AP Inter Board, Inter 1st Year Board Has Made Preparations To Conduct Online - Sakshi
Sakshi News home page

ఇంటర్‌ అడ్మిషన్స్‌ @ ఆన్‌లైన్‌

Published Tue, Jul 13 2021 3:35 AM | Last Updated on Tue, Jul 13 2021 11:36 AM

Inter Board has made preparations to conduct the first year admissions of Intermediate online - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు సన్నాహాలు చేపట్టింది. పూర్తి పారదర్శకతతో.. మెరిట్‌ ప్రాతిపదికన విద్యార్థులు కోరుకున్న కళాశాలలో, గ్రూపులో సీటు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కాలేజీల్లో ఫస్టియర్‌లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఇంటర్‌ బోర్డు గత విద్యా సంవత్సరంలోనే శ్రీకారం చుట్టింది. అయితే దీనిపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించేందుకు లైన్‌క్లియర్‌ కావడంతో బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

నిర్దేశిత ప్రమాణాలను పాటించాల్సిందే..
ఆన్‌లైన్‌ ప్రవేశాలకు వీలుగా గతేడాది ఇంటర్‌ బోర్డు అనేక సంస్కరణలు చేపట్టింది. కొత్త కాలేజీల అనుమతులు, రెన్యువల్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం ప్రవేశపెట్టింది. ప్రతి కాలేజీ నిర్వహించే గ్రూపులు, సెక్షన్ల వారీగా ఎన్ని తరగతి గదులు ఉండాలి? ఒక్కో గది ఎంత వైశాల్యంలో ఉండాలి? వంటివాటికి ప్రమాణాలు నిర్దేశించింది. ఆ గదులతో సహా భవనాలు, మరుగుదొడ్లు, ఆటస్థలం ఫొటోలను దరఖాస్తుతోపాటే బోర్డు వెబ్‌సైట్‌లో పెట్టించింది. అంతేకాకుండా ఈ ఫొటోలను జియోట్యాగింగ్‌ చేయించింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు గతంలో కాలేజీ ఒక దగ్గర పెడుతూ.. భవనాలు ఎక్కడివో చూపిస్తూ కాలం గడిపేవి. కానీ జియోట్యాగింగ్‌ వల్ల కాలేజీలు చూపిస్తున్న భవనాలు దరఖాస్తులోని అడ్రసులో ఉంటేనే అనుమతులు వచ్చేలా చేసింది. పైగా ఆ ఫొటోలన్నింటినీ కాలేజీల వారీగా వెబ్‌సైట్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు చూసేలా అందుబాటులో ఉంచింది. ఆ కాలేజీలో ఏయే గ్రూపులున్నాయి? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? వంటి వివరాలను కూడా పొందుపరిచింది. వీటి ఆధారంగా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. 

ప్రవేశాల కోసం ప్రత్యేక పోర్టల్‌..
గతంలో కాలేజీల్లో సెక్షన్‌కు 80 మంది వరకు అనుమతించేవారు. కానీ సీబీఎస్‌ఈ విధానంలో సెక్షన్‌కు 40 మందిని మాత్రమే ఇంటర్‌ బోర్డు పరిమితం చేసింది. గరిష్టంగా 9 సెక్షన్ల వరకు మాత్రమే అనుమతిచ్చేలా నిబంధన పెట్టింది. అలాగే ఎంపీసీ, బైపీసీతోపాటు హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి గ్రూపులను కూడా ప్రవేశపెట్టాల్సిందేనని సర్కార్‌ స్పష్టం చేసింది. కాలేజీల వారీగా కోర్సులు, సీట్ల సమాచారాన్ని కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు అనుగుణంగా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా రూపొందించింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో ప్రైవేటు కాలేజీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలు, క్రీడాకారులకు సంబంధించిన కోటా సీట్లు వారితోనే భర్తీ కానున్నాయి. దీంతో ప్రైవేటు కళాశాలల అక్రమాలకు ముకుతాడు పడనుంది. 

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఇలా..
ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానంలో ఇంటర్‌ బోర్డు విద్యార్థులకు అనేక వెసులుబాట్లు కల్పించింది. 
– గతంలో మాదిరిగా కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌టికెట్‌ నంబర్, పాసైన సంవత్సరం, బోర్డు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్‌ నంబర్, ఈమెయిల్‌ ఐడీ, పుట్టిన తేదీ, చదివిన స్కూల్, కులం, ఆధార్‌ నంబర్ల వివరాల ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 
– ఆ రిజిస్ట్రేషన్‌ ఐడీ పాస్‌వర్డ్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. 
– విద్యార్థి పూర్తి చిరునామా, మొబైల్‌ నంబర్‌ నమోదు చేశాక జిల్లాలు, కాలేజీలు, మాధ్యమాల వారీగా గ్రూపులతో వివరాలు కనిపిస్తాయి. 
– తమకు నచ్చిన గ్రూపు, కాలేజీకి ప్రాధాన్య క్రమంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 
– అనంతరం విద్యార్థి రిజర్వేషన్, పదో తరగతిలో ప్రతిభ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను బోర్డు కేటాయిస్తుంది. విద్యార్థి మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ రూపంలో దాన్ని తెలియచేస్తుంది. 
– అలాట్‌మెంట్‌ లెటర్‌ను పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని కేటాయించిన కాలేజీలో చేరాలి. 
– పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించిన ఫీజును ఆ కాలేజీకి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. అయితే ఫీజులను కమిషన్‌ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. 
– విద్యార్థి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కాలేజీలో సమర్పించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులోనే ఆయా సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేయించి ఇంటర్‌ బోర్డే వాటిని ఆన్‌లైన్‌లో పరిశీలిస్తుంది. 
– ప్రస్తుతం 2020–21కి విద్యార్థులకు ఫలితాలను ప్రకటించే ప్రక్రియలో ఇంటర్‌ బోర్డు నిమగ్నమై ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు శ్రీకారం చుడతామని బోర్డు వర్గాలు వివరించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement