‘కాల్బదేవీ’ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించండి | A comprehensive inquiry on fire accident | Sakshi
Sakshi News home page

‘కాల్బదేవీ’ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించండి

Published Sun, May 10 2015 10:38 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM

A comprehensive inquiry on fire accident

- బీఎంసీని ఆదేశించి సీఎం ఫడ్నవీస్
- మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ
- గాయపడ్డ సిబ్బంది వైద్యం ఖర్చు భరిస్తామన్న బీఎంసీ
- ప్రభుత్వ సాయాన్ని వారంలోగా అందిస్తామని స్పష్టం
సాక్షి, ముంబై:
కాల్బాదేవిలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్‌ను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. దక్షిణ ముంబైలోని కాల్బాదేవి ప్రాంతంలో వందేళ్ల గోకుల్ నివాస్ భవనంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మంటలను అదుపుచేసే ప్రయత్నంలో ఇద్దరు జవాన్లు మర ణించగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతి చెందిన వారిని అగ్నిమాపక దళం అసిస్టెంట్ ఆఫీసర్ సంజయ్ రాణే, బైకల్లా కేంద్రం అధికారి మహేంద్ర దేసాయిగా గుర్తించారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన జవాన్లకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. బైకల్లాలోని అగ్నిమాపక ప్రధాన కేంద్రంలో సందర్శనార్థం ఉంచిన జవాన్ల భౌతిక  కాయాలకు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శ్రద్ధాంజలి ఘటించారు. గాయపడిన జవాన్ల వైద్యం ఖర్చు భరిస్తామని బీఎంసీ ప్రకటించింది. జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన చెల్లింపులు వారం రోజుల్లో అందజేస్తామని బీఎంసీ పరిపాలన విభాగం స్పష్టం చేసింది.

శర్మిలా ఠాక్రే పరామర్శ
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే భార్య శర్మిలా ఠాక్రే, తనయుడు అమిత్ ఠాక్రే అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. హిట్ అండ్ రన్ కేసులో ముద్దాయి సల్మాన్‌ఖాన్‌తో భేటీ అయ్యేందుకు వెళ్లిన రాజ్ ఠాక్రే, నితేశ్ రాణేలకు.. విధి నిర్వాహణలో ప్రాణాలు పొగొట్టుకున్న జవాన్ల కుటుంబాలను పరామర్శించేందుకు సమయం లేదా అనే విమర్శలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో శర్మిలా, అమిత్ ఠాక్రేలు జవాన్ల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లడం విశేషం.

ఫైర్ అధికారులు చనిపోవడం బాధాకరం: గవర్నర్
కాల్బదేవి ఘటనలో ఇద్దరు సీనియర్ అధికారులు మృతి చెందడంపై రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు విచారం వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో అధికారులు చనిపోవడం బాధాకరమైన విషయం అని ఆయన అన్నారు. అగ్ని ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన చీఫ్ ఫైర్ అధికారి, ఇతర సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆశించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement