గుంటూరు ఎడ్యుకేషన్: నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తొలిసారిగా వెలువడిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జిల్లా బాలికలు దుమ్మలేపారు. ఉత్తీర్ణతలో బాలురకన్నా పైచేయి సాధించారు. గురువారం వెలువెడిన పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఎంపీసీ, బైపీసీల్లో స్టేట్ టాపర్లుగా నిలిచి.. ఔరా అనిపించారు. గతేడాది 63 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానం సాధించగా ఈ ఏడాది ఉత్తీర్ణత 66 శాతానికి పెరిగింది.
దీంతో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం దక్కింది. గత మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియెట్ సాధారణ కోర్సుల పరీక్షలకు జిల్లాలో 47,030 మంది విద్యార్థులు హాజరు కాగా 30,813 (66 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 25,252 మంది బాలురు పరీక్షలు రాయగా 15,455 మంది (61 శాతం), 21,778 మంది బాలికలు పరీక్షలు రాయగా 15,358 మంది (71 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వృత్తివిద్యాకోర్సుల పరీక్షలు రాసిన 675 మందిలో 360 మంది (53 శాతం) పాసయ్యారు. బాలురు 333 మందికిగాను 118 మంది (35 శాతం), 342 మంది బాలికలకుగాను 242 మంది (71 శాతం) మంది పాసయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.
స్టేట్ టాపర్లు వీరే..
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ విభాగాల్లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. ఎంపీసీలో భాష్యం ఐఐటీ అకాడమీ విద్యార్థి పోపూరి హారిక 470 మార్కులకు 467 మార్కులు సాధించింది. బైపీసీలో భాష్యం మెడెక్స్ విద్యార్థినులు బి.పుష్పలత, ఎన్.సాయి సుధ 440 మార్కులకు 437 మార్కులను కైవసం చేసుకున్నారు. ఎంఈసీలో మాస్టర్‌మైండ్స్ విద్యార్ధిని షేక్ కరిష్మా భాను 500 మార్కులకు 494 మార్కులు సాధించగా శ్రీమేధ విద్యార్థిని నిషితా గోయల్ 492 మార్కులు సాధించింది.
ఫలితాల సాధనలో ప్రైవేట్, కార్పొరేట్
విద్యాసంస్థల హవా
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ప్రైవేట్, కార్పొరేట్ జూని యర్ కళాశాలల విద్యార్థులు టాప్ లేపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీ, బైపీసీల్లో భాష్యం విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంఈసీలో మాస్టర్ మైండ్‌స విద్యార్థిని ప్రథమ స్థానం సాధించింది.
బాలికలే టాప్
Published Fri, Apr 24 2015 1:54 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement