విడిపోవడంతోనే బలం తెలిసింది..!
- బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశాల్లో సీఎం ఫడ్నవీస్
- వర్షాకాల సమావేశాల్లో కేబినెట్ విస్తరణ జరపనున్నట్లు వెల్లడి
- పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేనతో విడిపోవడంతోనే రాష్ట్రంలో బీజేపీ బలం ఏంటో తెలిసిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశాలు శనివారం కొల్హాపూర్‌లో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొత్తు లేకుండా బరిలోకి దిగటంతోనే బీజేపీ 120 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా శివసేన నుంచి విడిపోయి పోటీ చేశామని, అయితే దాని వల్ల తమకు మేలే జరిగిందని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి ఒక కోటి మంది సభ్యులున్నారని, సభ్యత్వం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని ఆయన అన్నారు. ప్రస్తుతం బీజేపీ సభ్యుల సంఖ్య 10 కోట్లకు చేరిందని, ఇలాంటి పార్టీలో సభ్యుడిగా ఉన్నం దుకు గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో కోటి మంది సభ్యులను రాష్ట్ర అధ్యక్షులు రావ్‌సాహెబ్ దానవే చేర్పించగా, దేశంలో పది కోట్ల సభ్యులను చేర్చడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారన్నారు. అయిదేళ్ల పాలనలో తమ ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తుందన్న నమ్మకాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తం చేశారు.
జైతాపూర్ ప్రాజెక్టును పూర్తిచేస్తాం.. -రావ్‌సాహెబ్ దానవే
జైతాపూర్ ప్రాజెక్టును శివసేన వ్యతిరేకిస్తున్నా.. తాము మాత్రం దాన్ని పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రావ్‌సాహెబ్ దానవే స్పష్టం చేశారు. ‘శివసేన, బీజేపీల మధ్య కొన్ని అంశాలపై విభేదాలున్నాయి. జైతాపూర్ ప్రాజెక్టు, రైతుల ఆత్మహత్యల విషయంలో శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. వీటిపై చర్చలు జరిపితేనే పరిష్కారం లభిస్తుంది’ అని అన్నారు. గతంలో నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే చర్చలు జరిపి కొన్ని సమస్యలకు పరిష్కారం లభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చే శారు. ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్ కొరత పెరిగిందని, జైతాపూర్ ప్రాజెక్టు మినహా ప్రత్యామ్నాయం లేదన్నారు.
వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ
వర్షాకాల సమావేశాలకు ముందే మంత్రి మండలి విస్తరణ చేపడతామని సీఎం ప్రకటించారు. పార్టీలో ‘ఒక వ్యక్తి ఒక పదవి’ అనే సూత్రం ఆధారంగా పదవులను కేటాయించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకులకు గాయాలు...
కొల్హాపూర్‌లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరిన పింప్రి-చించ్‌వడ్ బీజేపీ నాయకుల కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. పుణే-కోల్హాపూర్ రహదారిపై ఉంబ్రజ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో స్థానిక నాయకులు బాలాసాహెబ్ గవ్నా, మహేశ్ కులకర్ణిలకు గాయలయ్యాయి.