రాలిన విద్యా కుసుమం
♦ జిల్లా విద్యార్థిని గుంటూరులో..అనుమానాస్పద మృతి
♦ గుంటూరు విద్యానగర్‌లోని ఓ అకాడమీలో ఘటన..
♦ విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన బాలిక
♦ కళాశాల యాజమాన్యం వల్లేనని బంధువుల ఆరోపణ
♦ కళాశాల ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం
విద్యా కుసుమం రాలిపోయింది. చదువు కోసం ఊరు కాని ఊరు వచ్చి అనుకోని విధంగా మృత్యువు ఒడికి చేరింది. కన్న బిడ్డ క్షేమంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖమే మిగిలింది. విగతజీవిగా ఉన్న బిడ్డను చూసి కన్నవాళ్లు గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తెర వెనుక ఏం జరిగిందో తెలియదుగానీ వారికి మాత్రం తీరని వేదన మిగిల్చింది.
గుంటూరు :
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏదుపాడుకు చెందిన నిజాంపట్నం జయశ్రీ (17) గుంటూరు విద్యానగర్ 1వ లైనులోని ఓ అకాడమీలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి వెంకటనారాయణ సాధారణ వ్యవసాయ కూలీ. ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె జయశ్రీ. సోమవారం ఉదయం 6 గంటలకు అకాడమీలో స్టడీ అవర్‌కు వెళ్లి తిరిగి 7.30 గంటలకు అల్పాహారం తినేందుకు హాస్టల్‌కు వచ్చింది. తనకు తలనొప్పిగా ఉందని, తర్వాత క్లాస్‌కు వస్తానని స్నేహితులకు చెప్పి ఆమె హాస్టల్ గదికి వెళ్లింది.
తర్వాత ఎంతకీ బయటకు రాకపోవడంతో సుమారు రెండు గంటల తర్వాత సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు కొట్టారు. ఎలాంటి స్పందనా లేకపోవడంతో పోలీసులు, ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఉదయం 10 గంటలకు కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రుల సమక్షంలో సిబ్బంది తలుపులు పగులగొట్టి లోపల చూడగా జయశ్రీ విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
మృతిపై అనుమానాలు
విద్యార్థిని మృతిపై పోలీసులు, బంధువులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తమ కుమార్తెను కళాశాల యాజమాన్యమే చంపి ఆత్మహత్యలా చిత్రీకరిస్తోందని బంధువులు ఆరోపిస్తున్నారు. జయశ్రీ అందుకోలేనంత ఎత్తులో ఫ్యాన్ ఉందని, ఎలా ఉరేసుకుంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇద్దరు వార్డెన్లు చెబుతున్న సమాధానాలకు పొంతన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని తలనొప్పితో బాధపడుతూ గదిలోకి వెళ్లినా, తలుపులు తీయకుండా ఉన్నా యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
కళాశాల ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం
జయశ్రీ మృతి చెందిందని తెలుసుకున్న బం«ధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున విద్యానగర్‌లోని కళాశాలకు తరలి వచ్చారు. అక్కడ అందుబాటులో ఉన్న సిబ్బంది చెబుతున్న సమాధానాల్లో పొంతన లేకపోవడం, యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో బంధువుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఉన్నపాటుగా ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కళాశాల గదుల్లోని కిటికీ అద్దాలు పగులగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దాడి యత్నాలు అడ్డుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపు రెండు గంటలకు పైగా ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగడంతో డీఎస్పీ కేజీవీ సరిత, పట్టాభిపురం, పాత గుంటూరు ఎస్‌హెచ్‌వోలు చిట్టెం కోటేశ్వరరావు, పి.బాలమురళీకృష్ణ, ఎస్‌ఐ ఎస్.రవీంద్ర రంగంలోకి దిగి మృతురాలి బంధువులకు సర్ది చెప్పారు.
లేఖలో ఏముంది?
విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడేముందు ఆమె తన తల్లిదండ్రులకు ఓ లేఖ రాసిందని పోలీసులు చెబుతున్నారు. లేఖలో ఉన్న వివరాలు తెలిపేందుకు మాత్రం వారు అంగీకరించడం లేదు. దానిలో ఆమె పలు విషయాల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మృతికి కారణమైన వివరాలేమీ తెలియరాలేదని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.