ఈ నెల గడిచేనా..?
► కోరుట్లకు మంచినీటి గండం
► నిండని పాలమాకుల చెరువు
► ఖాళీ అవుతున్న తాళ్ల చెరువు..
► భూగర్భజలాలకూ దెబ్బ
కోరుట్ల: వర్షాలు జాడలేవు.. అరకొరగా వచ్చిన ఎస్సారెస్పీ నీరు..నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కోరుట్లకు మంచినీటి ముప్పు పొంచి ఉంది. వర్షాల పరిస్థితి ఇలాగే ఉంటే.. ఈ నెలాఖరులో నీటి గండం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో జనం సతమతమవుతున్నారు.
పెరిగిన అవసరాలు...
ఈ మధ్యకాలంలో కోరుట్ల జనాభా సుమారు లక్షకు మించిపోయింది. పట్టణంలోని 31వ వార్డుల్లో కలిపి మొత్తం 22 వేల పైచిలుకు ఇళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 13 వేలకుపైగా ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో మంచినీటి పైప్‌లైన్లు లేని ఏరియాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. ప్రతీరోజు పట్టణ జనాభా అవసరాలకు నల్లా కనెక్షన్ల ద్వారా సరాఫరా చేయడానికి సుమారు 4.2 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది.
ప్రస్తుతం పట్టణ శివారులోని తాళ్ల చెరువు నుంచి నీటిని వాగులో ఉన్న బావుల్లో నింపి వాటర్ ట్యాంకుల ద్వారా పట్టణానికి సరాఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు నల్లాల నుంచి నీటిని సరాఫరా చేస్తున్నారు. ఇదంతా మంచినీటి పైప్‌లైన్ ఉన్న చోట మాత్రమే జరుగుతోంది. మంచినీటి పైప్‌లైన్లు పూర్తిస్థాయిలో లేని భీమునిదుబ్బ, రథాల పంపు, హాజీపురా, ఆనంద్‌నగర్, ఆల్లమయ్యగుట్ట ఏరియాల్లో మంచినీటికి తిప్పలు తప్పడం లేదు. భూగర్భజలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోవడంతో నల్లానీటిపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నీటి అవసరాలు మరింత పెరిగాయి. అవసరాలు పెరిగినా నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారడంతో పరిస్థితి అయోమయంగా మారింది.
ఈ నెల గడిచేనా..?
పట్టణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం వాడుతున్న తాళ్ల చెరువులో నీటి మట్టం దాదాపుగా డెడ్‌స్టోరేజీకి చేరింది. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు ముందుచూపుతో ఎస్సారెస్పీ నీటిని వదిలిన సమయంలో మరో నీటి వనరుగా ఉన్న పాలమాకుల చెరువును నింపే ప్రయత్నం చేశారు. ఎస్సారెస్పీ నుంచి నీరు తక్కువగా రావడంతో ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించలేదు.
ఫలితంగా తాళ్ల చెరువు, పాలమాకుల చెరువుల్లో ప్రస్తుతం ఉన్న నీటి వనరులు మరో 20–25 రోజులకు మించి సరిపోవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు లేని క్రమంలో భూగర్భ జలమట్టం సుమారు 900 ఫీట్లుకు పడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇటు మున్సిపల్ నల్లా నీరు లేక..అటు బోర్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఏడాది క్రితంలా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేయాల్సిన దుస్థితి మళ్లీ వస్తుందా..? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి.