సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక చెరువులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1,13,425 చెరువులుంటే.. అందులో 1,03,952 చెరువులు వినియోగంలో ఉన్నాయి. అత్యధిక కుంటలు, రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ్ బెంగాల్ మొదటి స్థానంలో నిలిస్తే.. ఊటకుంటలు, చెక్‌డ్యామ్‌లు వంటి జలసంరక్షణ నిర్మాణాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే, అత్యధిక రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. అత్యధిక జలసంరక్షణ నిర్మాణాలున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. చిన్న నీటివనరుల కింద దేశంలో 14,75,29,626.21 హెక్టార్ల ఆయకట్టు ఉంది.
ఇందులో అత్యధిక ఆయకట్టు ఉన్న రాష్ట్రాల్లో 1,19,95,473 హెక్టార్ల ఆయకట్టుతో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో రాజస్థాన్(54,28,765.19 హెక్టార్లు), మూడో స్థానంలో తెలంగాణ (49,71,121.4 హెక్టార్లు) నిలవగా.. 13,37,841 హెక్టార్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. దేశంలో జలవనరుల మొదటి గణన, చిన్న నీటివనరుల ఆరో గణనను కలిపి జలవనరుల గణన పేరుతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్వహించింది. వాటి ఫలితాలను కేంద్ర జల్‌శక్తి శాఖ ఇటీవల విడుదల చేసింది. అందులోని ప్రధానాంశాలివీ..
రాష్ట్రంలో 1,90,777 జలవనరులు..
► దేశంలో 24,24,540 జలవనరులు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 23,55,055 (97.1 శాతం) ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 69,485 (2.9 శాతం) ఉన్నాయి. ఇందులో 14,42,993 (59.5 శాతం) కుంటలు, 3,81,805 చెరువులు (15.7 శాతం), రిజర్వాయర్లు 2,92,280 (12.1 శాతం), ఊటకుంటలు, చెక్ డ్యామ్‌లు 2,26,217 (9.3 శాతం), సరస్సులు 22,361 (0.9 శాతం), 58,885 ఇతరాలు (2.5 శాతం) ఉన్నాయి.
► ఈ జలవనరులలో మానవ నిర్మితమైనవి 18,90,463 (78 శాతం). సహజసిద్ధంగా ఏర్పడినవి 5,34,077 (22 శాతం).
► 20,30,400 జలవనరులు (83.7 శాతం) వినియోగంలో ఉండగా.. 3,94,500 జలవనరులు (16.3 శాతం) ఎండిపోయాయి.
► 7,47,480 (30.8 శాతం) జలవనరులతో పశ్చిమ బెంగాల్ తొలిస్థానంలో నిలిచింది. 2,45,087 (10.1 శాతం) జలవనరులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో, 1,90,777 (7.9 శాతం) జలవనరులతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. 1,81,837 (7.5 శాతం) జలవనరులతో నాలుగో స్థానంలో ఒడిశా, 1,72,492 (7.1 శాతం) జలవనరులతో ఐదో స్థానంలో అస్సోం నిలిచాయి.
► జలవనరులను అత్యధికంగా చేపల పెంపకం, సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు.
ఉపయోగంలో 1,49,279 జలవనరులు..
► ఆంధ్రప్రదేశ్‌లో 14,132 కుంటలు.. 1,13,425 చెరువులు, 62 సరస్సులు, 703 రిజర్వాయర్లు, 57,492 ఊటకుంటలు, చెక్ డ్యామ్‌లు, 4,963 ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో కుంటలు 8,475, చెరువులు 1,03,952, సరస్సులు 60, రిజర్వాయర్లు 667, ఊటకుంటలు, చెక్‌డ్యామ్‌లు 32,011, ఇతరాలు 4,114 వెరసి మొత్తం 1,49,279 ఉపయోగంలో ఉన్నాయి.
►రాష్ట్రంలో 37,257 జలవనరులను సాగునీటి కోసం ఉపయోగించుకుంటుండగా.. 680 వనరులు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగమవుతున్నాయి. చేపల పెంపకం కోసం అత్యధికంగా 69,510 జలవనరులను వినియోగించుకుంటుండగా. తాగునీరు, గృహావసరాల కోసం 1,945 వనరులను వాడుకుంటున్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు 38,460 వనరులు దోహదపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment