నెల్లూరు(విద్య) : రాష్ట్రం విడిపోయిన అనంతరం జరిగిన మొదటి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జిల్లా 2వ స్థానం సాధించింది. మార్చిలో జరిగిన పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 27,089 మంది విద్యార్థులు హాజరుకాగా 18,346 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 14,109 మంది హాజరు కాగా 9,014 మంది ఉత్తీర్ణులై 65 శాతం పాసయ్యారు. బాలికలు 12,980 మంది హాజరు కాగా 9,232 మంది ఉత్తీర్ణులయ్యారు. 71 శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలే పైచేయిగా నిలిచారు. గత ఏడాది 4వ స్థానంలో ఉన్న జిల్లా ఈ ఏడాది 2వ స్థానం సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకేషనల్ విభాగంలో 1,092 మంది విద్యార్థులు హాజరుకాగా 655 మంది ఉత్తీర్ణులై 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 797 మంది హాజరుకాగా 414 మంది పాసై 52 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 295 మంది హాజరు కాగా 241 మంది ఉత్తీర్ణులై 82 శాతం సాధించారు. కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని వి.సురేఖ 464 మార్కులు, బైపీసీలో విశ్వసాయి విద్యార్థిని పి.వెంకటసాయి 435 మార్కులు, ఎంఈసీలో 488 మార్కులతో కృష్ణచైతన్య విద్యార్థిని హబీబున్నీసా, సీఈసీలో 472 మార్కులతో కృష్ణచైతన్య విద్యార్థిని గంగినేని వీణవిలు జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించారు. అయితే జిల్లాలో ఎంపీసీ విభాగంలో ఎండిటి వెంకటేశ్వర్లుకు 467, కంటా వెంకటప్రణవికి 466, బైపీసీ విభాగంలో సోనం కుమారి కౌర్‌కు 435 అత్యుత్తమ మార్కులు వచ్చినట్లు సమాచారం.