కరీంనగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో మెనూలో పెద్ద ఎత్తున మార్పులు తేవడమే కాకుండా కాస్మోటిక్ కిట్స్ అందిస్తు న్న ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత ధ్యేయంగా ఆరోగ్య కిట్లు అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. 13 వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్ బాలికలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా కిట్లను ప్రభుత్వం జిల్లాలకు విడుదల చేసింది. గత విద్యా సంవత్సరం ఆఖరు నుంచి కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇలాంటి కిట్లు అందజేశారు. ఈసారి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు అందజేస్తుండడం విశేషం. బాలికల ఆరోగ్య రక్షణలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి, నిరాక్షరాస్యత కారణంగా పరిశుభ్రతకు, వైద్యసేవలకు నోచుకోని విద్యార్థినుల ఆరోగ్యానికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికల కోసం ఆరోగ్య కిట్లు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో కిట్లను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారుల కు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూ ర్తి చేసి కిట్లు సైతం పాఠశాలలకు త్వరలోనే అందేలా అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం కోసం..
వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రభుత్వం ఈ కిట్లు పంపిణీ చేస్తోంది. బాలికలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు శానిటరీ న్యాపికిన్స్ సైతం ఈ కిట్‌లో అందజేస్తున్నారు. హెల్త్ అండ్ హైజినిక్ పథకం ద్వారా ఈ కిట్టు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 56,506 మంది విద్యార్థినులకు ఈ కిట్లు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మూడు నెలలకోసారి..
ఒక్కో బాలికకు మూడు నెలలకు సరిపోయేలా వస్తువులను కిట్‌లో ఉంచారు. ఇలా ప్రతీ మూడు నెలలకొసారి ఆరోగ్య కిట్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు.
కిట్‌లో ఉండే వస్తువులు..
కిట్‌లో మొత్తం 13 రకాల వస్తువులు ఉన్నాయి. సబ్బులు 3, బట్టల సబ్బులు 3, కొబ్బరినూనె బాటిల్ 1, షాంపూ బాటిల్ 1, పౌడర్ 1, టూత్‌పెస్ట్ 1, టంగ్‌క్లీనర్ 1, దువ్వెన 1, జడ క్లిప్పులు, జడరబ్బర్లు, బొట్టు బిల్లల ప్యాకెట్, శానిటరీ న్యాపికిన్స్.
24 నుంచి పంపిణీ చేస్తాం..
ఆరోగ్య కిట్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈనెల 24 నుంచి 30వ తేదీల మధ్య ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో 7 నుంచి 10వ తరగతి వరకు, కేజీబీవీల్లో 6 నుంచి 10వ తరగతి వరకు, మోడల్ స్కూల్‌లో 7 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలికలందరికీ కిట్స్ అందజేయాలని ఉత్తర్వులు అందాయి. విద్యార్థినులను అనారోగ్య సమస్యల బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో పరిశుభ్రత కిట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. – వెంకటేశ్వర్లు, డీఈవో, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment