
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అక్కసు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. పదేళ్లలో బీఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మల్లు రవి స్పష్టం చేశారు. ‘తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బంగారు కేసీఆర్ కుటుంబంగా మారింది. ప్రతిపక్షాలు రాత్రింబవళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి.
బంగ్లాదేశ్ లో ప్రజలు తిరిగిపడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.పదేళ్లలో బిఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా పేదల కోసం సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం తీసుకొచ్చింది. సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం.
బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణకి ఏం సంబంధం కేటీఆర్. ధరణితో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసింది.16 లక్షలు మంది ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతుల మేలు కోసం భూభారతిని సీఎం రేవంత్, మంత్రులు బృందం తీసుకొచ్చింది. ప్రగతి భవన్ లో ప్రజలు కనపడకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ హయంలో ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలు వెళ్లేందుకు వీలు కల్పించారు. కాంగ్రెస్ ఏడాదిన్నర లో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం’ అని మల్లు రవి పేర్కొన్నారు.