బెంగళూరు డెడ్ సిటీ!
♦ ఐదేళ్లలో కాంక్రీటు అరణ్యంగా మారనున్న ఉద్యాన నగరి
♦ పెరుగుతున్న భవనాలు, తరుగుతున్న నీటివనరులు
బెంగళూరు: పచ్చని చెట్లు, కనువిందైన పార్కులు, చెరువులతో కళకళలాడే ఉద్యాననగరి, సిలికాన్ సిటీ బెంగళూరు వచ్చే ఐదేళ్లలో మొత్తం కాంక్రీటు కీకారణ్యంగా మారి, మృతనగరమైపోనుందా? నగరంలోని చెట్టూచేమా, ప్రాణాధారమైన నీటివనరులు మాయమైపోయి నివాసానికి ఏమాత్రం పనికిరాకుండా పోనుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు అవుననే అంటున్నారు! ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్(ఐఐఎస్‌సీ) అధ్యయంలో ఇలాంటి మరెన్నో చేదు నిజాలు వెలుగు చూశాయి.
మతిలేని అభివృద్ధి..: ఐఐఎస్‌సీ అధ్యయనం ప్రకారం.. నగరంలో భవనాలతో కూడిన ప్రాంతం గత 40 ఏళ్లలో 525 శాతం పెరిగింది. చెట్టుచేమల ప్రాంతం 78 శాతం తగ్గిపోయింది. జలవనరులు 79 శాతం తగ్గాయి. ‘ఇదంతా మతిలేని, ముందుచూపులేని అభివృద్ధి. ప్రణాళికలేని పట్టణీకరణ వల్ల బెంగళూరు వచ్చే ఐదేళ్లలో నివాసయోగ్యం కాకపోవడంతోపాటు మృతనగరం(డెడ్ సిటీ)గా మారనుంది. ప్రైవేటు డెవలపర్లు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. నగరంలో 15 నుంచి 20 శాతం ఖాళీస్థలం ఉండాలన్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారు’ అని ఐఐఎస్‌సీలోని సెంటర్ ఫర్ ఎకలాజికల్ సెన్సైస్‌కు చెందిన ప్రొఫెసర్ రామచంద్ర తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోవాలని, భవన నిర్మాణాలను తగ్గించేందుకు.. కొత్త పరిశ్రమలకు అనుమతి ఇవ్వకూడదని సూచించారు.
రాజకీయ నాయకులకు బీడీఏ వత్తాసు
బెంగళూరు అభివృద్ధి సంస్థ(బీడీఏ) రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం భూములను పందేరం చేస్తోందని, దీంతో భవన నిర్మాణాలు విపరీతంగా పెరిగి, పర్యావరణానికి ముప్పు తెస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. ‘ప్రస్తుత అభివృద్ధి పర్యవసానాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూమి, నీటిపై సరైన విధానం లేదు. భూమిని రాజకీయనేతలు వాళ్ల ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని పర్యావరణవేత్త ఎల్లప్పరెడ్డి చెప్పారు. 40 వేల ఎకరాల ఖాళీ స్థలంలో పార్కులు,నీటి వనరులను ఏర్పాటు చేయాలన్నారు.