సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేయడం, ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో ఎంసెట్ వెయిటేజీని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ పరీక్షనే కీలకం కానుంది.
ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు ఎంసెట్ కమిటీ ర్యాంకులను కేటాయించనుంది. వాటి ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలను చేపట్టనుంది. గతేడాది ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన 1,99,019 విద్యార్థుల్లో ఎంసెట్ రాసేవారు ఉంటారు. అయితే ఇపుడు వారిని ప్రథమ సంవత్సర సబ్జెక్టుల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వాలంటే ప్రథమ, ద్వితీయ సంవత్సర మార్కు లు ఉండాలి.
మొదటి సంవత్సరంలో కొందరు విద్యార్థులను ప్రతిభ ఆధారంగా కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో కనీస మార్కులతో పాస్ చేస్తున్నందున ఎంసెట్‌లో ఇంటర్‌మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వచ్చే ఏడాది కూడా ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ ఉండదు. ప్రస్తుతం ప్రథమ సంవత్సర విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నందున... వచ్చే ఏడాది వారు ద్వితీయ సంవత్సరానికి వస్తారు. దీంతో అప్పుడు కూడా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ ఉండకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
( చదవండి: వాయిదా వేద్దామా! )
Comments
Please login to add a commentAdd a comment