ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలో ఉండే జలవనరుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషీ ఎందుకో అర్థం కావడం లేదని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. నీటిపై కేంద్రం పెత్తనం చేయడానికి చేస్తున్న ప్రయత్నంతో పాటు అలాంటి అవకాశం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పేనని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి కైలాశ్‌కుమార్, ఫిషర్‌మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్‌లతో కలిసి మాట్లాడుతూ, తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులను ప్రారంభించామని గుర్తుచేసిన పొన్నాల, గత ఏడేళ్లలో సాగునీటి విషయంలో కేసీఆర్ వెలగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంతో తెలంగాణకు ఏం లాభం జరుగుతుందో కేసీఆర్ చెప్పగలరా అని అన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయని, చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని, కృష్ణా బోర్డు పాపం కేసీఆర్‌కు ఊరికేపోదని అన్నారు.
దేశంలో బొగ్గు లేక అనేక విద్యుదుత్పాదన ప్రాజెక్టులు మూతపడ్డాయని, బీజేపీ ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుస్తోందని అన్నారు. కేంద్రం దగ్గర ప్రణాళిక లేని కారణంగానే బొగ్గు కొరత, కరెంటు కోతలు వచ్చాయని, పాలనను పక్కనపెట్టిన బీజేపీ రాజకీయాలపై దృష్టి పెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినన తర్వాత ఒక్క మెగావాట్ కూడా కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయారని పొన్నాల ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment