంతం ఒకటి కాగా కాలేజీని మరో ప్రాంతంలో నిర్వహించడం పరిపాటిగా మారింది. ఒక కాలేజీకి, పరిమిత సెక్షన్లకు అనుమతులు తీసుకొని రెండు మూడు కాలేజీలకు సంబంధించిన విద్యార్థులందరినీ ఒకే గదిలో పెట్టి బోధన సాగిస్తున్నారు. ఇలా అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వానికి నిర్ణీత రుసుములు కూడా చెల్లించకుండా పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు రూ.కోట్లు కొల్లగొడుతున్నాయి. వీటికి ముకుతాడు వేసేందుకు వీలుగా గుర్తింపు ప్రక్రియను ఇకపై ఆన్‌లైన్‌ చేయనున్నారు. ప్రతి కాలేజీ అనుమతి కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. కాలేజీ భవనం ఉన్న ప్రాంతంతోపాటు, తరగతి గదులు, దానికి అనుబంధంగా ఆటస్థలం, లైబ్రరీ, లేబొరేటరీ వంటి వసతులన్నిటినీ ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఇంటర్మీడియెట్‌ బోర్డు వీటిని జియోట్యాగింగ్‌ చేస్తుంది. కాలేజీ పేర్కొన్న స్థలంలో భవనం, ఆటస్థలం ఉన్నట్లు తేలితేనే గుర్తింపు వస్తుంది. 

కోచింగ్‌లకు కాలేజీలకు సంబంధం లేదు 
ఇంటర్మీడియెట్‌ కాలేజీల్లో ఇంటర్‌ పాఠ్యాంశాల బోధన తప్ప ఇతర కోచింగ్‌లకు ఆస్కారం లేకుండా బోర్డు చర్యలు చేపడుతోంది. కాలేజీలకు, కోచింగ్‌లకు సంబంధం లేదని ఇప్పటికే విద్యా శాఖ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. అలాగే హాస్టళ్లలోని పరిస్థితులు దారుణంగా ఉంటున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిపైనా కొన్ని సంస్కరణలకు వీలుగా ప్రతిపాదనలు అందించింది. ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు తమ ఇష్టానుసారం అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను పట్టించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మహిళలకు నిర్ణీత కోటాలో సీట్లు కేటాయించాల్సి ఉన్నా వాటిని బేఖాతరు చేస్తున్నాయి.

ఫీజులను కూడా కాకుండా ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి. వీటికి ఇకపై చెక్‌ పడనుంది. అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజుల వసూళ్లను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ఇంటర్‌ బోర్డ్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు నీట్, ఎంసెట్‌ తరహాలో ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించనుంది. రాష్ట్రంలో బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీలు, వాటిలో సెక్షన్లు, కోర్సు గ్రూపుల సమాచారాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లో విద్యార్థులు,తల్లిదండ్రులకు తెలిసేలా ఈ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. టెన్త్‌ పాసయ్యే విద్యార్థులు దీని ద్వారా తమ మండలం, జిల్లా, రాష్ట్రంలోని ఏ కాలేజీలో, ఏ కోర్సులో చేరాలనుకుంటారో ఆ మేరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆ విద్యార్థి మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించి కాలేజీలో సీటు ఆన్‌లైన్‌లో అలాట్‌ అవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement