Minister Devendra fadnavis
-
సీఎం క్షమాపణ చెప్పాలి
- మాజీ ముఖ్యమంత్రి చవాన్ డిమాండ్ - విమానం ఆలస్యానికి సీఎం కారణమని ఆరోపణ ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కారణంగా అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గంటపాటు ఆలస్యమయిందని, ఇందుకు సీఎం క్షమాపణ చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గురువారం డిమాండ్ చేశారు. దాదాపు 200 మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందని ఆయన పేర్కొన్నారు. సీఎంతో పాటు ప్రయాణించనున్న ఓ అధికారి సరైన డాక్యుమెంట్లు తీసుకురాకపోవడంతో విమానాన్ని కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కేవలం రక్షణ సంబంధిత అంశాలు మినహా వేరే కారణాల వల్ల నిలిపేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఫడ్నవీస్ కారణంగా విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురికావాల్సి వచ్చిందని వాపోయారు. దీనిపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం ఫడ్నవీస్ ఈ సంఘటనపై బాధ్యత వహించాలన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఇప్పటికే పౌర విమానయాన శాఖను కోరినట్లు ఆయన తెలిపారు. సీఎం చెబుతున్నది నిజమా లేదా ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నది నిజమా అనేది సమగ్ర దర్యాప్తు ద్వారానే తెలుస్తుందని ఆయన చవాన్ పేర్కొన్నారు. గతనెల 29న (సోమవారం) ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల 57 నిమిషాలు ఆలస్యంగా నడిచిందని ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొంటున్నారు. అదేరోజు సీఎం ఫడ్నవీస్ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఆయనతో పాటు వెళుతున్న వారిలో పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్, ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ పరదేశి ఉన్నారు. అయితే పరదేశి వీసా స్టాంపింగ్ లోపమున్న కారణంగా ఎయిర్‌పోర్టు అధికారులు చెక్ఇన్ వద్దే నిలిపేశారు. దీంతో గంటపాటు ఆలస్యమయిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే విమానం ఆలస్యమవడానికి తాను కారణం కాదని ఫడ్నవీస్ ఖండించారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారు: మలిక్ తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకులకు అధికార దాహం పట్టుకుందని ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మలిక్ ఆరోపించారు. బీజేపీ మంత్రులు అవినీతికి పాల్పడటమేకాకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నగరంలో గురువారం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత సోమవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రి వర్గం ఆమెరికా బయలుదేరే సమయంలో ఆయన కార్యదర్శి వీసాను మర్చిపోవడం సిగ్గుచేటన్నారు. ఇంటి నుంచి వీసా తీసుకువచ్చేసరికి ఆలస్యమైందని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని దుయ్యబట్టారు. విమానం గంటకు పైగా ఆలస్యంగా బయలుదేరిందని, నాయకులు అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. విషయం తెలిసిపోవడంతో సాంకేతిక కారణాలవల్ల విమానం ఆలస్యంగా టేకాఫ్ అయిందని ట్విట్టర్ ద్వారా తెలియజేసి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. కాగా, మరో బీజేపీ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు కారణంగా ఎయిర్ ఇండియా విమానం ఆలస్యంగా బయలుదేరిందని, ఆయనకు విమానంలో సీటు లేకపోవడంవల్ల ముగ్గురు ప్రయాణికులను కిందికి దింపాల్సి వచ్చిందన్నారు. ఈ రెండు ఘటనలకు బాధ్యత వహిస్తూ వారు ప్రజలను క్షమాపణ కోరాలని మలిక్ డిమాండ్ చేశారు. -
కరవు ప్రాంతాలకు ఆర్థిక సాయం
- రూ. 34 కోట్లు ప్రకటించిన సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్ - జిల్లాకు రూ. కోటి చొప్పున ఇచ్చినట్లు వెల్లడి - త్వరలో డయాలసిస్ మిషిన్లను పంపిణీ చేస్తామన్న ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాణే సాక్షి, ముంబై: ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ‘ఐఎస్వో 9001’ సర్టిఫికెట్ అందుకున్న ప్రఖ్యాత సిద్ధి వినాయక మందిరం టస్టు.. కరవు ప్రాంతాల సహాయార్థం రూ. 34 కోట్లు విరాళంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ చెర్మైన్ నరేంద్ర రాణే శనివారం తెలిపారు. ప్రభుత్వం దాదాపు 25 వేల గ్రామాలను కరవు నిరోధిత ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించడంతో తాము ఒక్కో జిల్లాకు రూ. కోటి విరాళంగా ప్రకటించామని ఆయన తెలిపారు. ఈ మొతాన్ని అధికారులకు ఇవ్వకుండా నేరుగా ప్రతి జిల్లా కలెక్టర్‌ను కలుసుకుని చెక్ రూపంలో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కరవు పరిస్థితి ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించామని, నిధుల వినియోగంపై నిరంతర సమీక్ష నిర్వహిస్తుంటామని చెప్పారు. త్వరలో రూ.7.5 కోట్లు వెచ్చించి 102 పట్టణాలు, గ్రామాల్లో డయాలసిస్ మిషిన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు డయాలసిస్ కోసం అయ్యే ఖర్చును భరించలేరని, అందుకే ఈ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాణే తెలిపారు. వాడియా ప్రసూతి ఆస్పత్రిలో 20 నియోనాటల్ ఐసీయూలను ఏర్పాటు చేయడానికి ట్రస్ట్ తరఫున రూ.1.5 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. గుండె, కాలేయం, కిడ్నీ రోగులకు, మోకాళ్ల మార్పిడికి సంబంధించిన అవుడ్ పేషెంట్లకు ట్రస్ట్ ప్రతి ఏడాది రూ.1.5 కోట్లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్క రోగి తరఫున రూ.25 వేలు చికిత్స చేసిన ఆస్పత్రికి ఫార్వర్డ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులకు పుస్తక పంపిణీ కోసం రూ.1.5 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. ఆలయంలో భద్రత కోసం వంద సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేశామని, వాటిని పర్యవేక్షణ స్థానిక పోలీస్టేషన్లో జరుగుతుందని అన్నారు. -
విడిపోవడంతోనే బలం తెలిసింది..!
- బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశాల్లో సీఎం ఫడ్నవీస్ - వర్షాకాల సమావేశాల్లో కేబినెట్ విస్తరణ జరపనున్నట్లు వెల్లడి - పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేనతో విడిపోవడంతోనే రాష్ట్రంలో బీజేపీ బలం ఏంటో తెలిసిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశాలు శనివారం కొల్హాపూర్‌లో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొత్తు లేకుండా బరిలోకి దిగటంతోనే బీజేపీ 120 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా శివసేన నుంచి విడిపోయి పోటీ చేశామని, అయితే దాని వల్ల తమకు మేలే జరిగిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక కోటి మంది సభ్యులున్నారని, సభ్యత్వం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని ఆయన అన్నారు. ప్రస్తుతం బీజేపీ సభ్యుల సంఖ్య 10 కోట్లకు చేరిందని, ఇలాంటి పార్టీలో సభ్యుడిగా ఉన్నం దుకు గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో కోటి మంది సభ్యులను రాష్ట్ర అధ్యక్షులు రావ్‌సాహెబ్ దానవే చేర్పించగా, దేశంలో పది కోట్ల సభ్యులను చేర్చడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారన్నారు. అయిదేళ్ల పాలనలో తమ ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తుందన్న నమ్మకాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తం చేశారు. జైతాపూర్ ప్రాజెక్టును పూర్తిచేస్తాం.. -రావ్‌సాహెబ్ దానవే జైతాపూర్ ప్రాజెక్టును శివసేన వ్యతిరేకిస్తున్నా.. తాము మాత్రం దాన్ని పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రావ్‌సాహెబ్ దానవే స్పష్టం చేశారు. ‘శివసేన, బీజేపీల మధ్య కొన్ని అంశాలపై విభేదాలున్నాయి. జైతాపూర్ ప్రాజెక్టు, రైతుల ఆత్మహత్యల విషయంలో శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. వీటిపై చర్చలు జరిపితేనే పరిష్కారం లభిస్తుంది’ అని అన్నారు. గతంలో నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే చర్చలు జరిపి కొన్ని సమస్యలకు పరిష్కారం లభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చే శారు. ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్ కొరత పెరిగిందని, జైతాపూర్ ప్రాజెక్టు మినహా ప్రత్యామ్నాయం లేదన్నారు. వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ వర్షాకాల సమావేశాలకు ముందే మంత్రి మండలి విస్తరణ చేపడతామని సీఎం ప్రకటించారు. పార్టీలో ‘ఒక వ్యక్తి ఒక పదవి’ అనే సూత్రం ఆధారంగా పదవులను కేటాయించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకులకు గాయాలు... కొల్హాపూర్‌లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరిన పింప్రి-చించ్వడ్ బీజేపీ నాయకుల కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. పుణే-కోల్హాపూర్ రహదారిపై ఉంబ్రజ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో స్థానిక నాయకులు బాలాసాహెబ్ గవ్నా, మహేశ్ కులకర్ణిలకు గాయలయ్యాయి. -
సీఎం సతీమణి కారుకు స్వల్వ ప్రమాదం
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. యాక్సిస్ బ్యాంకులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అమృత.. సాయంత్రం పని పూర్తయిన అనంతరం తన ఇనోవా కారులో ఇంటికి బయలుదేరింది. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో లోయర్ పరేల్ వద్ద వేగంగా వచ్చిన ఓ సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ ఇనోవా కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అమృత ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. -
మేమొచ్చాక నేరాలు తగ్గాయి..
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడి - ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు పూర్తయిన సందర్భంగా చర్చా గోష్టి సాక్షి, ముంబై: తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాలు తగ్గాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటయ్యి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మంత్రాలయలో విలేకరులతో బుధవారం చర్చా గోష్టి నిర్వహించారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరాలు తగ్గాయని, నేరస్థులకు శిక్ష పడడం పెరిగిందని అన్నారు. ఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయని ఆయన తెలిపారు. తమ ప్రజాస్వామ్య కూటమి అధికారంలో ఎనిమిది శాతం మాత్రమే శిక్షలు పడేవన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ జలవనరుల కుంభకోణం గురించిన మూలాల వరకు వెళ్తామన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాల్ సెంట ర్లలో మహిళలు రాత్రి పూట కూడా డ్యూటీ చేస్తున్నారని, ఇతర కార్ఖానాల్లో కూడా మహిళలకు రాత్రి డ్యూటీలు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలనే విషయంపై అవసరమైన చట్టాన్ని క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. -
‘కాల్బదేవీ’ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించండి
- బీఎంసీని ఆదేశించి సీఎం ఫడ్నవీస్ - మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ - గాయపడ్డ సిబ్బంది వైద్యం ఖర్చు భరిస్తామన్న బీఎంసీ - ప్రభుత్వ సాయాన్ని వారంలోగా అందిస్తామని స్పష్టం సాక్షి, ముంబై: కాల్బాదేవిలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్‌ను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. దక్షిణ ముంబైలోని కాల్బాదేవి ప్రాంతంలో వందేళ్ల గోకుల్ నివాస్ భవనంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మంటలను అదుపుచేసే ప్రయత్నంలో ఇద్దరు జవాన్లు మర ణించగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిని అగ్నిమాపక దళం అసిస్టెంట్ ఆఫీసర్ సంజయ్ రాణే, బైకల్లా కేంద్రం అధికారి మహేంద్ర దేసాయిగా గుర్తించారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన జవాన్లకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. బైకల్లాలోని అగ్నిమాపక ప్రధాన కేంద్రంలో సందర్శనార్థం ఉంచిన జవాన్ల భౌతిక కాయాలకు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శ్రద్ధాంజలి ఘటించారు. గాయపడిన జవాన్ల వైద్యం ఖర్చు భరిస్తామని బీఎంసీ ప్రకటించింది. జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన చెల్లింపులు వారం రోజుల్లో అందజేస్తామని బీఎంసీ పరిపాలన విభాగం స్పష్టం చేసింది. శర్మిలా ఠాక్రే పరామర్శ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే భార్య శర్మిలా ఠాక్రే, తనయుడు అమిత్ ఠాక్రే అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. హిట్ అండ్ రన్ కేసులో ముద్దాయి సల్మాన్‌ఖాన్‌తో భేటీ అయ్యేందుకు వెళ్లిన రాజ్ ఠాక్రే, నితేశ్ రాణేలకు.. విధి నిర్వాహణలో ప్రాణాలు పొగొట్టుకున్న జవాన్ల కుటుంబాలను పరామర్శించేందుకు సమయం లేదా అనే విమర్శలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో శర్మిలా, అమిత్ ఠాక్రేలు జవాన్ల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లడం విశేషం. ఫైర్ అధికారులు చనిపోవడం బాధాకరం: గవర్నర్ కాల్బదేవి ఘటనలో ఇద్దరు సీనియర్ అధికారులు మృతి చెందడంపై రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు విచారం వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో అధికారులు చనిపోవడం బాధాకరమైన విషయం అని ఆయన అన్నారు. అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన చీఫ్ ఫైర్ అధికారి, ఇతర సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆశించారు. -
అక్రమంగా రేషన్ తరలిస్తే నాన్‌బెయిలబుల్ వారెంట్
- పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం సాక్షి, ముంబై: ఇకపై నిత్యవసర సరుకులు బ్లాక్ మార్కెట్లో విక్రయించే రేషన్ షాప్ డీలర్లపై నాన్‌బెయిల బుల్ కేసులు నమోదు చేయనున్నారు. ఆహార , పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించిన ఈ సిఫార్సుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అర్హులైన పేదలకు ప్రతి నెల రేషన్ కార్డు ద్వారా బియ్యం, గోధుమలు, కిరోసిన్, చక్కెర, పప్పు దినుసులు పంపిణీ చేస్తారు. అందులో చాలా వరకు సరుకులను రేషన్ డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కిరాణా షాపులకు నెలనెలా తరలిస్తున్నారు. రేషన్ అధికారులకు మామూళ్లు ముట్టడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో నిత ్యవసర సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుం డగా పట్టుబడిన కేసులు అనేకం ఉన్నాయి. రేషన్ కార్యాలయ అధికారులు, ఇన్స్పెక్టర్లు తరుచూ రేషన్ షాపుల్లో తనిఖీలు నిర ్వహిస్తున్నారు. సరుకు నిల్వలకు సంబంధించిన వివరాలు లేకున్నా, రేషన్ తీసుకున్న వారి వివరాలు రాయకున్నా చర్యలు తీసుకునే వారు. చిన్న కేసులు నమోదు చేయడంతో డీలర్లపై వాటి ప్రభావం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమ రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నాన్‌బెయిలెబుల్ కేసులు నమోదు చేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ తాజాగా రూపొందించిన ప్రతిపాదనను ఇది వ రకే ముఖ్యమంత్రికి సమర్పించింది. దీనికి సీఎం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. -
‘నీటి’ ప్రత్యామ్నాయాలపై సమీక్ష
- ఏర్పాటు చేయనున్న సీఎం ఫడ్నవీస్ - నీటి ఎద్దడిపై చర్చించాలని నిర్ణయం ముంబై: రాష్ట్రంలో కరవు పరిస్థితిని తట్టుకునేందుకు నీటి వనరుల ప్రత్యామ్నాయాలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తారస్థాయికి చేరడంతో నీటి వనరులు, రెవెన్యూ, ఫైనాన్స్ శాఖల అధికారులలో సీఎం సమావేశం ఏర్పాటు చేసి నీటి ఎద్దడి తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరవు పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కేంద్రం చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియ దీర్ఘకాలిక ప్రాజెక్టు అని, ప్రభుత్వం సత్వర ప్రత్యామ్నాయాల కోసం ఆలోచిస్తోందని ఆయన అన్నారు. ఇందుకోసం కొంకణ్ తీరం నుంచి నీటిని రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నామన్నారు. విద్యాపథకాల అమలుపై ప్రభుత్వ దృష్టి కేంద్రం ప్రవేశ పెట్టిన విద్యా పథకాలను జిల్లాల్లోని పాఠశాలల్లో అమలుచేసి విద్యార్థుల పని తీరును పరీక్షించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కమిటీలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జిల్లా పరిషత్, ప్రైమరీ, సెకండరీ విద్యాధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విద్యా కమిటీ అధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారని ఆయన అన్నారు. సీనియర్ లోక్‌సభ సభ్యుడు ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారన్నారు. విద్యార్థుల ప్రతిభ, పనితీరు, వివిధ విద్యాపథకాల అమలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు.