పీజీ కౌన్సెలింగ్‌లో ప్రైవేటు మాయ
తిరుపతికి చెందిన ఓ విద్యార్థినికి కంప్యూటర్ సైన్స్‌లో 59వ ర్యాంకు సాధించింది. ఈమెకు ఎస్వీయూ క్యాంపస్‌లో సీటు రావాల్సి ఉంది. అయితే ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు మాయమాటలు చెప్పడంతో క్యాంపస్‌లో కాదని ప్రైవేటు కళాశాలలో చేరింది.
బద్వేలుకు చెందిన మరో యువతి 20వ ర్యాంకు సాధించినప్పటికీ క్యాంపస్‌లో చేరనీయకుండా ప్రైవేటు ప్రతినిధులు మాయ మాటలు చెప్పి తమ కళాశాలలో చేర్చుకున్నారు.
ఇలా పలు సంఘటనలు పీజీ కౌన్సెలింగ్‌లో ప్రైవేటు మోసాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
- విద్యార్థులను మాయ చేస్తున్న ప్రైవేటు ప్రతినిధులు
- నష్టపోతున్న ప్రతిభావంతులు
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జరుగుతున్న కౌన్సెలింగ్‌పై ప్రైవేటు యాజమాన్యాలు తమ పంజా విసురుతున్నాయి. విద్యార్థులను మభ్యపెట్టి తమ కళాశాలల్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్వీయూ, దాని అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి ఈనెల 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దాదాపు 5,500 సీట్లకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో క్యాంపస్‌లో 1900 సీట్లు ఉండగా ప్రైవేటు కళాశాలల్లో 3,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
క్యాంపస్‌లో నాణ్యమైన, అర్హత కలిగిన అధ్యాపకులతో బోధనతో పాటు అన్ని సౌకర్యాలతో కూడిన లైబ్రరీ ఇతర సౌకర్యాలు ఉన్నాయి. క్యాంపస్‌తో పోల్చితే ప్రైవేటు కళాశాలల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. దీనివల్ల విద్యార్థులు క్యాంపస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతారు. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు చేరకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులకు గాలం వేసి, చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా కౌన్సెలింగ్ జరుగుతున్న శ్రీనివాస ఆడిటోరియంలో కొంతమంది ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు తిష్ట వేసి, విద్యార్థులకు మాయ మాటలు చెబుతున్నారు. తమ కళాశాలల్లో చేరితే తరగతులకు హాజరు కాకపోయినా పట్టించుకోమని, పరీక్షల్లో పాస్ కావడానికి ఏర్పాట్లు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
అంతేకాకుండా కొన్ని కళాశాలలు విద్యార్థులకు చిన్న చిన్న బహుమతుల పేరిట నజరానాలు అందిస్తున్నాయి. వీటికి ఆకర్షితులై విద్యార్థులు క్యాంపస్‌లో ఖాళీ ఉన్నప్పటికీ ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు. అడ్మిషన్స్ వ్యవహారరం చూస్తున్న కొందరు అధ్యాపకులు కూడా ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కై విద్యార్థులకు గాలం వేస్తున్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చేరి నష్టపోతున్నారు. గురువారం తిరుపతికి చెందిన సంధ్య అనే విద్యార్థి ఇలా నష్టపోయారు. ఈ విషయం విద్యార్థి సంఘాలకు తెలియడంతో వారు ఆందోళన చేశారు. దీంతో ప్రైవేటు ప్రతినిధుల వ్యవహారం బయటకు వచ్చింది. అడ్మిషన్స్ డెరైక్టర్ భాస్కర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారిని పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే నష్టపోయిన విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయలేమని రెండో విడతలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేటు ప్రతినిధులు విద్యార్థులను ప్రలోభపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.