
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఇకపై ఎన్ని వేవ్‌లు వచ్చినా మన దేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదని చెబుతున్నారు. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో పెరిగిన నిరోధక శక్తి వల్ల ఇకపై వచ్చే వేవ్‌లు ప్రభావం చూపలేవని ఎయిమ్స్ ఎపిడిమాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు. ‘‘కరోనాలో ఇప్పటికే వెయ్యికి పైగా మ్యుటేషన్లు జరిగాయి. వాటిలో ఐదు వేరియెంట్లే ఎక్కువ ప్రభావం చూపాయి. కరోనా రెండో వేవ్ భారత్‌లో తీవ్ర ప్రభావం చూపినా డెల్టా వేరియెంట్ వల్ల అత్యధికుల్లో ఏర్పడ్డ రోగనిరోధక శక్తి ఇకపై వచ్చే వేవ్‌ల నుంచి కాపాడుతుంది’’ అన్నారు. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ జుగల్ కిశోర్ చెప్పారు.
కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధి తగ్గింపు
కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించారు. తొలి డోసు తర్వాత 8 నుంచి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవడానికి అనుమతిస్తూ నీతి అయోగ్ (ఇమ్యూనైజేషన్) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 12–16 వారాలు (84 రోజులు)గా ఉంది.