మేమొచ్చాక నేరాలు తగ్గాయి..
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడి
- ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు పూర్తయిన సందర్భంగా చర్చా గోష్టి
సాక్షి, ముంబై: తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాలు తగ్గాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటయ్యి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మంత్రాలయలో విలేకరులతో బుధవారం చర్చా గోష్టి నిర్వహించారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరాలు తగ్గాయని, నేరస్థులకు శిక్ష పడడం పెరిగిందని అన్నారు.
ఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయని ఆయన తెలిపారు. తమ ప్రజాస్వామ్య కూటమి అధికారంలో ఎనిమిది శాతం మాత్రమే శిక్షలు పడేవన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ జలవనరుల కుంభకోణం గురించిన మూలాల వరకు వెళ్తామన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాల్ సెంట ర్లలో మహిళలు రాత్రి పూట కూడా డ్యూటీ చేస్తున్నారని, ఇతర కార్ఖానాల్లో కూడా మహిళలకు రాత్రి డ్యూటీలు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలనే విషయంపై అవసరమైన చట్టాన్ని క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.