సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రయోగ (ప్రాక్టికల్) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆదివారాలు సహా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ చెప్పారు. ‘సాక్షి’తో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. కోవిడ్ దృష్ట్యా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రోటోకాల్‌ను అనుసరించి పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరి చేసినట్టు వివరించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడంతో పాటు విధిగా మాస్కులు ధరించాలన్నారు. కోవిడ్ నుంచి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. రామకృష్ణ ఇంకా ఏమన్నారంటే..
కంటైన్‌మెంట్ ప్రాంతాల్లోనూ..
కోవిడ్ తీవ్రత ఉండి కంటైన్‌మెంట్ ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల చివరి విడతలో పరీక్షలు నిర్వహిస్తాం. మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా పరీక్షలు జరుగుతాయి. కోవిడ్–19 దృష్ట్యా ప్రోటోకాల్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం విద్యార్థులను లోనికి అనుమతిస్తారు. విద్యార్థులు ఒకే దగ్గర గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్ష కేంద్రాల్లోకి భౌతిక దూరం పాటిస్తూ ప్రవేశించాలి. ప్రాక్టికల్ పరీక్షలకు బ్యాచ్‌కు 20 మంది చొప్పున ఉంటారు. అంతమంది పట్టే వీలులేని చోట భౌతిక దూరం ఉండేలా 10 మందిని మాత్రమే అనుమతిస్తాం. కోవిడ్ లక్షణాలున్న విద్యార్థులకు ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటు చేస్తాం. గతంతో పోలిస్తే ఈసారి 42 కేంద్రాల్ని అదనంగా ఏర్పాటు చేశాం. గతంలో 905 కేంద్రాలుండగా.. ఈసారి 947 ఏర్పాటు చేశాం. విద్యార్థులు, సిబ్బందికి పూర్తిగా జంబ్లింగ్ పద్ధతిలో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తున్నాం. ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తాం. తమ ఫోన్లకు వచ్చే ఓటీపీ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు ఆన్‌లైన్ ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసి విద్యార్థులకు పంపిణీ చేయిస్తారు. ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను ఎట్టి పరిస్థితుల్లో మార్పు చేయడానికి వీల్లేదు.
జిల్లాల పరిధిలోనే టాస్క్‌ఫోర్స్ నిఘా
కరోనా వల్ల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను గతంలో మాదిరిగా ఇతర జిల్లాల నుంచి నియమించడం లేదు. ఆయా జిల్లాల సిబ్బందితోనే టాస్క్‌ఫోర్స్‌లు ఉంటాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. అక్రమాలపై ఫిర్యాదులు వస్తే సీసీ కెమెరాలు పరిశీలించి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం. పరీక్షల సమాధాన పత్రాలు, అవార్డుల లిస్టులు పరీక్ష ఫలితాలు వెలువడే వరకు భద్రపర్చాలని ఆదేశించాం. ఒకరి రికార్డులను వేరొకరు మళ్లీ వినియోగించే వీలు లేకుండా వాటిపై ప్రత్యేక ముద్రలు వేయిస్తున్నాం. ప్రైవేట్ కాలేజీల్లోని ప్రాక్టికల్స్ కేంద్రాల్లో ప్రభుత్వ సిబ్బందినే చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రాక్టికల్ ఎగ్జామినర్లుగా నియమిస్తున్నాం. ఇతర సిబ్బంది ఎవరినీ లోపలకు అనుమతించం. చీఫ్ సూపరింటెండెంట్లు తప్ప మిగతా వారెవరూ పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్లు వినియోగించడానికి వీల్లేదు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా కాలేజీల ప్రిన్సిపాల్స్ సంతకాలతో ప్రమేయం లేకుండా విద్యార్థులు హాల్ టికెట్లను నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు.
విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలి
ఈ పరీక్షలకు ఎంపీసీ స్ట్రీమ్ నుంచి 2,60,012 మంది, బైపీసీ స్ట్రీమ్ నుంచి 98,462 మంది మొత్తం 3,58,474 మంది హాజరు కానున్నారు. జేఈఈ, నీట్ సహా అనేక జాతీయ ప్రవేశ పరీక్షలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లోకి ప్రవేశాలతో ముడిపడి ఉన్నందున విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ ప్రాక్టికల్, ఇతర పరీక్షలను సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కనుక పరీక్షలను ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం. అవాంఛనీయ పరిస్థితులకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు పూర్తి సహకారం అందించాలి.
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
Published Wed, Mar 31 2021 3:17 AM | Last Updated on Wed, Mar 31 2021 4:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment