
‘ప్రైవేట్’ వైద్యం‘
కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలిక ఊడిపోయింది..’ అనేది ఓ సామెత. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అందించే విషయమై ప్రభుత్వ తీరూ అలాగే ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో నిరుపేదలకు మరింత పకడ్బందీగా, నాణ్యమైన వైద్య సేవల్ని అందించాల్సిన ప్రభుత్వం... వాటిని ప్రైవేటుకు అప్పగించేసి ఉన్న సేవల్నీ ఊడగొట్టేస్తోంది. కార్పొరేట్ తరహాలో ముక్కుపిండి వసూలు చేసేలా యూజర్ చార్జీలకు తెరతీస్తోంది. ప్రైవేటుకు అప్పగించడం వల్ల ప్రభుత్వాస్పత్రులకు ఒరిగేదేమీ లేకపోగా రోగులకు నష్టం జరిగేలా నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే ఒక జిల్లా ఆస్పత్రిని ప్రైవేటుకు అప్పగించగా.. తాజాగా రాష్ట్రంలో ఉన్న మిగతా 8 జిల్లా ఆస్పత్రులనూ ఇచ్చేందుకు తీర్మానించింది. సామాన్యులను కుంగదీస్తోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులను ప్రైవేటు పరంచేసే ప్రక్రియ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి మూడేళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం మరో ఎనిమిది జిల్లా ఆస్పత్రులనూ ప్రైవేటుకు అప్పగించాలని తాజాగా నిర్ణయించింది. ‘ప్రైవేటు ఎంటర్‌ప్రెన్యూర్‌లను ప్రోత్సహించాలి, కొత్త మెడికల్ కళాశాలలు రావాలి’ అన్న పేరుతో జిల్లా ఆస్పత్రులను ప్రైవేటు యాజమాన్యాలకు లీజుకిచ్చి, దీని ద్వారా మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకునేందుకు సర్కారు ఊతమిస్తోంది.
స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వారం రోజుల క్రితం విజయవాడలో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు జిల్లా ఆస్పత్రులను ఉన్నతీకరించి వాటినే మెడికల్ కళాశాలలుగా తీర్చిదిద్దాల్సిన సర్కారే ఏకంగా ప్రైవేటుకు అప్పజెప్పి పేదరోగులపై కోలుకోలేని దెబ్బకొట్టనుంది.
ఎనిమిది ఆస్పత్రులు ప్రైవేటుకు
నెల రోజుల క్రితం చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగిస్తూ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీచేసింది. తాజాగా మరో 8 ఆస్పత్రులను ప్రైవేటు యాజమాన్యాలకు లీజుకివ్వాలని నిర్ణయించింది. ఇవన్నీ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రులే. మొత్తం వైద్యవిధాన పరిషత్ పరిధిలో 9 జిల్లా ఆస్పత్రులుంటే ఒకటి ఇప్పటికే అపోలో యాజమాన్యానికి ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పుడు మిగతా వాటిని ఇవ్వాలని తీర్మానించింది.
తొలుత ఆస్పత్రిని క్లినికల్ అటాచ్‌మెంట్ పేరుతో మూడేళ్లకు లీజుకిస్తారు. దీనిపేరుతో ప్రైవేటు యాజమాన్యాలు 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్యకళాశాలకు దరఖాస్తు చేసుకుంటుంది. ఆ తర్వాత లీజు పొడిగించడం షరా మామూలే. సాధారణంగా ఆస్పత్రిని ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం రూ.150 కోట్లు అవుతుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రులున్న ప్రదేశాల్లోనే నిర్మించాలంటే వందల కోట్లు వెచ్చించాల్సిందే. అంటే.. మన ఆస్పత్రుల ద్వారా ప్రైవేటు వాళ్లకు ఎంత మేలు జరుగుతోందో దీన్నిబట్టి తెలుస్తోంది. మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారని, యథావిధిగా కన్వీనర్ కోటా సీట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మన ఆస్పత్రులను ప్రైవేటుకు ఇవ్వకపోయినా 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా ఇవ్వాల్సిందే. ప్రభుత్వాసుపత్రులను ఇవ్వడం వల్ల ఒరిగేదేమీ లేకపోగా రోగులకు నష్టం జరిగే అవకాశముంటుంది.
మామ నిర్ణయానికి అల్లుడి పోటు
మామ తీసుకొచ్చిన వ్యవస్థకు అల్లుడి పోటు అంటే ఇదే. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో వైద్యవిధానపరిషత్ (ఏపీవీవీపీ) వ్యవస్థ ఏర్పాటైంది. అప్పట్లో 20 జిల్లా ఆస్పత్రులు, 56 ఏరియా ఆస్పత్రులు, మరికొన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలతో ఏర్పాటైంది. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రలో 9 జిల్లా ఆస్పత్రులున్నాయి. వీటన్నిటినీ ప్రైవేటుకు ఇస్తే ఇక ఏపీవీవీపీ చరిత్ర కనుమరుగు కానున్నట్టే. వేలాదిమంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు వీళ్లందరూ ప్రైవేటు కింద పనిచేయాల్సి వస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయంపై మండిపడుతున్నారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
నష్టాలేమిటీ అంటే...
* రోగుల నుంచి యూజర్‌చార్జీలు వసూలు చేసే అవకాశం.
* ఆయా ఆస్పత్రుల్లోని వైద్యులు, పారామెడికల్, నర్సులు ఎవరికింద పనిచేయాలన్నది సందేహం.
* మౌలిక వసతుల కల్పన ఏమేరకు చేస్తారన్నదీ స్పష్టీకరించలేదు.
* పస్తుతం ప్రభుత్వమే ఉచితంగా మందులిస్తోంది, ప్రైవేటుకు వెళ్లాక పరిస్థితిపై సందేహం.
* అత్యవసర పరిస్థితుల్లోనే ప్రభుత్వాసుపత్రులకు రోగులొస్తారు.. ఈ బాధ్యత ప్రైవేటు తీసుకుంటుందా?
* అత్యవసర శస్త్రచికిత్సల విషయంలో రోగికి నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?
* ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం ప్రైవేటు వైద్యులు అందిస్తారా?
* ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఎవరు చెల్లిస్తారు?
* వైద్యుల నుంచి పారామెడికల్ వరకు శాశ్వతంగా నియామకాలు నిలిచిపోతాయి
* ఆయా ఆస్పత్రులకు భవిష్యత్తులో బడ్జెట్ కేటాయించే అవకాశం ఉండకపోవచ్చు.
* పభుత్వం తన బాధ్యతల నుంచి క్రమేణా తప్పుకుంటోంది.
ఇప్పటికే ప్రైవేటుకు వెళ్లిన తీరు..
* గత మూడేళ్లలో ఇప్పటికే పలు సేవలను ప్రైవేటుకు అప్పజెప్పారు.
* విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు వైద్య కళాశాలల్లో రేడియాలజీ సేవలు మెడాల్ సంస్థకు ఇచ్చారు.
* కిడ్నీ రోగులకు అందించే డయాలసిస్ సేవలు బి-బ్రాన్ అనే సంస్థకు అప్పజెప్పారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఒక్కొక్కరికి ప్రభుత్వం ఈ సంస్థకు రూ.1,000 చెల్లిస్తోంది.
* ఓపెన్ హార్ట్ సర్జరీలను పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ పేరుతో గుంటూరులో సహృదయ ఫౌండేషన్‌కు, విశాఖపట్నంలో కేర్‌కు అప్పజెప్పారు.
* అనంతపురం జిల్లాలో రక్తపరీక్షలు మెడాల్ సంస్థకు ఇచ్చారు.
* గీతం యూనివర్సిటీ(విశాఖ)కి డీమ్డ్ హోదా వచ్చింది. రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలూ డీమ్డ్ హోదాకు వెళుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు లేకుండా పోతాయి.
ప్రైవేటుకు అప్పజెబుతున్న ఆస్పత్రులు ఇవే..
జిల్లా ఆసుపత్రులు... విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, నంద్యాల, ప్రొద్దుటూరు, హిందూపురం.