పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పుస్తకాల్లో రాజకీయ కుతంత్రాలు చేరితే..? ప్రచురణ సంస్థలు విచక్షణ కోల్పోయి అక్షరాల్లో విషం దట్టిస్తే..?
టీడీపీ ఆరోపణలు నెత్తికెత్తుకున్న ‘వీజీఎస్’ ప్రచురణ సంస్థ
ఇంటర్ మొదటి సంవత్సరం గైడ్‌లో వైఎస్సార్, జగన్ పేర్ల ప్రస్తావన
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పుస్తకాల్లో రాజకీయ కుతంత్రాలు చేరితే..? ప్రచురణ సంస్థలు విచక్షణ కోల్పోయి అక్షరాల్లో విషం దట్టిస్తే..? ఓ పార్టీ చేసిన ఆరోపణలను నెత్తికెత్తుకొని అక్షరాలుగా అచ్చొత్తి విద్యార్థుల పైకి వదిలితే..? తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కేంద్రంగా నడిచే ‘వీజీఎస్’ ప్రచురణ సంస్థ అచ్చంగా ఇదే చేసింది! తెలుగుదేశం పార్టీ చేసే అసత్య ఆరోపణలనే ప్రామాణికంగా తీసుకుని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్లను తన గైడ్‌లో ప్రస్తావించింది. టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఆరోపణలను యథాతథంగా ప్రచురించింది. ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ‘నైతికత మరియు మానవ విలువలు’ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. యువతరం రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉండాలో చెప్పాలన్నదే ఈ పాఠ్యాంశం ఉద్దేశం. ఇందులో రాజకీయాల్లో పాటించాల్సిన నియమాలు, నైతిక విలువల గురించి మాత్రమే బోధించారు. కానీ, వీజీఎస్ సంస్థ ఈ పాఠ్యపుస్తకానికి అనుబంధంగా వెలువరించిన గైడ్ ఈ అసలు ఉద్దేశాన్ని పక్కనబెట్టి... పచ్చపార్టీకి వంతపాడింది. నైతిక విలువల అవశ్యకతపై రాస్తూ.. ‘నైతిక విలువలనే’ దిగజార్చింది.
ఆరోపణలే పరమావధా..?
సాధారణంగా రాజకీయ పార్టీలు అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం, కొన్నిసార్లు అవి కేసుల దాకా వెళ్లడం సహజం. సీబీఐ వంటి సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పడం కూడా కొత్త కాదు. వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీ నాయకులు ఎందరినో లొంగదీసుకోవడం కోసం ఢిల్లీలో ఉండే ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడిన సందర్భాలు కోకొల్లలు. ఇలాంటి రాజకీయాంశాలేవీ పాఠ్య పుస్తకాల్లో ప్రస్తావించరు. ఈ సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ... ఇంటర్మీడియట్ పాఠ్యాంశంలో లేని అంశాలను వీజీఎస్ సంస్థ తన గైడ్‌లో వండివార్చింది.
ఇది క్షమించరాని తప్పు అని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ‘‘ఓ పాఠ్యాంశం ఉండాల్సిన రీతిలో ఇది లేదు. ఒక పార్టీ తరఫున వకల్తా పుచ్చుకుని పాఠ్యాంశంలో లేనిది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం క్షమించరానిది. దీనిపై ఆ పబ్లిషర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు’ అని తెలుగు అకాడమీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘పాఠ్య పుస్తకాన్ని ఆధారం చేసుకుని గైడ్‌ను ముద్రించడమే తప్పు. ఆ పాఠ్యాంశంలో లేని అంశాలకు కొత్త భాష్యం చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు అపవాదును అంటగట్టడం మరీ తప్పు. మాకు ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ చెప్పారు.