భూగర్భ జలవనరుల సర్వేను పూర్తి చేయాలి
నెల్లూరు(అర్బన్): ఎన్టీఆర్ జలసిరి పథకం కింద బోర్ల మంజూరుకు భూగర్భ జలవనరుల సర్వేను వెంటనే పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత జియాలజిస్టులకు సూచించారు. శనివారం ఆమె దర్గామిట్టలోని తన చాంబర్‌లో జియాలజిస్టులు, కార్యాలయ సిబ్బందితో ఎన్టీర్ జలసరి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ జలసిరి కింద జిల్లాకు 15,249 బోర్లు మంజూరయ్యాయని తెలిపారు. 2016లో 5వేల బోర్లను వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎంపీడీఓ, ఉపాధి హామీ పథకం సిబ్బంది సమన్వయంతో చిన్న, సన్నకారు రైతులను గుర్తించాలని కోరారు. భూగర్భ జల వనరుల శాఖ ఉపసంచాలకులు రమేష్ మాట్లాడుతూ భూగర్భజల వనరుల సర్వే నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పీడీ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.