- ఏర్పాటు చేయనున్న సీఎం ఫడ్నవీస్
- నీటి ఎద్దడిపై చర్చించాలని నిర్ణయం
ముంబై: రాష్ట్రంలో కరవు పరిస్థితిని తట్టుకునేందుకు నీటి వనరుల ప్రత్యామ్నాయాలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తారస్థాయికి చేరడంతో నీటి వనరులు, రెవెన్యూ, ఫైనాన్స్ శాఖల అధికారులలో సీఎం సమావేశం ఏర్పాటు చేసి నీటి ఎద్దడి తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కరవు పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కేంద్రం చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియ దీర్ఘకాలిక ప్రాజెక్టు అని, ప్రభుత్వం సత్వర ప్రత్యామ్నాయాల కోసం ఆలోచిస్తోందని ఆయన అన్నారు. ఇందుకోసం కొంకణ్ తీరం నుంచి నీటిని రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నామన్నారు.
విద్యాపథకాల అమలుపై ప్రభుత్వ దృష్టి
కేంద్రం ప్రవేశ పెట్టిన విద్యా పథకాలను జిల్లాల్లోని పాఠశాలల్లో అమలుచేసి విద్యార్థుల పని తీరును పరీక్షించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కమిటీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జిల్లా పరిషత్, ప్రైమరీ, సెకండరీ విద్యాధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విద్యా కమిటీ అధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారని ఆయన అన్నారు. సీనియర్ లోక్‌సభ సభ్యుడు ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారన్నారు. విద్యార్థుల ప్రతిభ, పనితీరు, వివిధ విద్యాపథకాల అమలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు.
‘నీటి’ ప్రత్యామ్నాయాలపై సమీక్ష
Published Wed, Apr 29 2015 3:50 AM | Last Updated on Fri, May 25 2018 1:22 PM
Advertisement