intermediate first year
-
Telangana: ఇంటర్ పస్టియర్ పరీక్షలు ఉన్నట్లా? లేనట్లా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉంటాయో? లేదో? తెలియక లక్షలాది మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. పరీక్షలు పెట్టి తీరుతామని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆమె ఈ మాట చెప్పి నెల రోజులు దాటింది. కానీ, ఇంతవరకూ షెడ్యూల్డ్ మాత్రం రాలేదు. కోవిడ్ కారణం గా 4.75 లక్షల మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యా ర్థులను ‘ద్వితీయ’లోకి ప్రమోట్ చేశారు. వాళ్లకు ఇప్పటికే ద్వితీయ సంవత్సరం పాఠ్య ప్రణాళిక సగానికి పైగా పూర్తయింది. వచ్చే ఏడాది నీట్, జేఈఈ, ఎంసెట్‌కు విద్యార్థులు తర్ఫీదు అవుతున్నారు. పోటీ పరీక్షలతో పాటు, రెండో ఏడాది పాఠ్య పుస్తకాలు చదవడమే కష్టంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. వచ్చే మార్చిలో రెండో ఏడాది పరీక్షలూ నిర్వహించకపోతే విద్యార్థులకే ఇబ్బంది ఉంటుందని ప్రభుత్వం భావించింది. మొదటి ఏడాది పరీక్షలన్నా ఇప్పుడు నిర్వహిస్తే ఆ మార్కుల ఆధారంగా రెండో ఏడాదిలోనూ ప్రమోట్ చేయవచ్చని యోచించారు. ఈ తంతు జూలై, ఆగస్టులో పూర్తిచేసి ఉంటే బాగుండేదని.. ఇప్పుడు మొదటి ఏడాది పరీక్షలు పెడితే ఎలా అని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఒత్తిడిల నేపథ్యంలో ఇంటర్ బోర్డు పునరాలోచనలో పడింది. -
ఇంటర్ అడ్మిషన్స్ @ ఆన్లైన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేపట్టింది. పూర్తి పారదర్శకతతో.. మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులు కోరుకున్న కళాశాలలో, గ్రూపులో సీటు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫస్టియర్‌లో ఆన్లైన్ ప్రవేశాలకు ఇంటర్ బోర్డు గత విద్యా సంవత్సరంలోనే శ్రీకారం చుట్టింది. అయితే దీనిపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు నిర్వహించేందుకు లైన్‌క్లియర్ కావడంతో బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నిర్దేశిత ప్రమాణాలను పాటించాల్సిందే.. ఆన్లైన్ ప్రవేశాలకు వీలుగా గతేడాది ఇంటర్ బోర్డు అనేక సంస్కరణలు చేపట్టింది. కొత్త కాలేజీల అనుమతులు, రెన్యువల్‌కు ఆన్లైన్ దరఖాస్తు విధానం ప్రవేశపెట్టింది. ప్రతి కాలేజీ నిర్వహించే గ్రూపులు, సెక్షన్ల వారీగా ఎన్ని తరగతి గదులు ఉండాలి? ఒక్కో గది ఎంత వైశాల్యంలో ఉండాలి? వంటివాటికి ప్రమాణాలు నిర్దేశించింది. ఆ గదులతో సహా భవనాలు, మరుగుదొడ్లు, ఆటస్థలం ఫొటోలను దరఖాస్తుతోపాటే బోర్డు వెబ్సైట్లో పెట్టించింది. అంతేకాకుండా ఈ ఫొటోలను జియోట్యాగింగ్ చేయించింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు గతంలో కాలేజీ ఒక దగ్గర పెడుతూ.. భవనాలు ఎక్కడివో చూపిస్తూ కాలం గడిపేవి. కానీ జియోట్యాగింగ్ వల్ల కాలేజీలు చూపిస్తున్న భవనాలు దరఖాస్తులోని అడ్రసులో ఉంటేనే అనుమతులు వచ్చేలా చేసింది. పైగా ఆ ఫొటోలన్నింటినీ కాలేజీల వారీగా వెబ్సైట్లో విద్యార్థులు, తల్లిదండ్రులు చూసేలా అందుబాటులో ఉంచింది. ఆ కాలేజీలో ఏయే గ్రూపులున్నాయి? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? వంటి వివరాలను కూడా పొందుపరిచింది. వీటి ఆధారంగా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ప్రవేశాల కోసం ప్రత్యేక పోర్టల్.. గతంలో కాలేజీల్లో సెక్షన్‌కు 80 మంది వరకు అనుమతించేవారు. కానీ సీబీఎస్ఈ విధానంలో సెక్షన్‌కు 40 మందిని మాత్రమే ఇంటర్ బోర్డు పరిమితం చేసింది. గరిష్టంగా 9 సెక్షన్ల వరకు మాత్రమే అనుమతిచ్చేలా నిబంధన పెట్టింది. అలాగే ఎంపీసీ, బైపీసీతోపాటు హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి గ్రూపులను కూడా ప్రవేశపెట్టాల్సిందేనని సర్కార్ స్పష్టం చేసింది. కాలేజీల వారీగా కోర్సులు, సీట్ల సమాచారాన్ని కంప్యూటరీకరించి ఆన్లైన్ అడ్మిషన్లకు అనుగుణంగా వెబ్సైట్లో పొందుపరిచింది. ఆన్లైన్ అడ్మిషన్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా రూపొందించింది. ఆన్లైన్ అడ్మిషన్లతో ప్రైవేటు కాలేజీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలు, క్రీడాకారులకు సంబంధించిన కోటా సీట్లు వారితోనే భర్తీ కానున్నాయి. దీంతో ప్రైవేటు కళాశాలల అక్రమాలకు ముకుతాడు పడనుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇలా.. ఆన్లైన్ అడ్మిషన్ల విధానంలో ఇంటర్ బోర్డు విద్యార్థులకు అనేక వెసులుబాట్లు కల్పించింది. – గతంలో మాదిరిగా కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వెబ్సైట్లో పదో తరగతి హాల్‌టికెట్ నంబర్, పాసైన సంవత్సరం, బోర్డు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, చదివిన స్కూల్, కులం, ఆధార్ నంబర్ల వివరాల ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. – ఆ రిజిస్ట్రేషన్ ఐడీ పాస్వర్డ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. – విద్యార్థి పూర్తి చిరునామా, మొబైల్ నంబర్ నమోదు చేశాక జిల్లాలు, కాలేజీలు, మాధ్యమాల వారీగా గ్రూపులతో వివరాలు కనిపిస్తాయి. – తమకు నచ్చిన గ్రూపు, కాలేజీకి ప్రాధాన్య క్రమంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. – అనంతరం విద్యార్థి రిజర్వేషన్, పదో తరగతిలో ప్రతిభ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను బోర్డు కేటాయిస్తుంది. విద్యార్థి మొబైల్ నంబర్‌కు మెసేజ్ రూపంలో దాన్ని తెలియచేస్తుంది. – అలాట్మెంట్ లెటర్‌ను పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కేటాయించిన కాలేజీలో చేరాలి. – పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజును ఆ కాలేజీకి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా చెల్లించాలి. అయితే ఫీజులను కమిషన్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. – విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీలో సమర్పించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తులోనే ఆయా సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేయించి ఇంటర్ బోర్డే వాటిని ఆన్లైన్లో పరిశీలిస్తుంది. – ప్రస్తుతం 2020–21కి విద్యార్థులకు ఫలితాలను ప్రకటించే ప్రక్రియలో ఇంటర్ బోర్డు నిమగ్నమై ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆన్లైన్ అడ్మిషన్లకు శ్రీకారం చుడతామని బోర్డు వర్గాలు వివరించాయి. -
Telangana: జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 2021–22 విద్యా సంవత్సరంలో మొదటి దశ ప్రవేశాలకు మంగళవారం నుంచి తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా మంగళవారం నుంచి దరఖాస్తుల పంపిణీ, ప్రవేశాల ప్రారంభానికి మొదటి దశ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. జూలై 7 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి అవుతుందని పేర్కొంది. జనరల్, వొకేషనల్ విభాగాల్లో ప్రభుత్వ /ప్రైవేట్ ఎయిడెడ్ /ప్రైవేట్ అన్ఎయిడెడ్ /కో–ఆపరేటివ్ /టీఎస్ రెసిడెన్షియల్/ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్/ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్/ ఇన్సెంటివ్/ మైనారిటీ/ కేజీబీవీ/ టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కంపోజిట్ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సర ప్రవేశాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించింది. పదో తరగతి ఇంటర్నెట్ మార్కుల మెమో ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు (ప్రొవిజనల్ అడ్మిషన్లు) చేపట్టొచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు పేర్కొంది. విద్యార్థులు ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్, టీసీలు సమర్పించాక ప్రవేశాలు (ప్రొవిజనల్ అడ్మిషన్లు) ఖరారు అవుతాయని తెలిపింది. రెండో దశ అడ్మిషన్లు ఎప్పుడు చేపట్టాలనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ అనుబంధ (అఫీలియేటెడ్)కాలేజీల్లోనే ప్రవేశాలు పొందేలా విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లు acadtsbie.cgg.gov.in, tsbie.cgg.gov.inలో పొందుపరిచిన గుర్తింపు, అనుబంధ కాలేజీల జాబితాలను సరిచూసుకోవాలని తెలిపింది. జీపీఏ ఆధారంగానే.. పదోతరగతి పరీక్షల్లో గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ), సబెక్ట్‌ల వారీగా గ్రేడ్ పాయిం ట్ల ఆధారంగా ఇంటర్ ప్రవేశాలు నిర్వహించాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించొద్దని సూచించింది. ఇతర అంశాల ప్రాతిపదికన ప్రవేశాలు చేపట్టే జూనియర్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ► కాలేజీల్లో ప్రవేశానికి విద్యార్థులు తమ ఆధార్ కార్డులు సమర్పించాలి. ► ప్రతీ విభాగంలో 88కి మించకుండా అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ప్రవేశాలు చేపట్టాలి. ► తగిన అనుమతులు పొందాకే అదనపు సెక్షన్లు తెరవాలి. ఉల్లంఘనలకు పాల్పడితే పెనాల్టీ వేయడంతో పాటు కాలేజీపై అనర్హత వేటు, తదితర చర్యలు ఉంటాయి. ► ప్రవేశాలకు సంబంధించి అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దు. ఉల్లంఘనలపై కఠినచర్యలు. ► జోగినీల సంతానానికి సంబంధించి దరఖాస్తు పత్రంలో తండ్రి పేరుకు బదులు తల్లి పేరును పేర్కొనాలి. ► విదార్థినుల రక్షణకు సంబంధించి ప్రిన్సిపాళ్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ► కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలను రూల్ ఆఫ్ రిజర్వేషన్లను పాటిస్తూ సీట్లు భర్తీ చేయాలని ఆదేశించింది. ప్రవేశాలకు ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లు.. ► బీసీలు: 29 శాతం (ఏ–7, బీ–10, సీ–1, డీ–7, ఈ–4 శాతం) ► ఎస్సీలు: 15 శాతం ► ఎస్టీలు: 6 శాతం ► ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్: 5 శాతం ► దివ్యాంగులు: 3 శాతం ► ఎక్స్ సర్వీస్‌మెన్, రాష్ట్రంలో నివసించే డిఫెన్స్ సిబ్బంది: 3 శాతం (విడిగా అమ్మాయిలకు కాలేజీలు లేనిచోట ప్రతీ కేటగిరీలో వారికి మూడో వంతు లేదా 33.33 శాతం సీట్లు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది) చదవండి: జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు! -
హ్యుమానిటీస్‌కు కొత్త పాఠ్య పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం హ్యుమానిటీస్‌కు కొత్త పాఠ్య పుస్తకాలను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఐదేళ్లకోసారి సిలబస్ మార్పులో భాగంగా ఈసారి ప్రథమ సంవత్సర కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాల సిలబస్‌ను మార్పు చేసింది. ఆ పుస్తకాలను బోర్డు కార్యాదర్శి అశోక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తకాలను ముద్రించిన తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యానికి భరోసా
కరీంనగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో మెనూలో పెద్ద ఎత్తున మార్పులు తేవడమే కాకుండా కాస్మోటిక్ కిట్స్ అందిస్తు న్న ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత ధ్యేయంగా ఆరోగ్య కిట్లు అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. 13 వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్ బాలికలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా కిట్లను ప్రభుత్వం జిల్లాలకు విడుదల చేసింది. గత విద్యా సంవత్సరం ఆఖరు నుంచి కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇలాంటి కిట్లు అందజేశారు. ఈసారి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు అందజేస్తుండడం విశేషం. బాలికల ఆరోగ్య రక్షణలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి, నిరాక్షరాస్యత కారణంగా పరిశుభ్రతకు, వైద్యసేవలకు నోచుకోని విద్యార్థినుల ఆరోగ్యానికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికల కోసం ఆరోగ్య కిట్లు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో కిట్లను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారుల కు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూ ర్తి చేసి కిట్లు సైతం పాఠశాలలకు త్వరలోనే అందేలా అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం కోసం.. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రభుత్వం ఈ కిట్లు పంపిణీ చేస్తోంది. బాలికలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు శానిటరీ న్యాపికిన్స్ సైతం ఈ కిట్‌లో అందజేస్తున్నారు. హెల్త్ అండ్ హైజినిక్ పథకం ద్వారా ఈ కిట్టు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 56,506 మంది విద్యార్థినులకు ఈ కిట్లు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు నెలలకోసారి.. ఒక్కో బాలికకు మూడు నెలలకు సరిపోయేలా వస్తువులను కిట్‌లో ఉంచారు. ఇలా ప్రతీ మూడు నెలలకొసారి ఆరోగ్య కిట్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. కిట్‌లో ఉండే వస్తువులు.. కిట్‌లో మొత్తం 13 రకాల వస్తువులు ఉన్నాయి. సబ్బులు 3, బట్టల సబ్బులు 3, కొబ్బరినూనె బాటిల్ 1, షాంపూ బాటిల్ 1, పౌడర్ 1, టూత్‌పెస్ట్ 1, టంగ్‌క్లీనర్ 1, దువ్వెన 1, జడ క్లిప్పులు, జడరబ్బర్లు, బొట్టు బిల్లల ప్యాకెట్, శానిటరీ న్యాపికిన్స్. 24 నుంచి పంపిణీ చేస్తాం.. ఆరోగ్య కిట్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈనెల 24 నుంచి 30వ తేదీల మధ్య ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో 7 నుంచి 10వ తరగతి వరకు, కేజీబీవీల్లో 6 నుంచి 10వ తరగతి వరకు, మోడల్ స్కూల్లో 7 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలికలందరికీ కిట్స్ అందజేయాలని ఉత్తర్వులు అందాయి. విద్యార్థినులను అనారోగ్య సమస్యల బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో పరిశుభ్రత కిట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. – వెంకటేశ్వర్లు, డీఈవో, కరీంనగర్ -
ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారా.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో తాజా ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫెయిలైతే అంతకుముందుకు ఆ సబ్జెక్టులో పాసైనా కూడా ఫెయిల్ అయినట్లే పరిగణిస్తారు. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉతీర్ణులైన వారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. సాధారణ ఫీజుతో పాటు ప్రతి పేపర్‌కు రూ.150 చొప్పున చెల్లించాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు.. 2016 తర్వాత ఇంటర్ ఉత్తీర్ణులైన వారు రెండేళ్లలో రెండు సార్లు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ద్వితీయ సంవత్సర పేపర్లను, ప్రాక్టికల్స్ రాసినా, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పేపర్లలో ఇంప్రూవ్మెంట్ రాస్తే.. గతంలో వచ్చిన మార్కులనైనా ఉంచుకోవచ్చు. తాజా మార్కులనైనా ఎంచుకోవచ్చు. కానీ ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చాయని వాటిని పరిగణనలోకి తీసుకోవడం కుదరదు. జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం కలిపి) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఇక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలంటే రాష్ట్ర బోర్డు నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో టాప్–20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డులో 75 శాతం మార్కులు (జనరల్ విద్యార్థులు) సాధించి ఉంటే చాలు. -
రాలిన విద్యా కుసుమం
♦ జిల్లా విద్యార్థిని గుంటూరులో..అనుమానాస్పద మృతి ♦ గుంటూరు విద్యానగర్‌లోని ఓ అకాడమీలో ఘటన.. ♦ విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన బాలిక ♦ కళాశాల యాజమాన్యం వల్లేనని బంధువుల ఆరోపణ ♦ కళాశాల ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం విద్యా కుసుమం రాలిపోయింది. చదువు కోసం ఊరు కాని ఊరు వచ్చి అనుకోని విధంగా మృత్యువు ఒడికి చేరింది. కన్న బిడ్డ క్షేమంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖమే మిగిలింది. విగతజీవిగా ఉన్న బిడ్డను చూసి కన్నవాళ్లు గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తెర వెనుక ఏం జరిగిందో తెలియదుగానీ వారికి మాత్రం తీరని వేదన మిగిల్చింది. గుంటూరు : ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏదుపాడుకు చెందిన నిజాంపట్నం జయశ్రీ (17) గుంటూరు విద్యానగర్ 1వ లైనులోని ఓ అకాడమీలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి వెంకటనారాయణ సాధారణ వ్యవసాయ కూలీ. ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె జయశ్రీ. సోమవారం ఉదయం 6 గంటలకు అకాడమీలో స్టడీ అవర్‌కు వెళ్లి తిరిగి 7.30 గంటలకు అల్పాహారం తినేందుకు హాస్టల్‌కు వచ్చింది. తనకు తలనొప్పిగా ఉందని, తర్వాత క్లాస్‌కు వస్తానని స్నేహితులకు చెప్పి ఆమె హాస్టల్ గదికి వెళ్లింది. తర్వాత ఎంతకీ బయటకు రాకపోవడంతో సుమారు రెండు గంటల తర్వాత సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు కొట్టారు. ఎలాంటి స్పందనా లేకపోవడంతో పోలీసులు, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఉదయం 10 గంటలకు కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రుల సమక్షంలో సిబ్బంది తలుపులు పగులగొట్టి లోపల చూడగా జయశ్రీ విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. మృతిపై అనుమానాలు విద్యార్థిని మృతిపై పోలీసులు, బంధువులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తమ కుమార్తెను కళాశాల యాజమాన్యమే చంపి ఆత్మహత్యలా చిత్రీకరిస్తోందని బంధువులు ఆరోపిస్తున్నారు. జయశ్రీ అందుకోలేనంత ఎత్తులో ఫ్యాన్ ఉందని, ఎలా ఉరేసుకుంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇద్దరు వార్డెన్లు చెబుతున్న సమాధానాలకు పొంతన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని తలనొప్పితో బాధపడుతూ గదిలోకి వెళ్లినా, తలుపులు తీయకుండా ఉన్నా యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కళాశాల ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం జయశ్రీ మృతి చెందిందని తెలుసుకున్న బం«ధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున విద్యానగర్‌లోని కళాశాలకు తరలి వచ్చారు. అక్కడ అందుబాటులో ఉన్న సిబ్బంది చెబుతున్న సమాధానాల్లో పొంతన లేకపోవడం, యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో బంధువుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఉన్నపాటుగా ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కళాశాల గదుల్లోని కిటికీ అద్దాలు పగులగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దాడి యత్నాలు అడ్డుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపు రెండు గంటలకు పైగా ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగడంతో డీఎస్పీ కేజీవీ సరిత, పట్టాభిపురం, పాత గుంటూరు ఎస్‌హెచ్‌వోలు చిట్టెం కోటేశ్వరరావు, పి.బాలమురళీకృష్ణ, ఎస్ఐ ఎస్.రవీంద్ర రంగంలోకి దిగి మృతురాలి బంధువులకు సర్ది చెప్పారు. లేఖలో ఏముంది? విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడేముందు ఆమె తన తల్లిదండ్రులకు ఓ లేఖ రాసిందని పోలీసులు చెబుతున్నారు. లేఖలో ఉన్న వివరాలు తెలిపేందుకు మాత్రం వారు అంగీకరించడం లేదు. దానిలో ఆమె పలు విషయాల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మృతికి కారణమైన వివరాలేమీ తెలియరాలేదని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. -
ఇంటర్లో పశ్చిమ ‘సెకండ్’
ఏలూరు సిటీ :ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో పశ్చిమ వికసించింది...నవాంధ్రప్రదేశ్గా అవతరించాక తొలిసారి జిల్లా విద్యార్థులు తమ సత్తా చాటుకున్నారు. రాష్ట్రస్థాయిలో కృష్ణా 76శాతం ఉత్తీర్ణతతో టాపర్‌గా నిలిస్తే...68 శాతం ఉత్తీర్ణత సాధించి పశ్చిమ, విశాఖ, నెల్లూరు జిల్లాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. గత ఏడాదితో పోలిస్తే పశ్చిమగోదావరి జిల్లా ఉత్తీర్ణతలో 10 శాతం పెరిగింది. గత ఏడాది పశ్చిమ 58 శాతంతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిస్తే ఈసారి మూడు స్థానాలు ఎగబాకింది. ఇక 72 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలు బాలుర కంటే పైచేయి సాధించారు. జిల్లాలో జనరల్ కోర్సులకు సంబంధించి 29,993 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 20,465మంది పాస్ అయ్యారు. వోకేషనల్ కోర్సులకు సంబంధించి 3,097మంది పరీక్షలు రాస్తే 44 శాతంతో 1,366 మంది ఉత్తీర్ణులు అయ్యారు. సత్తా చాటిన జిల్లా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ విద్యాసంవత్సరానికి ఫస్ట్ ఇంటర్ పరీక్షల్లో 20,465 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వారిలో బాలురు 13,515 మంది పరీక్షలు రాయగా 64 ఉత్తీర్ణతా శాతంతో 8,677 మంది పాస్ అయ్యారు. బాలికలు 16,478 మంది పరీక్షలకు హాజరు కాగా 72 శాతంతో 11,788 మంది కృతార్థులయ్యారు. ఇక వోకేషనల్ కోర్సులకు సంబంధించి 3,097 మంది పరీక్షలు రాస్తే 1,366 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 1,735 మంది పరీక్షలు రాస్తే 40శ ాతంతో 686 మంది పాస్ కాగా, బాలికలు 1362 మంది పరీక్షలు రాయగా 50 శాతంతో 680 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలదే హవా ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో బాలికలు మరోసారి హవా సాగించారు. గత విద్యాసంవత్సరంలో బాలుర కంటే 9 శాతానికి పైగా అధిక ఉత్తీర్ణత సాధించిన బాలికలు ఈ సంవత్సరం 8 శాతం ముందున్నారు. గత ఏడాది బాలురు 53 శాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 62 శాతం మంది పాస్ అయ్యారు. ఈ ఏడాది కూడా బాలురు 64 శాతం ఉత్తీర్ణులైతే బాలికలు 72 శాతం మంది పరీక్షల్లో కృతార్థులయ్యారు. పక్కా ప్రణాళికతోనే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్రంలోనే మంచి ఉత్తీర్ణతా శాతాన్ని నమోదు చేశారు. మొదటి నుంచీ పక్కా ప్రణాళికతోనే ఉత్తమ ఫలితాలు సాధించాం. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ ఇదే స్థాయిలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నాయి. మే 27 నుంచి జూన్ 2వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. - ఆర్ఐవో బి.వెంకటేశ్వరరావు -
అద్వితీయం
నెల్లూరు(విద్య) : రాష్ట్రం విడిపోయిన అనంతరం జరిగిన మొదటి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జిల్లా 2వ స్థానం సాధించింది. మార్చిలో జరిగిన పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 27,089 మంది విద్యార్థులు హాజరుకాగా 18,346 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 14,109 మంది హాజరు కాగా 9,014 మంది ఉత్తీర్ణులై 65 శాతం పాసయ్యారు. బాలికలు 12,980 మంది హాజరు కాగా 9,232 మంది ఉత్తీర్ణులయ్యారు. 71 శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలే పైచేయిగా నిలిచారు. గత ఏడాది 4వ స్థానంలో ఉన్న జిల్లా ఈ ఏడాది 2వ స్థానం సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేషనల్ విభాగంలో 1,092 మంది విద్యార్థులు హాజరుకాగా 655 మంది ఉత్తీర్ణులై 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 797 మంది హాజరుకాగా 414 మంది పాసై 52 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 295 మంది హాజరు కాగా 241 మంది ఉత్తీర్ణులై 82 శాతం సాధించారు. కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని వి.సురేఖ 464 మార్కులు, బైపీసీలో విశ్వసాయి విద్యార్థిని పి.వెంకటసాయి 435 మార్కులు, ఎంఈసీలో 488 మార్కులతో కృష్ణచైతన్య విద్యార్థిని హబీబున్నీసా, సీఈసీలో 472 మార్కులతో కృష్ణచైతన్య విద్యార్థిని గంగినేని వీణవిలు జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించారు. అయితే జిల్లాలో ఎంపీసీ విభాగంలో ఎండిటి వెంకటేశ్వర్లుకు 467, కంటా వెంకటప్రణవికి 466, బైపీసీ విభాగంలో సోనం కుమారి కౌర్‌కు 435 అత్యుత్తమ మార్కులు వచ్చినట్లు సమాచారం. -
బాలికలే టాప్
గుంటూరు ఎడ్యుకేషన్: నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తొలిసారిగా వెలువడిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జిల్లా బాలికలు దుమ్మలేపారు. ఉత్తీర్ణతలో బాలురకన్నా పైచేయి సాధించారు. గురువారం వెలువెడిన పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఎంపీసీ, బైపీసీల్లో స్టేట్ టాపర్లుగా నిలిచి.. ఔరా అనిపించారు. గతేడాది 63 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానం సాధించగా ఈ ఏడాది ఉత్తీర్ణత 66 శాతానికి పెరిగింది. దీంతో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం దక్కింది. గత మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియెట్ సాధారణ కోర్సుల పరీక్షలకు జిల్లాలో 47,030 మంది విద్యార్థులు హాజరు కాగా 30,813 (66 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 25,252 మంది బాలురు పరీక్షలు రాయగా 15,455 మంది (61 శాతం), 21,778 మంది బాలికలు పరీక్షలు రాయగా 15,358 మంది (71 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వృత్తివిద్యాకోర్సుల పరీక్షలు రాసిన 675 మందిలో 360 మంది (53 శాతం) పాసయ్యారు. బాలురు 333 మందికిగాను 118 మంది (35 శాతం), 342 మంది బాలికలకుగాను 242 మంది (71 శాతం) మంది పాసయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. స్టేట్ టాపర్లు వీరే.. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ విభాగాల్లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. ఎంపీసీలో భాష్యం ఐఐటీ అకాడమీ విద్యార్థి పోపూరి హారిక 470 మార్కులకు 467 మార్కులు సాధించింది. బైపీసీలో భాష్యం మెడెక్స్ విద్యార్థినులు బి.పుష్పలత, ఎన్.సాయి సుధ 440 మార్కులకు 437 మార్కులను కైవసం చేసుకున్నారు. ఎంఈసీలో మాస్టర్‌మైండ్స్ విద్యార్ధిని షేక్ కరిష్మా భాను 500 మార్కులకు 494 మార్కులు సాధించగా శ్రీమేధ విద్యార్థిని నిషితా గోయల్ 492 మార్కులు సాధించింది. ఫలితాల సాధనలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల హవా ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ప్రైవేట్, కార్పొరేట్ జూని యర్ కళాశాలల విద్యార్థులు టాప్ లేపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీ, బైపీసీల్లో భాష్యం విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంఈసీలో మాస్టర్ మైండ్‌స విద్యార్థిని ప్రథమ స్థానం సాధించింది. -
బాలికలదే హవా
కరీంనగర్ ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలే పై చేరుు సాధించారు. బుధవారం ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 42,192 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 21,680 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 18,893 మంది పరీక్షలకు హాజరుకాగా 7,887 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 23,299 మంది పరీక్షలు రాయగా 13,793 మంది ఉత్తీర్ణత పొంది బాలుర కంటే పై చేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత 41.75 శాతం కాగా, బాలికలు 59.20 శాతం ఉత్తీర్ణత సాధించారు. మన జిల్లా మొత్తం 51 శాతం ఉత్తీర్ణత సాధించి తెలంగాణలో 6వ స్థానంలో నిలిచింది. అరుుతే గతేడాది కంటే మూడు శాతం ఉత్తీర్ణత మెరుగవడం విశేషం. సారంగాపూర్ ఫస్ట్.. చొప్పదండి లాస్ట్ జిల్లాలో 58 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో మొత్తం 6,866 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 3,227 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో 47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 66 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 64 మంది పాసై జిల్లాలో మొదటి స్థానంలో నిలిపారు. రెండవ స్థానాన్ని అదే మండలంలోని బీర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కైవసం చేసుకుంది. ఇక్కడ 98 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 92 మంది ఉత్తీర్ణులయ్యారు. మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 113 మంది విద్యార్థులకు 90 మంది ఉత్తీర్ణులు కాగా, ఫలితాల్లో మూడో స్థానం పొందింది. చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 157 మంది విద్యార్థులకు కేవలం 29 మందే ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఈ కళాశాల జిల్లాలోనే చివరి స్థానం ఆక్రమించింది. అరుుతే గతేడాది కంటే మూడు శాతం పెరగడం పట్ల ఆర్ఐవో సుహాసిని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వొకేషనల్‌లో 39 శాతం జిల్లాలోని వృత్తివిద్యా కళాశాలల్లో 39 శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకుని రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. వృత్తివిద్యా కోర్సుల్లో బాలురు 3428 మంది పరీక్షలకు హాజరుకాగా 1037 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1629 మందికి 937 మంది పాసయ్యూరు. జిల్లాలో 5,057 మంది పరీక్షలకు హాజరుకాగా 1974 మంది మాత్రమే ఉత్తీర్ణత పొందారు. పరీక్ష ఫీజు గడువు మే ఒకటి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విధ్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే ఒకటి వరకు గడువు విధించారు. మే 25 నుంచి జూన్ ఒకటి వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. -
ఇంటర్ అడ్మిషన్లకు తెలంగాణ ఎఫెక్ట్
►గత ఏడాది కంటే తగ్గిన ప్రవేశాలు ►కార్పొరేట్ కళాశాలలపై తీవ్ర ప్రభావం ►వెలవెలబోతున్న హాస్టల్ క్యాంపస్‌లు ►నేటితో ముగియనున్న తుది గడువు ►ఆశలు వదులుకున్న యాజమాన్యాలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు ఒక్క సారిగా తగ్గిపోయాయి. ఈ ప్రభావం ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో తీవ్రంగా ఉంది. విద్యా రాజధానిగా పేరుపొందిన గుంటూరుకు ఏటా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివస్తుంటారు. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్య అభ్యసించి వెళుతుంటారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోవడంతో యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ►గుంటూరు కేంద్రంగా ఉన్న విద్యా సంస్థల్లో ఇంటర్ విద్య అభ్యసించేందుకు తెలంగాణ నుంచి ప్రతియేటా వేలాది మంది విద్యార్థులు వస్తుండగా, ప్రస్తుతం అటువంటి వాతావరణం కనిపించడం లేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హాస్టల్ క్యాంపస్‌లు కలిగి ఉన్న కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తొలి విద్యా సంవత్సరంలోనే పెద్ద దెబ్బ ►రాష్ట్రం విడిపోయిన తరవాత తొలి విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలపై తీవ్ర ప్రభావం కనిపించడంతో కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ►ఆ రాష్ట్రం నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఇంటర్మీడియెట్ చదివితే అనంతరం ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తదితర కోర్సులు చదివేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీ-యింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను చెల్లిస్తుందో లేదో అనే అనుమానంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడకు పంపడం లేదని ఓ కార్పొరేట్ కళాశాల నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. తగ్గిన అడ్మిషన్లు ... ►జిల్లా వ్యాప్తంగా 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మరో 200 ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ఏటా దాదాపు 50 వేల మంది విద్యార్థులు చేరుతున్నారు. వీరిలో ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు 15 వేల మంది వరకూ ఉంటున్నారు. ►ఐఐటీ, ఎంసెట్ కోసం ఎంపీసీ, ఎయిమ్స్ శిక్షణ కోసం బైపీసీ, సీఏ కోచింగ్‌తో కూడిన విద్య కోసం ఎంఈసీ గ్రూపుల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు పొందుతున్నారు. ►ఎంపీసీ గ్రూపు ప్రథమ స్థానంలో ఉండగా బైపీసీ, ఎంఈసీ గ్రూపులు తరవాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు గ్రూపులను బోధిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలకు క్యాంపస్‌ల వారీగా అడ్మిషన్లు సగానికి తగ్గిపోయాయి. ►ఉదాహరణకు నగరంలోని ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో గతంలో 600 మంది విద్యార్థులు ప్రవేశం పొందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 300కు పరిమితమైంది. తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ప్రస్తుతం ఇక్కడకు రాకపోవడంతో హాస్టల్ క్యాంపస్‌లను నిర్వహించలేక యాజమాన్యాలు తల పట్టుకుంటున్నాయి. నేటితో ప్రవేశాలకు తుది గడువు ►ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి తుది గడువు బుధవారంతో ముగియనుంది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలతో పాటు ఎయిడెడ్, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లపై యాజమాన్యాలు ఆశలు వదులుకున్నాయి. తెలంగాణలోనూ నిరాశే... ►గుంటూరు కేంద్రంగా జూనియర్ కళాశాలలను నిర్వహిస్తున్న కొన్ని యాజమాన్యాలు తెలంగాణ లోనూ క్యాంపస్‌లు కలిగివున్నాయి. అయితే అక్కడ సైతం ఆశించిన విధంగా అడ్మిషన్లు లేక ఆందోళన చెందుతున్నాయి. క్యాంపస్‌లు, హాస్టళ్ల నిర్వహణ ఖర్చులు, అధ్యాపకులు, సిబ్బంది వేతనాల చెల్లింపులు పెరిగడం, విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోవడంతో విద్యాసంస్థల నిర్వహణపై తీవ్రంగా మదనపడుతున్నారు. -
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ తొలి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ, రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత ఆలస్య రుసుం, తత్కాల్‌కు కూడా అవకాశం ఉండదని ఇంటర్ బోర్డు సోమవారం తెలిపింది. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించింది.