ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 2021–22 విద్యా సంవత్సరంలో మొదటి దశ ప్రవేశాలకు మంగళవారం నుంచి తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా మంగళవారం నుంచి దరఖాస్తుల పంపిణీ, ప్రవేశాల ప్రారంభానికి మొదటి దశ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. జూలై 7 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తి అవుతుందని పేర్కొంది. జనరల్, వొకేషనల్ విభాగాల్లో ప్రభుత్వ /ప్రైవేట్ ఎయిడెడ్ /ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ /కో–ఆపరేటివ్ /టీఎస్ రెసిడెన్షియల్/ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్/ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్/ ఇన్సెంటివ్/ మైనారిటీ/ కేజీబీవీ/ టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కంపోజిట్ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సర ప్రవేశాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించింది.
పదో తరగతి ఇంటర్నెట్ మార్కుల మెమో ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు (ప్రొవిజనల్ అడ్మిషన్లు) చేపట్టొచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు పేర్కొంది. విద్యార్థులు ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్, టీసీలు సమర్పించాక ప్రవేశాలు (ప్రొవిజనల్ అడ్మిషన్లు) ఖరారు అవుతాయని తెలిపింది. రెండో దశ అడ్మిషన్లు ఎప్పుడు చేపట్టాలనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ అనుబంధ (అఫీలియేటెడ్)కాలేజీల్లోనే ప్రవేశాలు పొందేలా విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లు acadtsbie.cgg.gov.in, tsbie.cgg.gov.inలో పొందుపరిచిన గుర్తింపు, అనుబంధ కాలేజీల జాబితాలను సరిచూసుకోవాలని తెలిపింది.
జీపీఏ ఆధారంగానే..
పదోతరగతి పరీక్షల్లో గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ), సబెక్ట్‌ల వారీగా గ్రేడ్ పాయిం ట్ల ఆధారంగా ఇంటర్ ప్రవేశాలు నిర్వహించాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించొద్దని సూచించింది. ఇతర అంశాల ప్రాతిపదికన ప్రవేశాలు చేపట్టే జూనియర్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
► కాలేజీల్లో ప్రవేశానికి విద్యార్థులు తమ ఆధార్ కార్డులు సమర్పించాలి.
► ప్రతీ విభాగంలో 88కి మించకుండా అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ప్రవేశాలు చేపట్టాలి.
► తగిన అనుమతులు పొందాకే అదనపు సెక్షన్లు తెరవాలి. ఉల్లంఘనలకు పాల్పడితే పెనాల్టీ వేయడంతో పాటు కాలేజీపై అనర్హత వేటు, తదితర చర్యలు ఉంటాయి.
► ప్రవేశాలకు సంబంధించి అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దు. ఉల్లంఘనలపై కఠినచర్యలు.
► జోగినీల సంతానానికి సంబంధించి దరఖాస్తు పత్రంలో తండ్రి పేరుకు బదులు తల్లి పేరును పేర్కొనాలి.
► విదార్థినుల రక్షణకు సంబంధించి ప్రిన్సిపాళ్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
► కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలను రూల్ ఆఫ్ రిజర్వేషన్లను పాటిస్తూ సీట్లు భర్తీ చేయాలని ఆదేశించింది.
ప్రవేశాలకు ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లు..
► బీసీలు: 29 శాతం (ఏ–7, బీ–10, సీ–1, డీ–7, ఈ–4 శాతం)
► ఎస్సీలు: 15 శాతం
► ఎస్టీలు: 6 శాతం
► ఎన్‌సీసీ, స్పోర్ట్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్: 5 శాతం
► దివ్యాంగులు: 3 శాతం
► ఎక్స్ సర్వీస్‌మెన్, రాష్ట్రంలో నివసించే డిఫెన్స్ సిబ్బంది: 3 శాతం
(విడిగా అమ్మాయిలకు కాలేజీలు లేనిచోట ప్రతీ కేటగిరీలో వారికి మూడో వంతు లేదా 33.33 శాతం సీట్లు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది)
Comments
Please login to add a commentAdd a comment