అంతర్జాతీయ సమావేశాలకు కేటీఆర్‌  | Minister KTR Invited To World Environmental And Water Resources Meet In US | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సమావేశాలకు కేటీఆర్‌ 

Published Mon, Jan 30 2023 3:07 AM | Last Updated on Mon, Jan 30 2023 3:07 AM

Minister KTR Invited To World Environmental And Water Resources Meet In US - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పర్యావరణ– జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ నేతృత్వంలోని పర్యావరణ–నీటివనరుల సంస్థ(ఏఎస్‌సీఈ– ఈడబ్ల్యూఆర్‌ఐ) ఆహ్వా,నించింది. అమెరికా హెండర్సన్‌లో మే నెల 21 –25 తేదీల మధ్య ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఏఎస్‌సీఈ– ఈడబ్ల్యూఆర్‌ఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బ్రియాన్‌ పార్సన్‌తోపాటు సంస్థ అధ్యక్షుడు షిర్లీ క్లార్క్‌ నాయకత్వంలోని ఓ ప్రతినిధి బృందం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది.

ప్రాజెక్టు పరిధి– సామర్థ్యంతోపాటు నిర్మాణంలో చూపించిన వేగంపట్ల ఆ ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన పలు నీటిపారుదల ప్రాజెక్టులతో తెలంగాణలో చోటుచేసుకున్న సామాజిక, ఆర్థిక ప్రగతిని ప్రశంసించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆ ప్రతినిధి బృందం అతితక్కువ సమయంలోనే నీటివనరుల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించిన తీరుపట్ల అభినందనలు తెలిపింది.  

మెగా ప్రాజెక్టుల గురించి వివరించండి... 
కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడానికి రాష్ట్రప్రభుత్వం అవలంబించిన విధానాలతోపాటు తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా మారిన క్రమాన్ని సమావేశాల్లో వివరించాలని కేటీఆర్‌కు పంపిన ఆహ్వానలేఖలో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ పర్యావరణ–నీటి వనరుల సంస్థ కోరింది. కాగా, 177 దేశాలకు చెందిన 1,50,000 కంటే ఎక్కువమంది సివిల్‌ ఇంజనీర్లు అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌లో సభ్యులుగా ఉన్నారు.

1852లో స్థాపించబడిన ఈ సంస్థ అమెరికాలోనే పురాతన ఇంజనీరింగ్‌ సొసైటీ. భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణ సమస్యల పరిష్కారంతోపాటు నీటివనరుల సంరక్షణపై ఈ సొసైటీ పనిచేస్తోంది. కాగా, ఆరేళ్ల క్రితం 2017 మే 22న అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, నీటిసంరక్షణ కార్యక్రమాల గురించి వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement