కరవు ప్రాంతాలకు ఆర్థిక సాయం
- రూ. 34 కోట్లు ప్రకటించిన సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్
- జిల్లాకు రూ. కోటి చొప్పున ఇచ్చినట్లు వెల్లడి
- త్వరలో డయాలసిస్ మిషిన్లను పంపిణీ చేస్తామన్న ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాణే
సాక్షి, ముంబై: ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ‘ఐఎస్‌వో 9001’ సర్టిఫికెట్ అందుకున్న ప్రఖ్యాత సిద్ధి వినాయక మందిరం టస్టు.. కరవు ప్రాంతాల సహాయార్థం రూ. 34 కోట్లు విరాళంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్ చెర్మైన్ నరేంద్ర రాణే శనివారం తెలిపారు. ప్రభుత్వం దాదాపు 25 వేల గ్రామాలను కరవు నిరోధిత ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించడంతో తాము ఒక్కో జిల్లాకు రూ. కోటి విరాళంగా ప్రకటించామని ఆయన తెలిపారు.
ఈ మొతాన్ని అధికారులకు ఇవ్వకుండా నేరుగా ప్రతి జిల్లా కలెక్టర్‌ను కలుసుకుని చెక్ రూపంలో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కరవు పరిస్థితి ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించామని, నిధుల వినియోగంపై నిరంతర సమీక్ష నిర్వహిస్తుంటామని చెప్పారు. త్వరలో రూ.7.5 కోట్లు వెచ్చించి 102 పట్టణాలు, గ్రామాల్లో డయాలసిస్ మిషిన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు డయాలసిస్ కోసం అయ్యే ఖర్చును భరించలేరని, అందుకే ఈ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాణే తెలిపారు. వాడియా ప్రసూతి ఆస్పత్రిలో 20 నియోనాటల్ ఐసీయూలను ఏర్పాటు చేయడానికి ట్రస్ట్ తరఫున రూ.1.5 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.
గుండె, కాలేయం, కిడ్నీ రోగులకు, మోకాళ్ల మార్పిడికి సంబంధించిన అవుడ్ పేషెంట్లకు ట్రస్ట్ ప్రతి ఏడాది రూ.1.5 కోట్లు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్క రోగి తరఫున రూ.25 వేలు చికిత్స చేసిన ఆస్పత్రికి ఫార్వర్డ్ చేస్తున్నామన్నారు. విద్యార్థులకు పుస్తక పంపిణీ కోసం రూ.1.5 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. ఆలయంలో భద్రత కోసం వంద సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేశామని, వాటిని పర్యవేక్షణ స్థానిక పోలీస్టేషన్‌లో జరుగుతుందని అన్నారు.