ఇంటర్ అడ్మిషన్లకు తెలంగాణ ఎఫెక్ట్ | Inter admission for Telangana Effect at guntur | Sakshi
Sakshi News home page

ఇంటర్ అడ్మిషన్లకు తెలంగాణ ఎఫెక్ట్

Published Wed, Aug 20 2014 1:00 AM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

ఇంటర్ అడ్మిషన్లకు తెలంగాణ ఎఫెక్ట్ - Sakshi

ఇంటర్ అడ్మిషన్లకు తెలంగాణ ఎఫెక్ట్

గత ఏడాది కంటే తగ్గిన ప్రవేశాలు
కార్పొరేట్ కళాశాలలపై తీవ్ర ప్రభావం
వెలవెలబోతున్న హాస్టల్ క్యాంపస్‌లు
నేటితో ముగియనున్న తుది గడువు
ఆశలు వదులుకున్న యాజమాన్యాలు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు ఒక్క సారిగా తగ్గిపోయాయి. ఈ ప్రభావం ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో తీవ్రంగా ఉంది. విద్యా రాజధానిగా పేరుపొందిన గుంటూరుకు ఏటా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివస్తుంటారు. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్య అభ్యసించి వెళుతుంటారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోవడంతో యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి.
గుంటూరు కేంద్రంగా ఉన్న విద్యా సంస్థల్లో ఇంటర్ విద్య అభ్యసించేందుకు తెలంగాణ నుంచి ప్రతియేటా వేలాది మంది విద్యార్థులు వస్తుండగా, ప్రస్తుతం అటువంటి వాతావరణం కనిపించడం లేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హాస్టల్ క్యాంపస్‌లు కలిగి ఉన్న కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
 తొలి విద్యా సంవత్సరంలోనే పెద్ద దెబ్బ
రాష్ట్రం విడిపోయిన తరవాత తొలి విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలపై తీవ్ర ప్రభావం కనిపించడంతో కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
ఆ రాష్ట్రం నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఇంటర్మీడియెట్ చదివితే అనంతరం  ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తదితర కోర్సులు చదివేందుకు తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీ-యింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను చెల్లిస్తుందో లేదో అనే అనుమానంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడకు పంపడం లేదని ఓ కార్పొరేట్ కళాశాల నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
 తగ్గిన అడ్మిషన్లు ...
జిల్లా వ్యాప్తంగా 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మరో 200 ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ఏటా దాదాపు 50 వేల మంది విద్యార్థులు చేరుతున్నారు. వీరిలో ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు 15 వేల మంది వరకూ ఉంటున్నారు.
ఐఐటీ, ఎంసెట్ కోసం ఎంపీసీ,  ఎయిమ్స్ శిక్షణ కోసం బైపీసీ, సీఏ కోచింగ్‌తో కూడిన విద్య కోసం ఎంఈసీ గ్రూపుల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు పొందుతున్నారు.
ఎంపీసీ గ్రూపు ప్రథమ స్థానంలో ఉండగా బైపీసీ, ఎంఈసీ గ్రూపులు తరవాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు గ్రూపులను బోధిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలకు క్యాంపస్‌ల వారీగా అడ్మిషన్లు సగానికి తగ్గిపోయాయి.
ఉదాహరణకు నగరంలోని ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో గతంలో 600 మంది విద్యార్థులు ప్రవేశం పొందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 300కు పరిమితమైంది. తెలంగాణ  ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ప్రస్తుతం ఇక్కడకు రాకపోవడంతో హాస్టల్ క్యాంపస్‌లను నిర్వహించలేక యాజమాన్యాలు తల పట్టుకుంటున్నాయి.
 నేటితో ప్రవేశాలకు తుది గడువు
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి తుది గడువు బుధవారంతో ముగియనుంది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలతో పాటు ఎయిడెడ్, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లపై యాజమాన్యాలు ఆశలు వదులుకున్నాయి.
 తెలంగాణలోనూ నిరాశే...
గుంటూరు కేంద్రంగా జూనియర్ కళాశాలలను నిర్వహిస్తున్న కొన్ని యాజమాన్యాలు తెలంగాణ లోనూ క్యాంపస్‌లు కలిగివున్నాయి. అయితే అక్కడ సైతం ఆశించిన విధంగా అడ్మిషన్లు లేక ఆందోళన చెందుతున్నాయి. క్యాంపస్‌లు, హాస్టళ్ల నిర్వహణ ఖర్చులు, అధ్యాపకులు, సిబ్బంది వేతనాల చెల్లింపులు పెరిగడం, విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోవడంతో విద్యాసంస్థల నిర్వహణపై తీవ్రంగా మదనపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement