ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే హెచ్చరికలు జారీ చేశారు. వినాయక్ దామోదర్ సావర్కర్(వీర సావర్కర్)ను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని.. ఇది విపక్ష కూటమిలో విభేదాలకు దారి తీయొచ్చని సున్నితంగా రాహుల్‌ను మందలించారు.
ఆదివారం మాలేగావ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఉద్దవ్ థాక్రే ప్రసంగిస్తూ.. ‘‘వీరసావర్కర్ మా దేవుడు. ఆయన్ని అవమానించేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మా దేవుళ్లను అంటూంటే మేం చూస్తూ ఊరుకోవాలా?’’ అని థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్ 14 ఏళ్లపాటు అండమాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించారు. అది ఊహాకు కూడా అందనిది. అదొక త్యాగం. అలాంటి త్యాగాలను అవమానిస్తే ఊరుకోవాలా? అని రాహుల్ గాంధీని ఉద్దేశించి థాక్రే ప్రసంగించారు. అయితే..
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ, రాహుల్ గాంధీని ఉద్దేశ్యపూర్వకంగా తన వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారని, తద్వారా పోరాట సమయం వృథా అవుతోంది అని ఉద్దవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. ఇదిలా ఇలాగే కొనసాగితే.. విపక్ష కూటమి ముక్కలయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చివర్లో హెచ్చరించారు కూడా.
తాజాగా అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ మీడియా ముందు మాట్లాడుతూ.. ‘క్షమాపణలు చెప్పేందుకు తానేం సావర్కర్‌ను కాదని, తాను గాంధీనని, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పినట్లు చరిత్రలో లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు.
2019 కర్నాటక ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలు, పరువు నష్టం దావా.. చివరకు తాజాగా ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడింది రాహుల్ గాంధీకి. ఆ వెంటనే ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. అయితే ఈ పరిణామాలపై మిత్రపక్షం శివసేన (యూబీటీ) రాహుల్‌కు మద్దతుగా నిలిచింది. రాహుల్‌పై బీజేపీ విమర్శలను స్వయంగా తిప్పికొట్టారు ఉద్దవ్ థాక్రే. ‘‘మోదీ భారతదేశం కాదు. మన స్వాతంత్ర్య సమరయోధులు ఇందుకోసమే ప్రాణాలర్పించారా? మోదీని ప్రశ్నించడం అంటే.. భారత్‌ను అవమానించడం ఏమాత్రం కాదు’’ అని థాక్రే వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికలపై కమల్ హాసన్ కామెంట్
Comments
Please login to add a commentAdd a comment