దేశంలో కొన్నేళ్లుగా పెరుగుతున్న విడాకుల కేసులు
సమస్యలకు పరిష్కారం వెతుక్కోకుండానే కోర్టుకెక్కుతున్న దంపతులు
నచ్చినట్లు బతకాలన్న ధోరణి పెరగడమూ కారణమంటున్న నిపుణులు
విడాకుల శాతంలో 7వ స్థానంలో తెలంగాణ.. తొలి స్థానంలో మహారాష్ట్ర
తీర్పుల్లో సుదీర్ఘ జాప్యంతో అనధికారికంగా విడిపోతున్న జంటలసంఖ్యా ఎక్కువే
సాక్షి, హైదరాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది నిన్నటితరం వరకు దంపతులు అనుసరించిన జీవనమార్గం.. కానీ నేటి ఆధునిక కాలంలో ఈ సామెత దంపతులందరికీ వర్తించట్లేదని ఇటీవలి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఏటేటా విడాకుల కేసులు పెరుగుతున్నాయని ఫ్యామిలీ కోర్టుల్లో పేరుకుపోయిన లక్షలాది కేసులు చెప్పకనే చెబుతున్నాయి. జీవితాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకోవాలన్న ఆలోచన, వివాహ బంధంలో అసంతృప్తి, పాత–ఆధునిక భావాల మధ్య సంఘర్షణ వంటి కారణాలతో జంటలు విడిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని జంటలైతే ఏడాది, రెండేళ్లలోపే వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నాయని అంటున్నారు. వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడం, ఇతర మార్గాలను అన్వేషించకుండానే కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఒక కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది. గతేడాది ఏప్రిల్ వరకు అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే విడాకుల శాతంలో దేశంలోనే ఏడో స్థానంలో తెలంగాణ నిలిచింది.
విడాకుల శాతం పెరగడానికి ప్రధాన కారణాలు...
» దంపతుల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం
» కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు
» వైవాహిక బంధంలో భావోద్వేగాలు కొరవడటం
» పరస్పర నమ్మకం సన్నగిల్లడం
» జీవితంపై అసంతృప్తి, అభద్రతాభావం తీవ్రం కావడం
» భిన్నమైన కుటుంబ నేపథ్యాలు కలిగి ఉండటం
» స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడం
è ఉద్యోగులైన భార్యాభర్తల పనివేళల్లో అంతరాలు ఉండటం
» మద్యపానం, ధూమపానం అలవాట్లు
విడాకుల కేసుల గణాంకాలు..
» 2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
» ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 5,500 విడాకుల కేసులే. వాటిలోనూ 3 వేల కేసులు పెళ్లయిన ఏడాదిలో దాఖలైనవే.
» 2018లో 2,250 కేసులు దాఖలవగా 2022లో 2,723 కేసులు నమోదయ్యాయి.
» గత పదేళ్లలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో విడాకుల శాతం 350 శాతం పెరిగింది. అదే సమయంలో పంజాబ్, హరియాణాలలో 150 శాతం విడాకుల కేసుల్లో పెరుగుదల కనిపించింది.
» గత ఐదేళ్లలో ఢిల్లీలో డివోర్స్‌ల శాతం రెండింతలయ్యింది.
‘కాబోయే వధూవరుల మధ్య హేతుబద్ధమైన చర్చలు, వాస్తవ పరిస్థితులపై స్పష్టమైన అభిప్రాయాల మార్పిడి జరగకపోవడం విడాకుల కేసుల పెరుగుదల ప్రధాన కారణాల్లో ఒకటి. ఇద్దరి అభిప్రాయాలు, జీవనశైలి, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, జీతాలు వంటి వాటిపై వాస్తవ విషయాల గురించి విడమరిచి చర్చించుకోకపోవడం, కుటుంబాల స్థిరచరాస్తులు, వేతనాలు, చదువులు వంటి విషయాల్లో అబద్ధాలు, అవాస్తవాలు చెప్పడం వంటివి పెళ్లి అయ్యాక బయటపడుతున్నాయి.
దీంతో ఇరు కుటుంబాలు, దంపతుల మధ్య ఘర్షణ మొదలవుతోంది. అమ్మాయి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నా కుటుంబానికి, భర్తకు ఎక్కువ సేవ చేయాలని అత్తామామలు ఆశించడం, ఆమె సంపాదనంతా తమకు ఇవ్వాలని పట్టుబట్టడం, ఆర్థిక విషయాల్లో భేదాభిప్రాయాలు పెరగడం ఘర్షణలకు కారణమవుతున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్
అమ్మాయి, అబ్బాయి పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు భిన్నంగా ఉండటం, వివాహ వ్యవస్థ గురించి స్పష్టమైన అవగాహన, అభిప్రాయాలు లేకపోవడం వంటివి విడాకుల శాతం పెరగడానికి కారణ మవుతోంది. జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చాక చోటుచేసుకోబోయే మార్పు చేర్పులపై భయాందోళనలు, ఇద్దరి మధ్య అపార్థాలు పెరగడం, కొత్త ప్రదేశంలో, కొత్త కుటుంబంలో అమ్మాయి కుదురుకోకపోవడం ప్రభావం చూపుతోంది. – కొండపాక సంపత్‌కుమార్, మీడియేషన్ సెంటర్, సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్
2024 ఏప్రిల్ నాటికి వివిధ రాష్ట్రాలవారీగా అత్యధిక విడాకుల కేసులు (శాతాల్లో)
మహారాష్ట్ర 18.7
కర్ణాటక 11.7
యూపీ 8.8
పశ్చిమ బెంగాల్ 8.2
ఢిల్లీ 7.7
తమిళనాడు 7.1
తెలంగాణ 6.7
కేరళ 6.3
Comments
Please login to add a commentAdd a comment