Private ownership
-
తెలంగాణలో 64,056 జల వనరులు
తెలంగాణలో మొత్తం 64,056 జల వనరులు ఉన్నాయని.. వీటిలో 98.5% (63,064) గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 1.5% (992) పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన తొలి జల వనరుల సెన్సస్ నివేదిక వెల్లడించింది. 80.5% (51,593) జల వనరులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండగా, 19.5% (12,463) ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. 17.3% (11,076) జల వనరులు ‘కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం’కింద, 10.6% (6,781) గిరిజన ప్రాంతాల్లో, మిగిలిన 72.1% (46,199) వరద పీడిత ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేగాక 64,056 జల వనరుల్లో 80.8% (51,733) వాడుకలో ఉండగా, 19.2% (12,323) ఎండిపోవడం, పూడిక తీయకపోవడం, మరమ్మతు చేయలేని విధంగా నాశనం కావడం, లవణీయత ఇతర కారణాల వల్ల ఉపయోగంలో లేవని నివేదికలో వెల్లడించారు. – సాక్షి, న్యూఢిల్లీ నిండిన స్థితిలో 43,695 జల వనరులు రాష్ట్రంలో 10,170 సహజసిద్ధమైన, 53,886 మానవ నిర్మిత జల వనరులు ఉన్నాయి. సహజ జల వనరుల్లో 96.2% (9,781) గ్రామీణ ప్రాంతాల్లో, 3.8% (389) పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. మానవ నిర్మిత జల వనరుల్లో 98.9% (53,283) పల్లెల్లో, 1.1% (603) పట్టణాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 64,056 జల వనరుల్లో 43,695 వనరులు ‘నిండిన నిల్వ సామర్థ్యం’/ ’నిండిన స్థితి’కలిగి ఉన్నాయి. గత ఐదేళ్లలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడం లాంటి ప్రమాణాల ఆధారంగా ఈ 43,695 వనరుల్లో 20.3% (8,862) ప్రతి ఏటా నిండుతున్నట్లు గుర్తించారు. 41.9% (18,301) సాధారణంగా నిండుతుండగా, 29.8% (13,033) చాలా అరుదుగా నిండుతున్నాయని, 8.0% (3,499) ఎప్పుడూ నిండట్లేదని నివేదికలో వెల్లడించారు. మొత్తమ్మీద 38,540 వనరులు జిల్లా నీటిపారుదల ప్రణాళిక/రాష్ట్ర నీటిపారుదల ప్రణాళికలో ఉన్నాయి. వీటిలో 45.9% (17,681) చెరువులు కాగా, 54.1% (20,859) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, నీటి సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్‌లు మొదలైనవి ఉన్నాయి. 1,540 చెరువులు, 1,492 ట్యాంకులు, సరస్సుల్లో ఆక్రమణలు రాష్ట్రంలోని 3,032 జల వనరుల్లో ఆక్రమణలను గుర్తించారు. వాటిలో 50.8% (1,540) చెరువులు, 49.2% (1,492) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, జల సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్‌లు మొదలైనవి ఉన్నాయి. వీటిలో 3,032 ఆక్రమణకు గురైన జల వనరులు, 2,028 జల వనరుల్లో ఆక్రమణ ప్రాంతాన్ని అంచనా వేశారు. ఈ 2,028 వనరులకుగాను 1,415 జల వనరుల్లో 25% కంటే తక్కువ విస్తీర్ణంలో ఆక్రమణలకు గురవుతున్నాయని, 402 జలవనరులు 25%–75% మధ్య ఆక్రమణ కలిగి ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. మిగిలిన 211 జల వనరులు 75% కంటే ఎక్కువ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 64,056 జల వనరుల్లో 63,769 వనరుల్లో ‘జల వ్యాప్తి ప్రాంతం’నివేదించారు. వీటిలో 51.6% (32,914) జల వనరులు 0.5 హెక్టార్ల కంటే తక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నాయి. అయితే 1.8% (1,166) జల వనరులు 50 హెక్టార్ల కంటే ఎక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. -
‘ప్రైవేట్’ వైద్యం‘
-
‘ప్రైవేట్’ వైద్యం‘
కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలిక ఊడిపోయింది..’ అనేది ఓ సామెత. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అందించే విషయమై ప్రభుత్వ తీరూ అలాగే ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో నిరుపేదలకు మరింత పకడ్బందీగా, నాణ్యమైన వైద్య సేవల్ని అందించాల్సిన ప్రభుత్వం... వాటిని ప్రైవేటుకు అప్పగించేసి ఉన్న సేవల్నీ ఊడగొట్టేస్తోంది. కార్పొరేట్ తరహాలో ముక్కుపిండి వసూలు చేసేలా యూజర్ చార్జీలకు తెరతీస్తోంది. ప్రైవేటుకు అప్పగించడం వల్ల ప్రభుత్వాస్పత్రులకు ఒరిగేదేమీ లేకపోగా రోగులకు నష్టం జరిగేలా నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే ఒక జిల్లా ఆస్పత్రిని ప్రైవేటుకు అప్పగించగా.. తాజాగా రాష్ట్రంలో ఉన్న మిగతా 8 జిల్లా ఆస్పత్రులనూ ఇచ్చేందుకు తీర్మానించింది. సామాన్యులను కుంగదీస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులను ప్రైవేటు పరంచేసే ప్రక్రియ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి మూడేళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం మరో ఎనిమిది జిల్లా ఆస్పత్రులనూ ప్రైవేటుకు అప్పగించాలని తాజాగా నిర్ణయించింది. ‘ప్రైవేటు ఎంటర్ప్రెన్యూర్లను ప్రోత్సహించాలి, కొత్త మెడికల్ కళాశాలలు రావాలి’ అన్న పేరుతో జిల్లా ఆస్పత్రులను ప్రైవేటు యాజమాన్యాలకు లీజుకిచ్చి, దీని ద్వారా మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకునేందుకు సర్కారు ఊతమిస్తోంది. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వారం రోజుల క్రితం విజయవాడలో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు జిల్లా ఆస్పత్రులను ఉన్నతీకరించి వాటినే మెడికల్ కళాశాలలుగా తీర్చిదిద్దాల్సిన సర్కారే ఏకంగా ప్రైవేటుకు అప్పజెప్పి పేదరోగులపై కోలుకోలేని దెబ్బకొట్టనుంది. ఎనిమిది ఆస్పత్రులు ప్రైవేటుకు నెల రోజుల క్రితం చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగిస్తూ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీచేసింది. తాజాగా మరో 8 ఆస్పత్రులను ప్రైవేటు యాజమాన్యాలకు లీజుకివ్వాలని నిర్ణయించింది. ఇవన్నీ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రులే. మొత్తం వైద్యవిధాన పరిషత్ పరిధిలో 9 జిల్లా ఆస్పత్రులుంటే ఒకటి ఇప్పటికే అపోలో యాజమాన్యానికి ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పుడు మిగతా వాటిని ఇవ్వాలని తీర్మానించింది. తొలుత ఆస్పత్రిని క్లినికల్ అటాచ్మెంట్ పేరుతో మూడేళ్లకు లీజుకిస్తారు. దీనిపేరుతో ప్రైవేటు యాజమాన్యాలు 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్యకళాశాలకు దరఖాస్తు చేసుకుంటుంది. ఆ తర్వాత లీజు పొడిగించడం షరా మామూలే. సాధారణంగా ఆస్పత్రిని ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం రూ.150 కోట్లు అవుతుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రులున్న ప్రదేశాల్లోనే నిర్మించాలంటే వందల కోట్లు వెచ్చించాల్సిందే. అంటే.. మన ఆస్పత్రుల ద్వారా ప్రైవేటు వాళ్లకు ఎంత మేలు జరుగుతోందో దీన్నిబట్టి తెలుస్తోంది. మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారని, యథావిధిగా కన్వీనర్ కోటా సీట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మన ఆస్పత్రులను ప్రైవేటుకు ఇవ్వకపోయినా 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా ఇవ్వాల్సిందే. ప్రభుత్వాసుపత్రులను ఇవ్వడం వల్ల ఒరిగేదేమీ లేకపోగా రోగులకు నష్టం జరిగే అవకాశముంటుంది. మామ నిర్ణయానికి అల్లుడి పోటు మామ తీసుకొచ్చిన వ్యవస్థకు అల్లుడి పోటు అంటే ఇదే. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో వైద్యవిధానపరిషత్ (ఏపీవీవీపీ) వ్యవస్థ ఏర్పాటైంది. అప్పట్లో 20 జిల్లా ఆస్పత్రులు, 56 ఏరియా ఆస్పత్రులు, మరికొన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలతో ఏర్పాటైంది. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రలో 9 జిల్లా ఆస్పత్రులున్నాయి. వీటన్నిటినీ ప్రైవేటుకు ఇస్తే ఇక ఏపీవీవీపీ చరిత్ర కనుమరుగు కానున్నట్టే. వేలాదిమంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు వీళ్లందరూ ప్రైవేటు కింద పనిచేయాల్సి వస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయంపై మండిపడుతున్నారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. నష్టాలేమిటీ అంటే... * రోగుల నుంచి యూజర్‌చార్జీలు వసూలు చేసే అవకాశం. * ఆయా ఆస్పత్రుల్లోని వైద్యులు, పారామెడికల్, నర్సులు ఎవరికింద పనిచేయాలన్నది సందేహం. * మౌలిక వసతుల కల్పన ఏమేరకు చేస్తారన్నదీ స్పష్టీకరించలేదు. * పస్తుతం ప్రభుత్వమే ఉచితంగా మందులిస్తోంది, ప్రైవేటుకు వెళ్లాక పరిస్థితిపై సందేహం. * అత్యవసర పరిస్థితుల్లోనే ప్రభుత్వాసుపత్రులకు రోగులొస్తారు.. ఈ బాధ్యత ప్రైవేటు తీసుకుంటుందా? * అత్యవసర శస్త్రచికిత్సల విషయంలో రోగికి నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? * ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం ప్రైవేటు వైద్యులు అందిస్తారా? * ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఎవరు చెల్లిస్తారు? * వైద్యుల నుంచి పారామెడికల్ వరకు శాశ్వతంగా నియామకాలు నిలిచిపోతాయి * ఆయా ఆస్పత్రులకు భవిష్యత్తులో బడ్జెట్ కేటాయించే అవకాశం ఉండకపోవచ్చు. * పభుత్వం తన బాధ్యతల నుంచి క్రమేణా తప్పుకుంటోంది. ఇప్పటికే ప్రైవేటుకు వెళ్లిన తీరు.. * గత మూడేళ్లలో ఇప్పటికే పలు సేవలను ప్రైవేటుకు అప్పజెప్పారు. * విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు వైద్య కళాశాలల్లో రేడియాలజీ సేవలు మెడాల్ సంస్థకు ఇచ్చారు. * కిడ్నీ రోగులకు అందించే డయాలసిస్ సేవలు బి-బ్రాన్ అనే సంస్థకు అప్పజెప్పారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఒక్కొక్కరికి ప్రభుత్వం ఈ సంస్థకు రూ.1,000 చెల్లిస్తోంది. * ఓపెన్ హార్ట్ సర్జరీలను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పేరుతో గుంటూరులో సహృదయ ఫౌండేషన్‌కు, విశాఖపట్నంలో కేర్‌కు అప్పజెప్పారు. * అనంతపురం జిల్లాలో రక్తపరీక్షలు మెడాల్ సంస్థకు ఇచ్చారు. * గీతం యూనివర్సిటీ(విశాఖ)కి డీమ్డ్ హోదా వచ్చింది. రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలూ డీమ్డ్ హోదాకు వెళుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు లేకుండా పోతాయి. ప్రైవేటుకు అప్పజెబుతున్న ఆస్పత్రులు ఇవే.. జిల్లా ఆసుపత్రులు... విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, నంద్యాల, ప్రొద్దుటూరు, హిందూపురం. -
పీజీ కౌన్సెలింగ్‌లో ప్రైవేటు మాయ
తిరుపతికి చెందిన ఓ విద్యార్థినికి కంప్యూటర్ సైన్స్‌లో 59వ ర్యాంకు సాధించింది. ఈమెకు ఎస్వీయూ క్యాంపస్‌లో సీటు రావాల్సి ఉంది. అయితే ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు మాయమాటలు చెప్పడంతో క్యాంపస్‌లో కాదని ప్రైవేటు కళాశాలలో చేరింది. బద్వేలుకు చెందిన మరో యువతి 20వ ర్యాంకు సాధించినప్పటికీ క్యాంపస్‌లో చేరనీయకుండా ప్రైవేటు ప్రతినిధులు మాయ మాటలు చెప్పి తమ కళాశాలలో చేర్చుకున్నారు. ఇలా పలు సంఘటనలు పీజీ కౌన్సెలింగ్‌లో ప్రైవేటు మోసాన్ని బహిర్గతం చేస్తున్నాయి. - విద్యార్థులను మాయ చేస్తున్న ప్రైవేటు ప్రతినిధులు - నష్టపోతున్న ప్రతిభావంతులు యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జరుగుతున్న కౌన్సెలింగ్‌పై ప్రైవేటు యాజమాన్యాలు తమ పంజా విసురుతున్నాయి. విద్యార్థులను మభ్యపెట్టి తమ కళాశాలల్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్వీయూ, దాని అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి ఈనెల 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దాదాపు 5,500 సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో క్యాంపస్‌లో 1900 సీట్లు ఉండగా ప్రైవేటు కళాశాలల్లో 3,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్‌లో నాణ్యమైన, అర్హత కలిగిన అధ్యాపకులతో బోధనతో పాటు అన్ని సౌకర్యాలతో కూడిన లైబ్రరీ ఇతర సౌకర్యాలు ఉన్నాయి. క్యాంపస్‌తో పోల్చితే ప్రైవేటు కళాశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. దీనివల్ల విద్యార్థులు క్యాంపస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతారు. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు చేరకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులకు గాలం వేసి, చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా కౌన్సెలింగ్ జరుగుతున్న శ్రీనివాస ఆడిటోరియంలో కొంతమంది ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు తిష్ట వేసి, విద్యార్థులకు మాయ మాటలు చెబుతున్నారు. తమ కళాశాలల్లో చేరితే తరగతులకు హాజరు కాకపోయినా పట్టించుకోమని, పరీక్షల్లో పాస్ కావడానికి ఏర్పాట్లు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కళాశాలలు విద్యార్థులకు చిన్న చిన్న బహుమతుల పేరిట నజరానాలు అందిస్తున్నాయి. వీటికి ఆకర్షితులై విద్యార్థులు క్యాంపస్‌లో ఖాళీ ఉన్నప్పటికీ ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు. అడ్మిషన్స్ వ్యవహారరం చూస్తున్న కొందరు అధ్యాపకులు కూడా ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కై విద్యార్థులకు గాలం వేస్తున్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చేరి నష్టపోతున్నారు. గురువారం తిరుపతికి చెందిన సంధ్య అనే విద్యార్థి ఇలా నష్టపోయారు. ఈ విషయం విద్యార్థి సంఘాలకు తెలియడంతో వారు ఆందోళన చేశారు. దీంతో ప్రైవేటు ప్రతినిధుల వ్యవహారం బయటకు వచ్చింది. అడ్మిషన్స్ డెరైక్టర్ భాస్కర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారిని పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే నష్టపోయిన విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయలేమని రెండో విడతలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేటు ప్రతినిధులు విద్యార్థులను ప్రలోభపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.