
బ్యాంకాక్: భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ.. ఆ తరహా వ్యాఖ్యలు మంచిది కాదంటూ సుతిమెత్తగా మందలించారు.
‘భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆ తరహా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియాకు తెలిపారు.‘ ప్రజాస్వామ్యయుత, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్ కు భారతదేశం మద్దతు ఇస్తుంది. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సహకారంతో ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు అందించిందని ప్రధాని మోదీ చెప్పినట్లు విక్రమ్ మిస్రి పేర్కొన్నారు.
ఈ స్ఫూర్తితో ఇరు దేశాలు ముందుకు సాగాలని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఇటువంటి తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు అనవరసమని మోదీ సూచించారన్నారు. అక్రమంగా బోర్డర్లు దాటడం వంటి ఘటనలకు కఠినంగా శిక్షలు అమలు చేయాలని, ప్రత్యేకంగా రాత్రి పూట బోర్డర్ల వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉందని మహ్మద్ యూనస్ కు విజ్ఞప్తి చేశారు మోదీ. బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని బంగ్లా చీప్ అడ్వైజర్ ను అడిగినట్లు మిస్రి పేర్కొన్నారు. ప్రధానంగా బంగ్లాలో ఉన్న మైనార్టీల రక్షణ గురించి, వారి హక్కుల గురించి ప్రధాని ఆరా తీశారన్నారు.
భారత్ గురించి బంగ్లా చీఫ్ అడ్వైజర్ ఏమన్నారంటే..
చైనా పర్యటన సందర్భంగా యూనస్ చేసిన వ్యాఖ్యలు భారత్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సాగర రక్షకుడిగా ఉందంటూ వ్యాఖ్యానించారు. చైనాకు ఇది ఒక సువర్ణావకమన్నారు. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత్ లో పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకోగా, దీనికి తాజాగా ప్రధాని మోదీ కౌంటర్ తో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.