‘హద్దు’లపై నిద్దరేల!
♦ చెరువుల సర్వే జాప్యంపై ఇంజినీర్లకు కలెక్టర్ అక్షింతలు
♦ సర్వేలో సహకరించడంలేదని తహసీల్దార్ల ఫిర్యాదు
♦ వారానికి 5-7 చెరువులకు ఎఫ్‌టీఎల్ నిర్ధారించాలని ఆదేశం
♦ ఈ ఏడాది చివరినాటికి సర్వే పూర్తి చేయాల్సిందే
♦ ఈ వ్యవహారంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
♦ హెచ్‌ఎండీఏ పరిధిలో సర్వే చేయాల్సినవి 385
♦ ఇప్పటివరకు 38 చెరువులకు మాత్రమే మోక్షం
నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంపై జిల్లా యంత్రాంగం కన్నెర్రజేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల సర్వే ప్రక్రియ నత్తనడకన సాగడంపై ఆగ్రహించింది. చెరువుల ఎఫ్‌టీఎల్ (హద్దు) నిర్ధారణకు సంబంధించిన సర్వే నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు సంస్థ సహా ఇంజినీరింగ్ అధికారులకు అక్షింతలు వేసింది. వర్షాకాలం వచ్చినా సర్వే పనులు పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ రఘునందన్‌రావు.. ప్రతివారం 5-7 చెరువులను సర్వే చేసి ఎఫ్‌టీఎల్‌ను గుర్తించాలని నిర్దేశించారు. ఈ మేరకు 12 మంది నీటిపారుదల /హెచ్‌ఎండీఏ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. వీరిలో డిప్యూటీ ఈఈ మొదలు ఎస్‌ఈ వరకు ఉన్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని జలవనరులను పరిరక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కబ్జాకోరల్లో చిక్కుకున్న ఈ చెరువులకు ఎఫ్‌టీఎల్ బోర్డులను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు ఇరిగేషన్, ప్రైవేటు కన్సల్టెన్సీకి సర్వే పనులు అప్పగించింది. స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
సర్వేకు నోచుకున్నవి కొన్నే..
హెచ్‌ఎండీఏ పరిధిలో 385 చెరువులను సర్వే చేయాలని ప్రణాళిక తయారు చేసింది. వీటిలో ఇప్పటివరకు 38 చెరువులకు మాత్రమే మోక్షం కలిగింది. వీటి సర్వే ప్రక్రియ పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు హద్దురాళ్లను ప్రకటించారు. మిగతావాటిలో కేవలం 55 చెరువులకు సంబంధించిన సమాచారం స్థానిక తహసీల్దార్లకు పంపారు. ఈ నేపథ్యంలో చెరువుల ఎఫ్‌టీఎల్ గుర్తింపుపై జరిగిన సమావేశంలో నీటిపారుదలశాఖ అధికారుల వ్యవహారశైలిపై తహసీల్దార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువుల సర్వేపై ఇరిగేషన్ ఇంజినీర్లు, ఆర్‌వీ అసోసియేట్స్ ప్రతినిధులు సహకరించడంలేదని మొర పెట్టుకున్నారు.
ఈ పరిణామంతో అవాక్కయిన కలెక్టర్ రఘునందన్‌రావు చెరువుల సర్వేపై డెడ్‌లైన్ విధించారు. ఈ ఏడాది చివరికల్లా సర్వే ప్రక్రియ పూర్తి చేసి హద్దులను ప్రకటించాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా సర్కారీ శిఖం భూములను కూడా గుర్తించాలని నిర్దేశించారు. ప్రతివారం ఐదు నుంచి ఏడు చెరువులను సర్వే చేయాలని, శేరిలింగంపల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఏదైనా మండలంలో 50-100 చెరువులుంటే అదనంగా ఏఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చెరువుల సంరక్షణకు ఉద్దేశించిన ఈ సర్వేను ఆషామాషీగా తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని, నిర్దేశించిన పరిమితి మేరకు ప్రతివారం తనకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.