పిల్లల ఉసురు తగులుద్ది! | Inter Students Parents Fires On Inter Board Officials | Sakshi
Sakshi News home page

పిల్లల ఉసురు తగులుద్ది!

Published Tue, Apr 23 2019 1:34 AM | Last Updated on Tue, Apr 23 2019 8:16 AM

Inter Students Parents Fires On Inter Board Officials - Sakshi

ఇంటర్‌ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

సాక్షి, హైదరాబాద్‌:  విద్యార్థుల ఆక్రందనలు.. తల్లిదండ్రుల శాపనార్థాలు... విద్యార్థి సంఘాల ముట్టడి యత్నాలు.. తోపులాటలు.. అరెస్టులతో నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు అట్టుడికిపోయింది. ఫలితాల్లో దొర్లిన తప్పులకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు సోమవారం ఉదయం బోర్డును ముట్టడించేందుకు యత్నించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు బోర్డు ముందు భారీగా మోహరించి, లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులను బలవంతంగా అరెస్ట్‌ చేసి గోషామహల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్, అనిల్‌కుమార్‌ యాదవ్‌లను బేగంపేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరుస ఆందోళనలు.. అరెస్టులతో రెండోరోజు కూడా ఇంటర్మీడియట్‌ బోర్డు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. 

శాపనార్థాలు పెట్టిన తల్లిదండ్రులు 
ఫస్టియర్‌లో మంచి మార్కులు సాధించిన పిల్లల్లో చాలామందికి సెకండియర్‌లో సింగిల్‌ డిజిట్‌ మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శిని కలసి సమస్యను పరిష్కరించుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో నాంపల్లి ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు., లోపలికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. ఫలితాల్లో దొర్లిన తప్పిదాలను సరిదిద్దాల్సిందిపోయి పోలీసులను పెట్టి అడ్డుకుంటారా అని తల్లిదండ్రులు నిలదీశారు. ఇప్పటికే తీవ్ర మనస్తాపంతో తమ పిల్లలు తిండి కూడా తినడం లేదని, ఒక వేళవారు ఆత్మహత్యకు పాల్పడితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఫలితాల్లో తప్పిదాలకు, పిల్లల చావుకు కారణమైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ పిల్లల ఉసురు తగిలిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు.  


పోలీసుల ఓవరాక్షన్‌...  
విద్యార్థులపై పోలీసులు దురుసుగా ప్రవ ర్తించారు. విద్యార్థినులను బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. దీనిని అడ్డుకున్న విద్యార్థిని తల్లిని, సోదరులను కూడా ఈడ్చుకెళ్లారు. మీడియా ప్రతినిధులు, పోలీసుల మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. ముట్టడి ఘటనలో మొత్తం 133 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు బేగంబజార్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

ఉచితంగా రీవాల్యుయేషన్‌ చేయాలి 
ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఎలా అప్పగించారు? సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ను కాదని నిబంధనలకు విరుద్ధంగా అర్హతల్లేని ప్రైవేటు సంస్థకు అప్పనంగా టెండర్‌ను కట్టబెట్టడంలో ఆంతర్యమేంటనేది బోర్డు స్పష్టం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లల ఆత్మహత్యలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కోరిన విద్యార్థులకు ఉచితంగా రీ వ్యాల్యూయేషన్‌ సదుపాయం కల్పించాలని, ఇందుకోసం పాత జిల్లా కేంద్రాల్లో రీవాల్యూయేషన్‌ దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఇంటర్‌ బోర్డును ప్రక్షాళన చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.  

ఆత్మహత్యలకు సీఎందే బాధ్యత: రేవంత్‌  
‘బోర్డు అధికారుల తప్పిదాలకు విద్యార్థులు బలిపశువులు అవుతున్నారు. 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి విద్యామంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, సీఎం కేసీర్‌ బాధ్యత వహించాలి. ఇంటర్‌బోర్డు నిర్వాకంపై సిట్టింగ్‌ జడ్డితో న్యాయవిచారణ జరిపించాలి’అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి డిమాం డ్‌ చేశారు. ఓ రైతు తన సమస్యను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తే స్పందించిన కేసీఆర్‌ లక్షలమంది విద్యార్థుల భవితవ్యంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

ఆందోళనతో ట్రాఫిక్‌ జాం...
ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగడంతో నాంపల్లి రోడ్లన్నీ స్తంభించిపోయాయి. నాంపల్లి నుంచి విజయనగర్‌ కాలనీకి వెళ్లే రహదారి, గాంధీభవన్‌ నుంచి అసెంబ్లీ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. ఎర్రటి ఎండలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కిలో మీటర్ల కొద్దీ పలు దారుల్లో ట్రాఫిక్‌ జంఝాటం కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement