ఇదిగో.. ఎడారి ఓడిపోతుంది! | Jalayagnam in rajasthan | Sakshi
Sakshi News home page

ఇదిగో.. ఎడారి ఓడిపోతుంది!

Published Sun, Sep 4 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

ఇదిగో.. ఎడారి ఓడిపోతుంది!

ఇదిగో.. ఎడారి ఓడిపోతుంది!

రాజస్థాన్‌లో మహోద్యమంగా జలయజ్ఞం
ఇసుక నేలల్లో పరుచుకుంటున్న పచ్చదనం

 
- కరువును జయించేందుకు కదిలిన జనం
- వంద కోట్ల విరాళంతో ముందుకు వచ్చిన దాతలు
- ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణ అభియాన్ చేపట్టిన రాష్ట్ర సర్కారు
- జల వనరులకు పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యం
- ఏడు నెలల్లో 500 చెరువులు, కుంటల నిర్మాణం
- నాలుగేళ్లలో 22 వేల గ్రామాలకు జలకళ దిశగా అడుగులు
- భగీరథ యజ్ఞంలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ బిడ్డ శ్రీరాం వెదిరె
 
 రాజస్థాన్.. పర్యాటక రంగానికి పర్యాయపదం. కోటలు.. మహల్‌లు.. చరిత్రకు అద్దం పట్టే కట్టడాలు.. ప్రతీదీ ప్రత్యేకమే. దేశ భౌగోళిక విస్తీర్ణంలో, జనాభాపరంగా అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. పశు పోషణలో దేశానికే ఆదర్శం! కానీ.. జల వనరుల్లేక అల్లాడుతోంది. రాష్ట్ర విస్తీర్ణంలో మూడింట రెండొంతుల భూభాగం ఎడారే. ఒకవైపు వరుస కరువు.. మరోవైపు జల సంరక్షణలో అలసత్వం! వెరసి రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు పెను సంక్షోభమే!! కానీ రాబోయే ఆ ఉపద్రవాన్ని ముందే పసిగట్టిన రాజస్థాన్ దిద్దుబాటు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణను ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తోంది. ఈ యజ్ఞంలో తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ‘మినీచిరపుంజి’గా పేరొందిన ఝాలావర్ జిల్లాలో ఏడు నెలల వ్యవధిలో జల సంరక్షణ కార్యక్రమం ఉద్యమంలా సాగిన తీరును ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఇదే ఈ వారం ఫోకస్..
 - ఝాలావాడ్ నుంచి కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి
 
 ఇదీ రాజస్థాన్..
 దక్షిణ, పడమటి ప్రాంతాల నుంచి ఉత్తర, తూర్పు ప్రాంతం వరకు విస్తరించి ఉన్న రాజస్థాన్‌ను ఆరావళి పర్వత శ్రేణి రెండుగా విభజిస్తోంది. దేశంలో భౌగోళికంగా రాజస్థాన్ 10.4 శాతాన్ని ఆక్రమించగా.. దేశ జనాభాలో 5.5 శాతం, పశు సంపదలో 18.70 శాతంగా ఉంది. అయితే దేశంలో లభ్యమవుతున్న భూ ఉపరితల జలంలో కేవలం 1.16 శాతం, భూగర్భ జలంలో 1.70 శాతం మాత్రమే రాష్ట్రంలో లభ్యమవుతోంది. సగటు వార్షిక వర్షపాతం150 మి.మీ. నుంచి 900 మి.మీ. మధ్య ఉంటోంది. 33 జిల్లాల్లోని 295 బ్లాక్‌లలో.. 95శాతం బ్లాక్‌లు డార్క్ ఏరియాలోనే ఉన్నాయి. చంబల్‌తో పాటు మాహి, కాళిసింధ్, బనాస్, సబర్మతి తదితర నదులున్నా.. ఉపరితల జలం కొరత పీడిస్తోంది. 90 శాతం తాగునీరు, 60 శాతం సాగునీటిని భూగర్భం నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రతీ మూడేళ్లకోమారు కరువు.. ఐదేళ్లకోమారు తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటోంది. వర్షాభావ పరిస్థితులు తర చూ తలెత్తుతుండటంతో.. భూగర్భ జలంపై ఒత్తిడి పెరుగుతోంది.
 
 జలసిరుల దిశగా..
వర్షపాతం, పారే నీరు, భూగర్భ జలం, మట్టిలో తేమ పెంచడం లక్ష్యంగా చేపట్టిన ‘ఫోర్ వాటర్ కాన్సెప్ట్’ కార్యక్రమం పరిధిని విస్తరించి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే జల స్వావలంబన్ అభియాన్ (ఎంజేఎస్‌ఏ)కు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కార్యక్రమానికి మార్గనిర్దేశనం చేసి, అమలు చేసే బాధ్యతను ‘రాజస్థాన్ రివర్ బేసిన్, వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ’కి అప్పగించారు. గ్రామాలు జల స్వయం స్వావలంబన సాధించేందుకు.. నాలుగేళ్లలో రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 22,500 గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతీ దశలో ఏడాదిలోపు పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. 33 జిల్లాల పరిధిలోని 295 పంచాయతీ బ్లాకుల్లో.. ప్రతీ దశలోనూ.. ఒక్కో బ్లాక్‌లో 12 గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. భూగర్భ జల మట్టం, తాగునీరు, నీటిపారుదల, సాగుకు యోగ్యమైన విస్తీర్ణం, పంటల ఉత్పత్తి పెంచడాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. వర్షాభావ ప్రాంతంలో కనీసం 40 శాతాన్ని సాగులోకి తేవడంతో పాటు పంటల రకాల్లోనూ మార్పులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
 
 కరువు నేర్పిన పాఠం..
 రాష్ట్ర విస్తీర్ణంలో 61 శాతాన్ని థార్ ఎడారి ఆక్రమించగా.. దీని మీదుగా వీచే గాలితో భూక్షయం జరుగుతోంది. ఆగ్నేయ, ఈశాన్య ప్రాంతాలు వ్యవసాయానికి అనుకూలమైనా.. నీరు లేదు. రాష్ట్రంలోని భూముల్లో 30 శాతం మేర కొండలు, గుట్టలతో పాటు.. సాగునీటి వసతి లేక నిరుపయోగంగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తూ.. ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలుస్తోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 27 శాతం వ్యవసాయ రంగానిదే! 90 శాతం సాగు విస్తీర్ణం వర్షపాతంపైనే ఆధారపడి ఉంది. సగటు వర్షపాతం నమోదైనా వర్షపు నీటిని నిల్వ చేసే అవకాశం లేక.. జల వనరులు అడుగంటుతున్నాయి. దీంతో వ్యవసాయ రం గం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనాభా పెరుగుదల, పట్టణీకరణ నీటి వనరులకు సవా లు విసురుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 19 జిల్లాలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. 44,672 గ్రామాలకుగాను సుమారు 17 వేలకు పైగా గ్రామాలు తీవ్ర తాగునీటి సమస్యతో సతమతమయ్యాయి. రైళ్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. ఆహార భద్రత, పశువుల మనుగడ సవాలుగా మారింది. దీంతో జల సంరక్షణ ఆవశ్యకత, సహజ వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి రాజస్థాన్‌లో తలెత్తింది.
 
 తొలి ఫలితం.. ఆశాజనకం!
 ఈ ఏడాది జనవరి 27న ఎంజేఎస్‌ఏను ప్రారంభించిన సీఎం.. మొదటి దశ పనులు పూర్తి చేసేందుకు ఐదు నెలల వ్యవధి ఇచ్చారు. మొద టి దశలో 3,529 గ్రామాల్లో రూ.1,800 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఇందులో ఉపాధి హామీ పథకం కింద రూ.400 కోట్లు, ఐడబ్ల్యూఎంపీ కింద రూ.200 కోట్లు కేంద్రం నుంచి రాగా.. మిగతా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. తొలి విడతలో 16.5 లక్షల ఎకరాల పరీవాహక ప్రాంతంలో జల సంరక్షణ పనులు చేపట్టి సుమారు 500కు పైగా చెరువులు, కుంటలు నిర్మించారు. జీఐఎస్, జియో ట్యాగింగ్ సాంకేతికత వినియోగించడంతో పాటు తక్కువ ఖర్చుతో జల సంరక్షణ నిర్మాణాలు చేపట్టారు. డబ్బులు ఆదా చేయడంతో పాటు కాంట్రాక్టర్లకు టర్న్ కీ పద్ధతిలో పనులు అప్పగించారు. తొలి దశ పనులు పూర్తి కావడంతో రెండో దశ పనులను రూ.2,500 కోట్లతో ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రారంభించాలని నిర్ణయించారు. రెండో దశలో 4,200 గ్రామాల ఎంపిక పూర్తి కాగా.. ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో మరో వేయి గ్రామాలను అదనంగా చేర్చబోతున్నారు. సర్వే పూర్తి చేసేందుకు ‘వే పాయింట్ మొబైల్ యాప్’తో పాటు డ్రోన్‌లను వినియోగిస్తున్నారు.
 
 రెండో పంటకు అవకాశం ఏర్పడింది
 ఇక్కడ సగటున 1,300 మిల్లీ మీటర్ల వర్షపాతం ఉన్నా.. కొండ ప్రాంతం కావడంతో వర్షపు నీరు వేగంగా కిందకు పోతోంది. నల్ల రేగడి భూములున్నా పంటలు పండే అవకాశం లేకపోయింది. మొదటి దశలో నా నియోజకవర్గం పరిధిలో 40 వ్యవసాయ కుంటలు నిర్మించారు. వీటి కింద సుమారు 4 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చింది. రెండో విడతలో 98 కుంటల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. గతంలో ఒకే పంట వచ్చేది. ఇప్పుడు రెండో పంటకు అవకాశం ఏర్పడింది. కూరగాయలు, ఉద్యాన పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.
 - కన్వర్ లాల్ జీ  మీనా, ఎమ్మెల్యే, మనోహర్‌థానా
 
 ఎటు చూసినా పచ్చదనమే
 గతంలో ఈ ప్రాంతం ఎడారిలా ఉండేది. వర్షం కురిసినా.. క్షణాల్లో దిగువకు వెళ్లి నదిలో కలిసేది. ఇప్పుడు ఎటు చూసినా నీళ్ల కుంటలు.. పచ్చదనమే! తాగునీటికి, వ్యవసాయానికి ఇబ్బంది లేదు. మేకలు, పశువులకు గడ్డి, నీళ్లకు కరువు లేదు. మాకు ఏడాదంతా నీరు అందుబాటులో ఉంటుంది.
 - రతన్‌లాల్, రైతు, హర్నవాడ
 
 యజ్ఞంలా చేస్తున్నాం
 దేశంలోనే అత్యంత దుర్భిక్ష పరిస్థితులు ఉన్న రాజస్థాన్‌లో.. జల స్వయం స్వావలంబన ద్వారా గ్రామీణుల జీవన స్థితిగతులు మార్చేందుకు ఎంజేఎస్‌ఏ చేపట్టాం. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండేలా ఈ పథకాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నాం. ప్రజలను భాగస్వాములను చేయడంతో పాటు.. జల సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చాం. ఉపరితల జల సంరక్షణ, భూ సంరక్షణ, భూగర్భ జల సామర్థ్యం పెంపు, కాలుష్య నివారణ. నీటి లభ్యత పెంచడం, వర్షపు నీరు ప్రవహించే మార్గంలో సూక్ష్మ వ్యవసాయ నీటి నిలువ ట్యాంకుల (ఎంఐటీలు) నిర్మాణం. ఉపరితల జల ప్రవాహాన్ని నిరోధించి.. నీరు ఇంకేలా చేయడం.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.

ఎంఐటీ దిగువ ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం, నదులపై చెక్‌డ్యాంలు, బ్యారేజీల నిర్మాణం చేపట్టాం. వ్యవసాయ అవసరాలతో పాటు మిగులు నీటిని దృష్టిలో పెట్టుకుని సూక్ష్మ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం తదితరాలను మలి దశలో చేపట్టాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం చంబల్, మాహి నదుల పరిధిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత లూని, వెస్ట్‌బనాస్, సుక్లి, ఈస్ట్ బనాస్, సబర్మతి, పర్బి పరీవాహక ప్రాంతాల్లో పనులు ముమ్మరం చేస్తాం. ప్రభుత్వ విభాగాలు, ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలు, మతపరమైన ట్రస్టులు, నాన్ రెసిడెంట్ విలేజర్లు, సోషల్ గ్రూపుల నుంచి నిధుల సేకరించాలని నిర్ణయించాం. తొలి విడతలో సుమారు రూ.100 కోట్లు సేకరించాం. కాంటూరు గుంతలు, ఇంకుడు కుంటలు, వ్యవసాయ కుంటలు నిర్మించి ఝాలావర్ జిల్లాలో క్యాస్రీ నదికి మళ్లీ ప్రాణం పోయడం మా ప్రాథమిక విజయంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో నదుల అనుసంధానంపైనా కసరత్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఎంజేఎస్‌ఏ పురోగతి, ఫలితాలపై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఆశించిన లక్ష్యాన్ని సాధిస్తాం.
 - శ్రీరాం వెదిరె, ఛైర్ పర్సన్, రాజస్థాన్ రివర్ బేసిన్, వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ
 
 భూగర్భ జలాలు పెరిగాయి
గతంలో కొండలు, గుట్టలతో ఈ ప్రాంతం దు మ్మూ, ధూళితో ఉండేది. ప్రభుత్వ చొరవతో కుంటల నిండా నీరు కనిపిస్తోంది. కాంటూరు తవ్వకాలు, కుంటల నిర్మాణంతో మాకు ఉపాధి దక్కింది. నీటినిల్వతో భూ గర్భ జలాలు కూడా మెరుగయ్యాయి. వ్యవసాయ పనులు పెరిగి ఈ సారి కూలీ పనులు కూడా దొరికాయి.
 - నాథూరాం, రైతు కూలీ, రూప్‌పురా బల్దియా
 
 ఎంజేఎస్‌ఏ వెనుక తెలంగాణ వ్యక్తి
 ఈ జలయజ్ఞంలో తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె కీలక పాత్ర పోషిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఈయన.. రాజస్థాన్ రివర్ బేసిన్, వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ చైర్మన్ హోదాలో ఎంజేఎస్‌ఏ అమల్లో కీలక బాధ్యతలు చూస్తున్నారు. బీజేపీ జల వనరుల విభాగం కన్వీనర్‌గా ఉన్న శ్రీరాం.. ప్రస్తుతం కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. తెహ్రీ జలాశయం వద్ద గంగా నది ప్రవాహానికి సంబంధించిన అరైవల్ ప్రాజెక్టులోనూ కీలకంగా పనిచేశారు. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన అంశాలపై ఆయన పలు పుస్తకాలు రాశారు. తెలంగాణకు చెందిన జల సంరక్షణ నిపుణులు రాకేశ్‌రెడ్డి, జంగారెడ్డి, అఫ్సర్ కూడా ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు.

 సజీవ సాక్ష్యం సరోద్
 ఝాల్రాపాటన్ పంచాయతీ బ్లాక్ పరిధిలోని సరోద్ గ్రామం ఎంజేఎస్‌ఏ స్ఫూర్తికి అద్దం పడుతోంది. 2,224 హెక్టార్లలో విస్తరించి ఉన్న సరోద్‌లో 435 కుటుంబాలు ఉండగా.. గతంలో కేవలం 193 హెక్టార్లు మాత్రమే సాగయ్యేది. ఎంజేఎస్‌ఏలో భాగంగా ఇక్కడ 12 ఇంకుడు కుంటలు, 19 వ్యవసాయ కుంటలు నిర్మించడంతో సాగు స్వరూపమే మారిపోయింది. నీటి లభ్యత పెరగడంతో ఈ ఏడాది 328.99 హెక్టార్లలో పంటలు వేశారు. గతంలో నువ్వులు, జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి పంటల సాగుకు పరిమితం కాగా.. ప్రస్తుతం కొత్తిమీర, గోధుమ, పప్పుధాన్యాలు, కూరగాయలు, సోయా పంటల వైపు మొగ్గు చూపారు. బావులు, బోరు బావుల్లో పుష్కలంగా నీరు లభిస్తోంది. సరోద్‌తోపాటు ఝాలావాడ్ జిల్లాలోని రోజా, ఖేడ్లా, హర్నవాడ తదితర గ్రామాల్లోనూ జలకళ ఉట్టిపడుతోంది.
 
 ‘మొక్క’వోని దీక్షతో అంతా ఏకమై..
 ఎంజేఎస్‌ఏ తొలి విడతలో 26 లక్షల మొక్కలు నాటారు. కాంటూరు గుంతలు, చెరువులు, కుంటల గట్లపై జట్రోపా (బయో ఫ్యూయల్), కలబంద, కానుగతోపాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా మొక్కలు నాటారు. ప్రతీ 150 నుంచి 200 మొక్కలకు ఒక సంరక్షకుడిని నియమించి.. ప్రతీ నెలా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వేతనం అందిస్తున్నారు. రెండో దశలో 70 వేల నుంచి కోటి మొక్కలు నాటి.. ఐదేళ్ల పాటు సంరక్షించేందుకు నిధులు కేటాయించారు. మరోవైపు సీఎం వసుంధర తన అరు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించగా.. విరాళాలు, శ్రమదానం రూపంలో ప్రజలు కూడా ఎంజేఎస్‌ఏలో భాగస్వాములయ్యారు. ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు రూ.55 కోట్లు, వివిధ వర్గాలు రూ.37 కోట్లు నిధులు సమకూర్చాయి. ఆర్మీ, పోలీసు, మీడియా సంస్థలు, మత సంస్థలు శ్రమదానంలో పాల్గొనడంతో పాటు.. లేబర్, జేసీబీ మెషీన్లు, డీజిల్, సిమెంట్, కాంక్రీట్ తదితరాల రూపంలో విరాళం ఇచ్చారు.

 భూమి ధరకు నాలుగింతల పరిహారం
 జల వనరుల అభివృద్ధి కోసం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములను సేకరిస్తున్నారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పరిహారాన్ని నిర్ణయిస్తుంది. భూమి ధరకు అదనంగా 3.5 నుంచి 4 రెట్లు పరిహారం ఇస్తుండగా.. ఇందులో 75 శాతాన్ని ముందే చెల్లిస్తున్నారు. భూమి స్వాధీనం చేసుకున్న తర్వాత చెల్లింపులకు 12 శాతం వడ్డీ ఇస్తున్నారు. పరిహారం తీసుకోని రైతులకు.. జల వనరుల్లో నీరు లేని సమయంలో సాగు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఒక్కో ఎకరాకు సగటున సుమారు రూ.8.05 లక్షల పరిహారం లభిస్తోంది. భూ సేకరణలో కోర్టు కేసులు, అభ్యంతరాలు రాలేదని అధికారులు చెప్పడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement