దేశచరిత్రలోనే ఇది తొట్టతొలి ప్రయత్నం. మనిషికి ప్రాణావసరమైన జల వనరులు ఎక్కడెక్కడ, ఎంతెంత, ఎలా ఉన్నాయని లెక్కలు తేల్చిన ఘట్టం. మానవ తప్పిదాల వల్ల క్షీణిస్తున్న నీటి వసతులను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మరోసారి గుర్తు చేసిన జలగణన యజ్ఞం. కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల విడుదల చేసిన భారత జలవనరుల తొలి గణన అనేక విధాల కీలకమైనది అందుకే.
దేశంలో అటు ప్రకృతి సహజమైన, ఇటు మానవ కల్పితమైన చెరువులు, సరస్సులు, నీటి కుంటల సమగ్ర సమాచారాన్ని ఈ లెక్కలు తొలిసారిగా ముందుకు తెచ్చాయి. దేశంలో ఈ జల వనరులు ఏ మేరకు ఆక్రమణకు గురైనదీ తేల్చాయి. సమస్త జీవరాశి మనుగడ కొనసాగాలంటే... ప్రతి నీటి చుక్కా కీలక సమకాలీన సందర్భంలో కేంద్రశాఖ నిర్వహించిన ఈ జలవనరుల గణన ఆహ్వానించదగ్గ యత్నం.
ప్రతి ఇంటికీ సురక్షిత మంచి నీటిని అందిస్తామని పాలకులు పదే పదే సంకల్పం చెప్పుకుంటున్న వేళ ఈ నీటి వసతుల సమగ్ర సమాచారం ప్రాధాన్యం సంతరించుకుంది. చెరువులు, రిజర్వా యర్లు, సరస్సులు – ఇలా జలవనరులు వివిధ రకాలు. కాగా, వాగులు, నీటి చెలమలు, గృహ సము దాయాలు – ఇతర ప్రాంతాల నుంచి చేరిన వర్షపునీళ్ళు, ఏదైనా నది – వాగుల నుంచి దారి మళ్ళించడం ద్వారా నిల్వచేసిన నీళ్ళు, మంచు కరగడంతో ఏర్పడ్డ నీటి వసతి... ఇలాంటివన్నీ కూడా నీటి వనరులేనని ఈ తొలి జలగణన నివేదిక నిర్వచించింది.
వ్యవసాయం, చేపల పెంపకం, ఆధ్యాత్మికత – ఇలా రకరకాల ప్రయోజనాల కోసం నీటిని నిల్వ చేసినవాటిని జాబితాకు ఎక్కించింది. 2018– 19లో చేసిన ఈ గణన దేశం మొత్తం మీద 24 లక్షలకు పైగా జలవనరులు ఉన్నాయని తేల్చింది. వీటిలో 97.1 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, 2.9 శాతమే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. నీటి వస తుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న భారీ అంతరాలను ఈ జల నివేదిక ఎత్తిచూపింది.
ఈ లెక్కల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 7.47 లక్షల జలవనరులతో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానం దక్కించుకోగా, దేశంలోనే అత్యధిక జనాభాకు నిలయమైన ఉత్తర ప్రదేశ్ కేవలం 2.5 లక్షల నీటివనరులతో రెండో స్థానంలో నిలిచింది. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా ఏకంగా 3.55 లక్షల నీటి వనరులతో దేశంలోనే ముందుంది.
అలాగే, దేశంలోని నీటి వనరుల్లో దాదాపు 63 శాతం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో నెలకొన్నాయి. బెంగాల్‌లో నీటి మడుగులు, రిజర్వాయర్లు, ఆంధ్రప్రదేశ్‌లో చెరువులు, తమిళనాట సరస్సులు ఎక్కువని ఈ నివేదిక తేల్చింది. అదే సమయంలో దాదాపు 1.6 శాతం మేర, అంటే 38 వేలకు పైగా వనరులు కబ్జాకు గురయ్యాయట. ఈ కబ్దాలో 40 శాతం వాటా యూపీదే అన్నది నివేదిక సారాంశం.
నిజానికి, 1986 నుంచి అయిదేళ్ళకోసారి కేవలం చిన్న నీటిపారుదల వసతుల లెక్కలను కేంద్రం చేపడుతూ వచ్చింది. అందులో ప్రధానంగా ప్రభుత్వ సంస్థల జనాభా లెక్కల నుంచి సేకరించిన డేటాను సంకలనం చేస్తూ వచ్చింది. అయితే, ప్రభుత్వాలు ఒకప్పుడు నీటి వసతులను కేవలం వ్యవసాయ, ఆర్థిక ప్రయోజనాల్లో భాగంగానే చూస్తూ వచ్చాయి. ఆ దృక్కోణం గత రెండు దశాబ్దాల్లో మారింది.
మానవ, పర్యావరణ సంక్షేమానికి జలవనరుల ప్రాధాన్యాన్ని గ్రహించి, పాత తప్పును సరిదిద్దుకొనే పనిలో ప్రభుత్వాలు పడ్డాయి. 2005లోనే కాంగ్రెస్ సారథ్యంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘జలవనరుల మరమ్మతులు, నవీకరణ, పునరుద్ధరణ పథకం’ చేపట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువుల లాంటి సాంప్రదాయిక నీటివసతులకు మళ్ళీ ఊపిరిపోసే పని చేపట్టింది. అయితే, సమగ్ర సమాచార లేమి వల్ల ఈ పథకాల లక్ష్యాలు ఏ మేరకు సిద్ధించాయో చెప్పలేని పరిస్థితి. తాజా జలగణన ముఖ్యత్వం సంపాదించుకున్నది అక్కడే.
ఆఖరుసారి 2013–14లో చేసిన చిన్న నీటిపారుదల వసతుల సర్వేతో పోలిస్తే, తాజా గణనలో నీటి వసతుల సంఖ్య 5 రెట్లు పెరగడం విశేషం. పట్టణప్రాంత చెరువులు, కుంటల వివరాలపై పౌరసంస్థలు, విద్యాకేంద్రాలే గళమెత్తేవి. వాటి క్రియాశీలత వల్లే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, శ్రీనగర్, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో చెరువులు కనుమరుగవుతున్న తీరు కొంతైనా జనం దృష్టికి వచ్చింది.
ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే జలగణనతో రంగంలోకి వచ్చింది గనక పరిస్థితులు మరింత మెరుగవుతాయని చిన్న ఆశ. గమనిస్తే, ఒకప్పుడు పుష్కలంగా నీళ్ళున్న భారతావని ఇవాళ అధిక జనాభా, పట్టణీకరణతో నీటి కొరత దిశగా జారిపోతోంది. దీనికి తక్షణం పగ్గం వేయాలి.
ప్రపంచంలో 18 శాతం జనాభాకు నెలవైన మన దేశంలో ఉన్న నీటి వనరులు 4 శాతమే. అవసరాలు ఎక్కువ, అందుబాటులో ఉన్న నీరు తక్కువ గనక నీటి కోసం ఒత్తిడీ అధికమే. దానికి తోడు పర్యావరణ మార్పుల ప్రభావం నీటి వసతులు, వాటి నాణ్యత, నిర్వహణ పైన గణనీయంగా పడుతోంది. ఈ పరిస్థితుల్లో జనగణన లాగానే క్రమం తప్పకుండా జల వనరుల గణన చేయడం అవసరం.
పదేళ్ళకోసారి చేసే జనాభా లెక్కల లాగా కాక, వీలైనంత తరచుగా ఈ నీటి లెక్కలు తీయాలి. ప్రతి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికీ, నీటికీ లంకె ఉంది గనక దీంతో నీటి నిర్వహణను మెరుగుపరుచుకొనే వీలు చిక్కుతుంది. అలాగే పట్టణ నిర్మాణం, విస్తరణల్లో పాలకులు సరైన నిర్ణయాలు చేయడానికీ నీటి వసతుల వివరాలు దోహదపడతాయి. స్థానిక సంస్థలను, పౌరసమాజ బృందాలను కూడా ఈ జలగణనలో భాగస్థుల్ని చేస్తే మెరుగైన ఫలితాలొస్తాయి. ఆ దిశగా ఈ నివేదిక తొలి అడుగు. మేలైన ముందడుగు.
జలపథంలో... తొలి పదం
Published Wed, Apr 26 2023 2:39 AM | Last Updated on Wed, Apr 26 2023 2:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment