ఎవరితోనూ లడాయి వద్దు | Do not make dispute between states for irrigations matter | Sakshi
Sakshi News home page

ఎవరితోనూ లడాయి వద్దు

Published Fri, Apr 1 2016 2:52 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

ఎవరితోనూ లడాయి వద్దు - Sakshi

ఎవరితోనూ లడాయి వద్దు

ఇరుగుపొరుగుతో కూర్చొని మాట్లాడుకొని ముందుకెళదాం
గొడవలతో ఒరిగేది ఏమీ ఉండదు
నదీజలాలపై నేనే చొరవ తీసుకుంటా: కేసీఆర్
బాబుతో మాట్లాడతా.. మహారాష్ట్రతో మాదిరిగానే ఏపీతో వ్యవహరిస్తాం
పోలవరం మీద పట్టింపు అవసరం లేదు
గోదావరిలో పుష్కలంగా జలాలు
భద్రాచలం దిగువన నీటిని వారే వాడుకోవచ్చు
ఏ రాష్ట్రమైనా రైతులు బాగుపడాలని వ్యాఖ్య
ప్రజెంటేషన్‌ను బహిష్కరించిన కాంగ్రెస్, టీడీపీ
2 గంటల 50 నిమిషాల పాటు ప్రసంగం

 
సాక్షి, హైదరాబాద్: జలాల విషయంలో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రతో వ్యవహరించిన మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌తోనూ వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తానే చొరవ తీసుకొని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబును కలుస్తానని.. ఏ రాష్ట్రమైనా రైతులు బాగుపడాలని పేర్కొన్నారు. గురువారం శాసనసభలో తన ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘చండీయాగం చేసిన సమయంలో అమరావతికి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుని కలిశా. ఆయన నాకు మిత్రుడే. అక్కడున్న వారు తెలుగు ప్రజలే. ఒకరి నోరుకొట్టి బ్రతికే స్వభావం మాది కాదు. బతుకు, బతికించు అనే నైజం తెలంగాణ ప్రజలది. నైసర్గికంగా కలిసుండేవాళ్లం. రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. అప్పుడే ఆయనతో మాట్లాడిన. పోలవరం మీద ఎలాంటి పట్టింపుల్లేవు. కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల సరాసరి లభ్యత ఉంటే... పోలవరం వద్ద 2,631.1 టీఎంసీల లభ్యత ఉంది. కాళేశ్వరం వద్ద రోజుకు 3 టీఎంసీల చొప్పున 5 నెలల పాటు అంటే 150 రోజులు నీటిని తెలంగాణ తీసుకున్నా 450 టీఎంసీలకు మించదు. ఒకవేళ వెయ్యి టీఎంసీలు తీసుకున్నా ఇంకా 1,600 టీఎంసీలు ఏపీ వినియోగించుకోవచ్చు. తెలంగాణలో భద్రాచలం దాటితే ఆ నీటిని తెలంగాణ వాడుకోలేదు కాబట్టి ఏపీనే వాడుకోవాలి.
 
 ఆ నీటిని తీసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు. ఆ నీటిని కుడివైపు నాయుడుపేట, శ్రీకాళహస్తి వరకు ఎడ మ వైపు వైజాగ్ వరకు, అదేరీతిన రాయలసీమకు నీళ్లు ఇవ్వవచ్చని చంద్రబాబుకు చెప్పిన. దానిపై వెంటనే స్పందించి వ్యాప్కోస్‌కు సర్వే బాధ్యతలు ఇచ్చారని తెలిసింది. పొరుగు రాష్ట్రాలతో కలహించుకోవడం కాకుండా కలసి సాగుతాం. చిల్లరమల్లర గొడవలొద్దు. అసెంబ్లీ తర్వాత నేనే చొరవ తీసుకుని చంద్రబాబును కలుస్తా. ప్రజెంటేషన్ పెన్‌డ్రైవ్‌ను కూడా సభ ముగిశాక పంపిస్తా..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
 
 నేనేసినన్ని నాణాలు ఎవరేయలే..
 తెలంగాణ పంటలను తడపాలని ఉద్యమ సమయం నుంచే కృష్ణా, గోదావరి తల్లులను మొక్కుతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా తన కారు డ్రైవర్ బాలయ్య, నాణాల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘నాకు సిద్దిపేటకు చెందిన బాలయ్య డ్రైవర్‌గా ఉండేవాడు. ఇరైవె  ఏళ్ల నుంచే ఆయన నాకు డ్రైవర్. ఎప్పుడు పర్యటించినా బాలయ్య తన దగ్గర రూపాయి నాణాలు పెట్టుకునేవాడు. కృష్ణా, గోదావరి నదులను ఎప్పుడు దాటినా నాణాలను నదిలో వేసేవాళ్లం. అలా రాష్ట్రంలో నేనేసినన్ని నాణాలు ఎవరూ వేసి ఉండరు. నదుల్లో నాణాలు వేయడం తెలంగాణలో గొప్ప సంస్కారం. నాణాలు వేసిన ప్రతిసారీ తల్లి గోదావరీ, తల్లి కృష్ణమ్మా మా బీళ్లకు ఎప్పుడు వస్తావమ్మా అనే దండం పెట్టేవాడిని..’’ అని చెప్పారు.
 
 బహిష్కరించిన కాంగ్రెస్, టీడీపీ
 సీఎం ప్రజెంటేషన్‌ను కాంగ్రెస్, టీడీపీలు బహిష్కరించాయి. ప్రజెంటేషన్‌ను బహిష్కరిస్తామని కాంగ్రెస్ బుధవారం రాత్రే వెల్లడించగా... హాజరుకారాదని టీడీపీ గురువారం ఉదయం నిర్ణయించుకుంది. ప్రజెంటేషన్‌కు ముందు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ సభ్యులు సభలోనే ఉన్నప్పటికీ తర్వాత వెళ్లిపోయారు. అయితే కాంగ్రెస్, టీడీపీల వైఖరిపై సీఎం కేసీఆర్ తన ప్రజెంటేషన్ చివరలో మండిపడ్డారు. ఏ భేషజాలకు పోయి, ఎవరి క్షేమం ఆశించి సభకు దూరంగా ఉన్నారో కాంగ్రెస్, టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తానెవరినీ నిందించలేదని, ఎవరినీ తప్పుపట్టలేదని స్పష్టం చేశారు. జరిగిన తప్పిదాలు ఏమిటో, వాటిని ఎలా సరిదిద్దుతున్నామో చెప్పామని... అది వినకుండా అసెంబ్లీ నుంచి పారిపోయారని విమర్శించారు. ‘‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు, కోర్టుల్లో పిల్ వేస్తున్నారు. ప్రాణహితపై సైతం పిల్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుహనా మేధావులను తయారు చేసి ప్రజలను అయోమయం చేయవద్దు..’’ అని మండిపడ్డారు. తమకు ఎవరితోనూ పంచాయతీ వద్దని, పొలాలకు నీళ్లు పారితే చాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించి కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానని చెప్పారు.
 
 2 గంటల యాభై నిమిషాల ప్రసంగం
 నీటి పారుదల రంగంపై సీఎం కేసీఆర్ శాసనసభలో రెండు గంటల యాభై నిమిషాల పాటు ప్రసంగించారు. 1956 నుంచి సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, కేటాయింపుల్లో వినియోగం, ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యాలపై తొలి 45 నిమిషాల పాటు తన స్థానంలో నిలబడి మాట్లాడారు. 12.20 గంటల సమయంలో స్క్రీన్‌ల ద్వారా తన ప్రజెంటేషన్‌ను సీఎం ప్రారంభించారు. మధ్యలో కొన్ని అంశాలను వివరించాల్సి వచ్చినప్పుడు ఒకట్రెండు నిమిషాలు లేచి నిల్చుని మాట్లాడారు. మిగతా సమయమంతా కూర్చుని తన ముందున్న కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేస్తూ వివరణ ఇచ్చారు. 2.35 గంటలకు ప్రజెంటేషన్‌ను ముగించారు.
 
 ఎమ్మెల్సీలకు సీఎం క్షమాపణ
 సీఎం ప్రజెంటేషన్ సందర్భంగా మండలి సభ్యులు శాసనసభ గ్యాలరీలో కూర్చుని వీక్షించారు. ప్రజెంటేషన్ పూర్తయ్యాక సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీలకు క్షమాపణ చెప్పారు. ఎమ్మెల్సీలు శాసనసభలో కూర్చోవడం రాజ్యాంగ నియమాల ప్రకారం చెల్లదని.. అందువల్ల గ్యాలరీలో కూర్చోబెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు లోక్‌సభ సభ్యుడిగా తాను సైతం ప్రేక్షకుల గ్యాలరీ నుంచి వీక్షించానని గుర్తుచేశారు. పెద్ద మనసుతో క్షమించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement