సీఎం క్షమాపణ చెప్పాలి | CM should apologize | Sakshi
Sakshi News home page

సీఎం క్షమాపణ చెప్పాలి

Published Fri, Jul 3 2015 12:04 AM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

సీఎం క్షమాపణ చెప్పాలి - Sakshi

సీఎం క్షమాపణ చెప్పాలి

- మాజీ ముఖ్యమంత్రి చవాన్ డిమాండ్
- విమానం ఆలస్యానికి సీఎం కారణమని ఆరోపణ
ముంబై:
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కారణంగా అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గంటపాటు ఆలస్యమయిందని, ఇందుకు సీఎం క్షమాపణ చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గురువారం డిమాండ్ చేశారు. దాదాపు 200 మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందని ఆయన పేర్కొన్నారు. సీఎంతో పాటు ప్రయాణించనున్న ఓ అధికారి సరైన డాక్యుమెంట్లు తీసుకురాకపోవడంతో విమానాన్ని కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కేవలం రక్షణ సంబంధిత అంశాలు మినహా వేరే కారణాల వల్ల నిలిపేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఫడ్నవీస్ కారణంగా విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురికావాల్సి వచ్చిందని వాపోయారు.

దీనిపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం ఫడ్నవీస్ ఈ సంఘటనపై బాధ్యత వహించాలన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఇప్పటికే పౌర విమానయాన శాఖను కోరినట్లు ఆయన తెలిపారు. సీఎం చెబుతున్నది నిజమా లేదా ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నది నిజమా అనేది సమగ్ర దర్యాప్తు ద్వారానే తెలుస్తుందని ఆయన చవాన్ పేర్కొన్నారు.

గతనెల 29న (సోమవారం) ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల 57 నిమిషాలు ఆలస్యంగా నడిచిందని ఎయిర్ ఇండియా అధికారులు పేర్కొంటున్నారు. అదేరోజు సీఎం ఫడ్నవీస్ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఆయనతో పాటు వెళుతున్న వారిలో పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్, ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ పరదేశి ఉన్నారు. అయితే పరదేశి వీసా స్టాంపింగ్ లోపమున్న కారణంగా ఎయిర్‌పోర్టు అధికారులు చెక్‌ఇన్ వద్దే నిలిపేశారు. దీంతో గంటపాటు ఆలస్యమయిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే విమానం ఆలస్యమవడానికి తాను కారణం కాదని ఫడ్నవీస్ ఖండించారు.

అధికార దుర్వినియోగం చేస్తున్నారు: మలిక్
తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకులకు అధికార దాహం పట్టుకుందని ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మలిక్ ఆరోపించారు. బీజేపీ మంత్రులు అవినీతికి పాల్పడటమేకాకుండా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నగరంలో గురువారం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత సోమవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రి వర్గం ఆమెరికా బయలుదేరే సమయంలో ఆయన కార్యదర్శి వీసాను మర్చిపోవడం సిగ్గుచేటన్నారు.

ఇంటి నుంచి వీసా తీసుకువచ్చేసరికి ఆలస్యమైందని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని దుయ్యబట్టారు. విమానం గంటకు పైగా ఆలస్యంగా బయలుదేరిందని, నాయకులు అధికార దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. విషయం తెలిసిపోవడంతో సాంకేతిక కారణాలవల్ల విమానం ఆలస్యంగా టేకాఫ్ అయిందని  ట్విట్టర్ ద్వారా తెలియజేసి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. కాగా, మరో బీజేపీ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు కారణంగా ఎయిర్ ఇండియా విమానం ఆలస్యంగా బయలుదేరిందని,  ఆయనకు విమానంలో సీటు లేకపోవడంవల్ల ముగ్గురు ప్రయాణికులను కిందికి దింపాల్సి వచ్చిందన్నారు. ఈ రెండు ఘటనలకు బాధ్యత వహిస్తూ వారు ప్రజలను క్షమాపణ కోరాలని మలిక్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement