
నీటి వనరులు తగ్గడం పెను ప్రమాదం
- చెరువులు, కుంటలను రక్షించుకోవాలి..
- మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం పిలుపు
అమీర్‌పేట,న్యూస్‌లైన్: ప్రకృతి ప్రసాదమైన నీటివనరులు తగ్గిపోవడం మానవ మనుగడకు పెనుప్రమాదమని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యాక్టివేటెడ్ స్లడ్జ్‌ప్రాసెస్ వందేళ్ల వేడుకలు, జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ లిమిటెడ్ (జేఈటీఎల్) సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం అమీర్‌పేట మ్యారీగోల్డ్ హోట ల్‌లో ఒకే వేదికపై జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అబ్దుల్‌కలాం హాజరై..పారిశ్రామికవ్యర్థ జలాలను శుద్ధి చేసి మొక్కలకు అందిస్తూ పచ్చదనాన్ని పెంపొందించడంలో జేఈటీఎల్ కృషిని కొనియాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నగరంలోనూ చెరువులు, కుంటలు, సరస్సులు ఉండేవని, కానీ చాలావరకు వాటి ఉనికి కోల్పోయాయన్నారు.
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 100 ఏళ్లనాటి చెరువులను, కుంటలను పరిరక్షించే కార్యక్రమం చేపట్టారని, ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని ఆకాంక్షించారు. అందరిలోనూ పర్యావరణ సృ్పహ పెరగాలని, భావితరాలకు కాలుష్యంలేని సమాజాన్ని అందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములుగా నిలుస్తున్న యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్, జేఈటీఎల్‌లు మున్ముందు ఆదర్శవంతమైన కార్యక్రమాలు రూపకల్పన చేయాలని సూచించారు.
కాగా ఎనిర్వాన్‌మెంట్ ఇంజనీర్స్ పితామహుడు ప్రొ.ఆర్‌సీ వాలా అబ్దుల్‌కలాంకు ‘టెర్రారియం’ బహుకరించారు. కార్యక్రమంలో జీఈటీఎల్ చైర్మన్ జీవీకే చౌదరి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు జీఎస్ మర్దా, నీరా డెరైక్టర్ డాక్టర్ వాటే, ఇండియన్ ఎన్విరాన్‌మెంటల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఫరేఖ్ తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవడం బాధ్యతగా గుర్తించాలని, అయితే అభ్యర్థుల గుణగణాలను బట్టి ఓటెరికి వేయాలో మీరే ఎంచుకోవాలని అబ్దుల్‌కలాం సూచించారు. అమీర్‌పేట సెస్ ఆడిటోరియంలో యునిసెఫ్ ఆధ్వర్యంలో ‘చైల్డ్ అండ్ సోషల్‌స్టడీస్’పై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరగాలన్నారు. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటినే విజయానికి సోపానాలుగా మలుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సెస్ చైర్మన్ ప్రొ.రాధాకృష్ణ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ.హనుమంతరావు, యునిసెఫ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల చీఫ్ రూత్‌లక్స్‌కేనా రియానో, డెరైక్టర్ గాలబ్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.