సాక్షిప్రతినిధి, వరంగల్: నగరాలు, పట్ణణాలు, పల్లెలు.. ఇవేమీ తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు.. ఫలితంగా వేల సంఖ్యలో జలవనరులు కనుమరుగవుతున్నా యి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చినవాటి లో కొన్ని ఆక్రమణలపాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారాయి. ఇటీవల కేంద్ర మైనర్ ఇరిగేషన్ స్టాటిస్టిక్స్ విభాగం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ‘ఇరిగేషన్ సెన్సెస్’నిర్వహించింది. అనేక చెరువులు కనుమరుగైనట్లు, మరి కొన్ని ప్రమాదంలో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది.
ఓరుగల్లు చెరువులు ఎంతెంత పోయాయంటే
వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలతో కుచించుకు పోయాయి. 100 ఎకరాలకుపైగా ఉండే చిన్నవడ్డేపల్లి చెరువు సుమారు 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు కొద్ది రోజుల క్రితం రెవెన్యూ శాఖనే తేలి్చంది. మామునూరు పెద్ద చెరువు 170 ఎకరాలకుగాను సుమారు 40 ఎకరాలు, 126 ఎకరాల్లో విస్తరించి ఉన్న పాతబస్తీ ఉర్సు రంగ సముద్రం (ఉర్సు చెరువును) సుమారు 26 ఎకరాలు, హనుమకొండ హంటర్‌రోడ్ న్యూశాయంపేటలో 150 ఎకరాల విస్తీర్ణంలోని కోటి చెరువులో సుమారు 25–30 ఎకరాల వరకు ప్రైవేటుపరమయ్యాయి. హన్మకొండ, కాజీపేట ప్రాంతవాసుల తాగునీటి అవసరాలు తీర్చే హన్మకొండ వడ్డేపల్లి చెరువులో 40 ఎకరాలకు వరకు, 336 ఎకరాల భద్రకాళి చెరువులో సుమారు 40 ఎకరాల పైచిలుకు కనుమరుగైందని అధికారులు గుర్తించారు.
తెలంగాణలో ఆక్రమణకు గురైనవి 3,032
దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్ననీటి వనరులు కుచించుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 38,496 చెరువులు, ట్యాంకులు, సరస్సులు తదితర చిన్ననీటి వనరులు ఆక్రమణకు గురికాగా, సుమారు 14,535 చోట్ల ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కాగా అత్యధికంగా ఆక్రమణలకు గురైన ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 64,056 చిన్ననీటి వనరుల్లో 3,032 ఆక్రమణలకు గురైనట్లు నివేదిక తేల్చింది. ఈ 3,032 చెరువుల్లో ఎక్కువ హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఐదు సెంటిమీటర్ల వాన పడితే నగరం మునుగుడే
కాకతీయ రాజులు నిర్మించిన అనేక చెరువులు వరంగల్ నగరం చుట్టూ ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల వల్ల గొలుసుకట్టు చెరువుల సిస్టం దెబ్బతిని ఐదు సెంటిమీటర్ల వర్షం పడితే చాలు నగరం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆక్రమణలను నియంత్రించకపోతే ఆ చెరువులు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది.
– చీకటి రాజు, రాష్ట్ర కన్వీనర్, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ
లోకాయుక్తలో విచారణ జరుగుతోంది
వరంగల్‌లో 8కి పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటన్నింటిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. భద్రకాళీ సహా అన్ని చెరువుల ఆక్రమణపై లోకాయుక్త కోర్టులో చేసిన ఫిర్యాదులపై తదుపరి విచారణ 2024 జూన్ 23న ఉంది.
– సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు, వినియోగదారుల మండలి
చెరువుల ఆక్రమణలపై నోటీసులు
వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై వచి్చన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మా దృష్టికి వచి్చన వాటిని ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చాము. పోలీసు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశాం.
– ఎ.సుధాకర్ రెడ్డి, ఎస్‌ఈ, జలవనరులశాఖ
Comments
Please login to add a commentAdd a comment